ఇంగ్లిష్ అంటే ఆ గ్రామంలోని పిల్ల‌ల‌కు భ‌యం లేదిక‌… అంతలా వారిని తీర్చిదిద్దింది ఆ యువ‌తి..!

నేడు న‌డుస్తోంది పోటీ ప్ర‌పంచం. అన్ని రంగాల్లోనూ ప్ర‌స్తుతం తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. అది సంస్థ‌ల మధ్యే కాదు, వ్య‌క్తుల మ‌ధ్య కూడా ఉంది. ఈ క్ర‌మంలో విద్యారంగంలో ఉండే పోటీ గురించి అంద‌రికీ చెప్పాల్సిన ప‌ని లేదు. అన్ని విద్యార్హ‌త‌లు ఉండి, నైపుణ్యాలు ఉన్నా ఉద్యోగం రావ‌డం చాలా క‌ష్ట‌త‌ర‌మైపోతోంది. అయితే నేటి త‌రుణంలో ఒక అభ్య‌ర్థికి ఎంత విద్యార్హ‌త ఉన్నా, నైపుణ్యం ఉన్నా ఇంగ్లిష్ ధారాళంగా వ‌చ్చి ఉండాల్సిందే. లేదంటే ఇత‌రుల‌తో పోటీ ప‌డ‌లేరు. వెనుకబ‌డి పోతారు. న‌గ‌రాలు, ఒక మోస్త‌రు పట్ట‌ణాల్లో ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లు, కాలేజీల్లో చ‌దివే విద్యార్థుల‌కైతే ఇంగ్లిష్ చెప్పుకోద‌గిన విధంగానే వ‌స్తుంది. కానీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో, అందులోనూ గ్రామాల్లో విద్య‌ను అభ్య‌సించే వారికి ఇంగ్లిష్ రావ‌డం లేదు. దీంతో వారు ఇత‌రుల‌తో పోటీ ప‌డ‌లేక అన్ని విధాలుగా వెనుక‌డుగు వేస్తున్నారు. ఏదైనా ఉద్యోగం చూసుకుందామ‌నుకున్నా ఇంగ్లిష్ త‌ప్ప‌నిస‌రి కావ‌డంతో స‌రైన ప్ర‌తిభ ఉన్నా వారికి ఉద్యోగాలు రావ‌డం లేదు. ఈ క్ర‌మంలో అలాంటి నిరుద్యోగులు త‌యారు కాకుండా ఉండేందుకు గాను, వారు కూడా ఇత‌రుల్లా అన్ని రంగాల్లోనూ రాణించేందుకు గాను ఆ యువ‌తి కృషి చేస్తోంది. ఇంత‌కీ ఆమె ఎవ‌రు..? ఏం చేసింద‌నేగా మీరు అడ‌గ‌బోయేది..? అదే తెలుసుకుందాం రండి..!

english-teaching-diya

ఆమె పేరు దియా షా. ముంబైలో నివాసం ఉంటోంది. ఇటీవ‌లే ఐసీఎస్ఈ బోర్డ్ ప‌రీక్ష‌ల‌ను రాసింది. ఈ క్ర‌మంలో ఇంటర్న్‌షిప్ కోసం స్వదేశ్ అనే పేరున్న ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌లో చేరింది. వారు ఆమెకు ఓ గ్రామంలో ఉన్న మ‌హిళా సంఘాల ప‌నితీరుపై ఇంట‌ర్న్‌షిప్ చేయ‌మ‌ని ఇచ్చారు. కానీ ఆ ప‌నిలో ఆమెకు అంతా బోర్‌గా అనిపించేది. కాగా ఒక సారి వీకెండ్‌లో ప‌క్క‌నే ఉన్న ఖామ్‌గావ్ అనే గ్రామానికి వెళ్లింది. అక్క‌డ ఎంతో ప్ర‌తిభ, నైపుణ్యం ఉన్న ప‌లువురు విద్యార్థుల‌ను ఆమె చూసింది. అయితే వారిలో ఒక్క విష‌యాన్ని ఆమె గ‌మ‌నించింది. అదేంటంటే ఆత్మ‌న్యూన‌తా భావం. ఇంగ్లిష్ స‌రిగ్గా రాక‌పోవడంతో ఆ విద్యార్థులు త‌మ‌ను తాను త‌క్కువ‌గా భావించే వారు. ఈ క్ర‌మంలో వారు పెద్ద‌య్యాక పైన చెప్పిన విధంగా నిరుద్యోగులుగా మారిపోతార‌ని ఆమె భావించి, వెంట‌నే త‌ను ఓ నిర్ణ‌యం తీసుకుంది. అదేమిటంటే వారికి ఇంగ్లిష్ బోధించ‌డం.

diya-shah

అయితే దియా ఆ విద్యార్థుల‌కు ఇంగ్లిష్ బోధించ‌డం కోసం త‌ను ఇంట‌ర్న్‌షిప్ చేస్తున్న స్వ‌చ్ఛంద సంస్థ సీఈవో ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సి వ‌చ్చింది. కానీ అందుకు ఆ సీఈవో కూడా అడ్డు చెప్ప‌లేదు. ఈ క్ర‌మంలో త‌న నివాసాన్ని ఇంట‌ర్న్‌షిప్ కేంద్రం నుంచి ఆ గ్రామానికి మార్చుకుంది. నిత్యం త‌న ప‌ని అయిపోగానే సాయంత్రం ఇంటికి వ‌చ్చి ఆ గ్రామంలోని పిల్ల‌ల‌కు ఇంగ్లిష్ పాఠాల‌ను బోధించేది. అయితే మొదట్లో కేవ‌లం ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే ఆమె వ‌ద్ద ఇంగ్లిష్ నేర్చుకోవ‌డానికి వ‌చ్చారు. కానీ త‌రువాతి కాలంలో ప‌దుల సంఖ్య‌లో ఆమె ద‌గ్గ‌ర‌కు రావ‌డం మొద‌లు పెట్టారు. అలా 2 నెల‌ల పాటు ఆమె అక్క‌డి విద్యార్థుల‌కు ఇంగ్లిష్ భోధించింది. దీంతో వారిలో ఎన్న‌డూ లేని మార్పు వ‌చ్చింది. వారే స్వ‌యంగా ఇంగ్లిష్ వాక్యాల‌ను, ప‌దాల‌ను, అర్థాల‌ను నేర్చుకోవ‌డం మొద‌లు పెట్టారు. అప్ప‌టి నుంచి వారు ఆమెతో ఇంగ్లిష్‌లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌డం స్టార్ట్ చేసేశారు. దీంతో దియా ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అయితే ప్ర‌స్తుతం ఆమె ఇంట‌ర్న్‌షిప్ ముగిసి అక్క‌డి నుంచి వ‌చ్చేసినా, త్వ‌ర‌లో మ‌ళ్లీ ఇలాంటి ట్యూష‌న్ ద్వారా ఇంగ్లిష్ బోధిస్తాన‌ని చెబుతోంది. ఆమె చేస్తున్న ప‌నికి నిజంగా ఆమెను మనం అభినందించాల్సిందే..! క‌దా..!

Comments

comments

Share this post

scroll to top