నటుడు రజనీకాంత్ నటించిన శివాజీ సినిమా చూశారు కదా. అందులో రజనీ విదేశాల నుంచి వచ్చి భారత్‌లో ట్రస్ట్ ఓపెన్ చేసి దాని ద్వారా పేద విద్యార్థులకు ఉచితంగా విద్యనందించాలని చూస్తాడు. ఆ క్రమంలోనే అందుకు అవసరమైన భవనాలను నిర్మించేందుకు గాను అనుమతుల కోసం వెళితే ప్రభుత్వ ఉద్యోగులు లంచం అడుగుతారు. కానీ రజనీ లంచం ఇవ్వనంటాడు. ఇక ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఎలాగో లంచం ఇచ్చి రజనీ ఆ నిర్మాణాలను పూర్తి చేస్తాడు. అయితే సినిమాల్లో అలా లంచం ఇచ్చి పనిచేయించుకున్నారు కానీ, నిజ జీవితంలో ఆ 9 మంది ఐటీ ఉద్యోగులు మాత్రం లంచం ఇవ్వకుండానే తాము అనుకున్నది సాధించారు. అవును, ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
అతని పేరు శశికుమార్. ఇల్లినాయిస్ స్టేట్ యూనివర్సిటీలో చదివాడు. కర్ణాటక వాసి. చేస్తున్న ఐటీ జాబ్‌ను విడిచిపెట్టి అక్షయకల్ప ఫామ్స్ పేరిట ఓ డెయిరీ ఫాంను నెలకొల్పాడు. 2011లో ఆ ఫాం ప్రారంభమైంది. కర్ణాటకలోని హసన్ జిల్లా కొదిహల్లి గ్రామంలో ఆ ఫాంను పెట్టాడు. అందుకు అతని 8 మంది స్నేహితులు సహకారం అందించారు. చుట్టూ ఉన్న గ్రామాల్లో నివసించే పాడి రైతులకు మేలు చేయడం కోసం, వారి బతుకులు బాగు చేయడం కోసం శశికుమార్ ఆ డెయిరీ ఫాం పెట్టాడు. అయితే ఆ ఫాం ప్రారంభం అయ్యేందుకు 4 ఏళ్లకు పైనే పెట్టింది. ఎందుకంటే… ప్రభుత్వ ఉద్యోగుల లంచం వల్ల. అవును, అదే.
పైన చెప్పాం కదా, రజనీ సినిమా గురించి, సరిగ్గా శశి, అతని స్నేహితులకు ఇదే పరిస్థితి ఎదురైంది. ఫాం నిర్మాణం కోసం అనుమతులు ఇచ్చేందుకు అధికారులు ససేమిరా అన్నారు. విద్యుత్, స్థలం, పంచాయతీ అనుమతి తదితర పత్రాల కోసం సంబంధిత శాఖల అధికారులు శశిని లంచం అడిగారు. అయితే వారు స్వతహాగా గాంధీజీ సిద్ధాంతాలను పాటించేవారు. దీంతో శశి, అతని స్నేహితులు ఎవరూ లంచం ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారు. నిజాయితీగా డెయిరీ ఫాం కోసం యత్నించారు. అందుకు వారు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. ఓ దశలో ప్రభుత్వ అధికారులకు చెందిన గూండాలు వారిని బెదిరించారు కూడా. అయినా వారు లొంగలేదు. చివరకు అక్షయకల్ప ఫాంను వారు ప్రారంభించారు. దీంతో హసన్ జిల్లా పరిధిలో ఉన్న పలు గ్రామాలకు చెందిన పాడి రైతులకు ఎంతగానో లబ్ది చేకూరుతోంది.
ఇప్పుడు ఆ ప్రాంతాల్లో ఉన్న 160 మంది రైతులు ఒక్కొక్కరు రోజుకు 50 లీటర్ల వరకు పాలను అక్షయకల్ప డెయిరీ ఫాంకు సప్లై చేస్తున్నారు. దీంతో వారికి లీటర్‌కు రూ.32 చొప్పున లభిస్తున్నాయి. ఈ క్రమంలో వారు నెలకు 50 x 30 = 1500 లీటర్లు సరఫరా చేస్తూ 1500 x 32 = రూ.48వేల వరకు నెలకు సంపాదిస్తున్నారు. ఇది వారు ఈ 6 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి. ఇదే ఫాంను మరిన్ని గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని చెబుతున్నారు శశికుమార్ బృందం. వారు చేస్తున్న మంచి పనిని నిజంగా అందరూ అభినందించాల్సిందే కదా..!