ఆర్మీ అధికారులు, సిబ్బంది దేశ రక్షణ కోసం ఏ విధంగా కృషి చేస్తారో అందరికీ తెలిసిందే. నిత్యం ఎల్లవేళలా, 24 గంటల పాటు దేశ సరిహద్దుల్లో ఉంటూ ఉగ్రవాదుల నుంచి, వారి దాడుల నుంచి, శత్రు దేశాల దాడులు నుంచి మన దేశాన్ని, అందులోని ప్రజలందరినీ రక్షిస్తూనే ఉంటారు. వారు అహోరాత్రులు పనిచేస్తుండబట్టే మనం ఈ రోజు ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, హాయిగా జీవించగలుగుతున్నాం. ఈ క్రమంలో పలు సందర్భాల్లో శత్రువులతో జరిగే యుద్ధాల్లో మన సైనికులు వీర మరణం పొందుతారు కూడా. అలాంటి వారికి ప్రభుత్వం ఎన్నో అవార్డులు, రివార్డులు, బిరుదులు ఇస్తుంది. కానీ నిజానికి వారికి మనం ఏమిచ్చినా రుణం తీర్చుకోలేం. ఆ సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే అలాంటి ఓ వీరుడైన ఆర్మీ అధికారికి ఆ గ్రామ వాసులు తాము ఎంతో గౌరవంగా భావించే తమ వర్గానికి చెందిన బిరుదును ఇచ్చి సత్కరించారు. ఆ అధికారిని దేవుడి కన్నా ఎక్కువగా ఆరాధించడం మొదలు పెట్టారు. ఆ సైనికాధికారి చేసిన సాహసం, చూపించిన మానవత్వం అలాంటివి మరి. అందుకే అతను వారి పాలిట దేవుడి కన్నా ఎక్కువే అయ్యాడు. అతనే కల్నల్ డీపీకే పిళ్లై…
అది 1994వ సంవత్సరం. కల్నల్ డీపీకే పిళ్లై మణిపూర్ సరిహద్దులో పలు గిరిజన గ్రామాలను రక్షించే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఆ రోజు జనవరి 25. అప్పటికే ఎన్నో రోజులుగా ఆ బాధ్యతలో ఉన్న పిళ్లైకి ఆ రోజు అసలైన సవాల్ ఎదురైంది. ఆ గ్రామాల్లోని ఇండ్లలో చొరబడ్డ ఉగ్రవాదులు ప్రజలను ఇష్టానుసారంగా కాల్చేస్తూ దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఒక్కో ఇంటిని సోదా చేస్తూ సైనిక ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. వారిలో పిళ్లై కూడా ఉన్నాడు. ఈ క్రమంలో అతను ఓ ఇంటికి వెళ్లి తలుపు ఓపెన్ చేయగానే ఉగ్రవాదులు అతని మీదకు ఏకే 47లతో బుల్లెట్ల వర్షం కురిపించారు. వాటి నుంచి తప్పించుకుందామని పిళ్లై ప్రయత్నించినా ఒక బుల్లెట్ భుజానికి, మరో రెండు బుల్లెట్లు ఛాతీకి తగిలాయి. దీంతో పిళ్లై తీవ్ర గాయాలకు గురయ్యాడు. అయితే అప్పుడే ఉగ్రవాదులు ఓ గ్రెనేడ్‌ను పిళ్లై పైకి విసిరారు.
చీకట్లో సరిగ్గా కనిపించకపోవడంతో పిళ్లై గ్రెనేడ్‌ను సరిగ్గా చూడలేకపోయాడు. కానీ చివరి సెకన్లో తన మీదకు వస్తున్న గ్రెనేడ్‌ను చూసి కాలితో అవతలికి తన్నే ప్రయత్నం చేశాడు. అప్పటికే గ్రెనేడ్ పేలిపోయి అతని కాలు ఒకటి తునాతునకలై శరీరం నుంచి విడిపోయింది. అయినా పిళ్లై వెనుకడుగు వేయలేదు. ఇంకా శత్రువులతో పోరాడేందుకు ముందుకు వెళ్లాడు. ఆ క్రమంలోనే ఇంట్లో నక్కి ఉన్న ఉగ్రవాదులపై తన గన్‌తో బుల్లెట్ల వర్షం కురిపించి వారిని మట్టి కరిపించాడు. అయితే ఆ ఫైరింగ్ జరిగేటప్పుడు అదే ఇంట్లో ఓ మూలన ఉన్న ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. దీన్ని గమనించిన పిళ్లై వారిని సమీపంలో ఉన్న హెలికాప్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే తీవ్ర గాయాల పాలైన పిళ్లై ఇంకా ఆలస్యం చేస్తే తన ప్రాణాలు పోతాయని తెలిసినా ఆ పిల్లలనే ఆస్పత్రికి తీసుకెళ్లమని తన తోటి సిబ్బందికి చెప్పాడు. దీంతో వారు ఆ పిల్లల్ని సురక్షితంగా హాస్పిటల్‌కు చేర్చి వైద్యం చేయించారు. అనంతరం వచ్చిన మరో హెలికాప్టర్లో పిళ్లై హాస్పిటల్‌కు వెళ్లి తన ప్రాణాలను ఎట్టకేలకు రక్షించుకోగలిగాడు.
అయితే ఆ దాడుల్లో కల్నల్ పిళ్లై చూపిన తెగువకు భారత ప్రభుత్వం మెచ్చి అతన్ని శౌర్య చక్ర బిరుదుతో సత్కరించింది. కాగా 2012లో తాను ఒకప్పుడు ఆ ఇద్దరు పిల్లలను రక్షించిన మణిపూర్‌లోని గ్రామానికి వెళ్లాడు. అన్ని సంవత్సరాలు గడిచినా అక్కడి ప్రజలు మాత్రం అతన్ని మరిచిపోలేదు. పిళ్లైకి ఆ గ్రామ వాసులు ఘన స్వాగతం చెప్పడమే కాదు, దేవుడికి మళ్లే అతనికి మొక్కారు. తమ సామాజిక వర్గంలో అత్యంత ఉన్నతంగా భావించే పమెయ్ అనే బిరుదుతో పిళ్లైని సత్కరించారు. అయితే ఇప్పుడా గ్రామం ఒకప్పటి పల్లెలా లేదు. రోడ్లు వేశారు. డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇంకా ఇతర సౌకర్యాలను కూడా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా చిన్నారులతోపాటు దేశాన్ని రక్షించే క్రమంలో పిళ్లై చేసిన సాహసాన్ని మరువలేం. ఇలాంటి సైనికులే మనకు కావాలి. అంతేకదా..!