పాలు, గుడ్లు, కూర‌గాయలు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

మ‌నం తినే ఏ ఆహార ప‌దార్థం కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండ‌దు. ముఖ్యంగా కూర‌గాయ‌లు, పండ్లు, గుడ్లు వంటివైతే చాలా త్వ‌ర‌గా పాడైపోతాయి. ఈ క్రమంలో వాటిని సంర‌క్షించుకునేందుకు చాలా మంది ఆయా ఆహార ప‌దార్థాల‌ను ఫ్రిజ‌ల‌లో పెడుతుంటారు. అయిన‌ప్ప‌టికీ కొన్ని ప‌దార్థాలు పాడైపోతాయి. అయితే అలా పాడుకాకుండా ఇంకొంచెం ఎక్కువ రోజులు ఆహార ప‌దార్థాలు నిల్వ ఉండేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాలు
పాలు ఒక‌టి, రెండు రోజుల క‌న్నా ఎక్కువ ఉండ‌వు. అయితే ఈ టిప్ పాటిస్తే వాటిని క‌నీసం 4 నుంచి 6 వారాల వ‌ర‌కు స్టోర్ చేయ‌వ‌చ్చు. అదెలాగంటే… ఒక బాటిల్‌లో పాల‌ను నింపాలి. అలాగ‌ని చెప్పి బాటిల్ మొత్తం నింప‌కూడ‌దు. క‌నీసం 60:40 నిష్పత్తిలో పాల‌ను ఉంచాలి. అంటే.. బాటిల్‌లో 60 శాతం పాల‌ను నింపి 40 శాతం మేర ఖాళీ ఉంచాలి. అనంత‌రం దాన్ని ఫ్రీజింగ్ చేయాలి. అంటే డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో ఆ పాలు గ‌డ్డ‌క‌డ‌తాయి. అంతే… ఇక పాల‌ను అలా గ‌డ్డ క‌ట్టి స్టోర్ చేసి ఉంచితే ఇక అవి 4 నుంచి 6 వారాల వ‌ర‌కు పాడు కావు.

2. కోడిగుడ్లు
కోడిగుడ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని ప‌గ‌ల‌గొట్టి ఐస్ ట్రేల‌లో పోయాలి. అనంత‌రం ఆ ట్రేలను డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో అవి గ‌డ్డ క‌డ‌తాయి. అప్పుడ‌వి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. వాటిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి కొంత సేపు బ‌య‌ట ఉంచితే చాలు, వెంట‌నే ఐస్ గ‌డ్డ క‌రిగిపోతుంది. ఆ త‌రువాత వాటిని తాజా గుడ్ల‌లా ఉప‌యోగించుకోవ‌చ్చు.

3. సాస్‌
ట‌మాటా సాస్‌, చిల్లీ సాస్ వంటి వాటిని ప్లాస్టిక్ స్టోరేజ్ క‌వ‌ర్ల‌లో వేయాలి. అనంత‌రం వాటిని డీప్ ఫ్రిజ్‌లో పెట్టి గ‌డ్డ క‌ట్టించాలి. దీంతో అవి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి. కావాల‌నుకున్న‌ప్పుడు వాటిని య‌థావిధిగా ఉపయోగించుకోవ‌చ్చు.

4. ఆకుకూర‌లు
ఆకుకూర‌ల‌ను పేప‌ర్ ట‌వ‌ల్స్‌లో చుట్టి ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో వాటిలో ఉండే తేమ‌ను ఆ పేప‌ర్ ట‌వ‌ల్స్ పీల్చుకుంటాయి. అందువ‌ల్ల అవి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి.

5. యాపిల్ పండ్లు
యాపిల్ పండ్ల‌ను న్యూస్ పేప‌ర్ల‌లో ఒక్కొక్క పండుగా చుట్టి పెడితే అవి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి.

6. క్యారెట్లు
ఈ టిప్ పాటిస్తే క్యారెట్ల‌ను ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉండేలా చేయ‌వ‌చ్చు. ఊచ‌ల‌తో చేసిన బాస్కెట్‌లో గోనె ప‌ట్ట వేసి అందులో ఇసుక నింపాలి. ఆ ఇసుక మీద క్యారెట్ల‌ను పెట్టాలి. అనంత‌రం ఆ బాస్కెట్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో క్యారెట్లు ఎప్ప‌టికీ తాజాగా ఉంటాయి.

7. చీజ్‌, క్రీమ్
చీజ్‌, క్రీమ్ వంటి ప‌దార్థాలు పాడు కాకుండా ఉండాలంటే వాటిని బాటిల్స్‌లో అలాగే ఫ్రిజ్ లో పెట్టాలి. అయితే ఆ బాటిల్స్‌ను త‌ల‌కిందులుగా ఉంచాలి. దీంతో అవి పాడు కావు.

8. ఉల్లికాడ‌లు
ఉల్లికాడ‌లు ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండాలంటే వాటిని ఒక గ్లాస్ నీటిలో ఉంచాలి. వేర్లు నీటిలో త‌డిసేలా పెట్టాలి. దీంతో అవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి.

9. ఉల్లిపాయ, వెల్లుల్లి, కొత్తిమీర
ఒక గ్లాస్ జార్‌లో ఉల్లిపాయ‌, వెల్లుల్లి, కొత్తిమీర వంటి వాటిని ఉంచి మూత పెట్టి ఆ జార్‌ను ఫ్రిజ్‌లో పెట్టాలి. దీంతో అవి తాజాగా ఉంటాయి.

10. తేనె
తేనె ఎన్ని సంవత్స‌రాలు ఉన్న‌ప్ప‌టికీ పాడు కాదు. దీనికి తోడు అందులో ఉండే పోష‌కాలు ఎప్ప‌టికీ ఒకేలా ఉంటాయి. మార‌వు. అయితే తేనెను కేవ‌లం గ్లాస్ జార్‌ల‌లో మాత్ర‌మే నిల్వ చేయాల్సి ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top