క్యాష్ లెస్ లావాదేవీలు నిర్వ‌హిస్తున్న టాప్ 10 దేశాలు ఇవే..!

పెద్ద నోట్ల ర‌ద్దుతో జ‌నాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృష్ట్యా ఇప్పుడు కేంద్ర ప్ర‌భుత్వం ఒక్క‌టే మాట చెబుతోంది. అదేమిటంటే… వీలైనంత వ‌ర‌కు క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వహించ‌మ‌ని చెబుతోంది. ఎక్క‌డ ఏం చెల్లింపు చేసినా, ఏది కొన్నా అన్నీ కార్డులు, నెట్ బ్యాంకింగ్‌, డిజిట‌ల్ వాలెట్స్ వంటి యాప్స్ స‌హాయంతో పూర్తి చేసుకోమ‌ని ప్ర‌భుత్వం సూచ‌న‌లిస్తోంది. ఈ క్ర‌మంలో మ‌న దేశం క్యాష్‌లెస్ లావాదేవీల్లో ముంద‌డుగు వేసి త‌ద్వారా న‌ల్ల‌ధ‌నం పోతుంద‌ని ప్ర‌భుత్వం భావ‌న‌. అయితే దీని సంగ‌తి ఎలా ఉన్నా చాలా మంది చ‌దువుకున్న‌వారికే కార్డులు, నెట్ బ్యాంకింగ్ వంటి స‌దుపాయాల‌ను వాడ‌డం క‌ష్ట‌త‌ర‌మ‌వుతోంది. కొన్ని చోట్ల కార్డులు స్వైప్ చేద్దామ‌ని వెళ్లినా పీఓఎస్ మెషిన్లు ప‌నిచేయ‌డం లేదు. దీంతో జ‌నాలు ప‌డుతున్న అవ‌స్థ‌లు అన్నీ ఇన్నీ కావు. కేంద్ర ప్ర‌భుత్వం క్యాష్‌లెస్ లావాదేవీలు చేయమ‌ని చెబుతోంది స‌రే, మ‌రి దానికి త‌గిన‌ట్టుగా ఏర్పాట్లు ఉన్నాయా అంటే అది లేదు. అయితే క్యాష్‌లెస్ లావాదేవీల సంగ‌తి మ‌న దేశంలో ఎలా ఉన్నా ప్ర‌పంచంలోని కొన్ని దేశాలు మాత్రం ఈ విధానంలో ఇత‌ర దేశాల క‌న్నా ఎంతో ముందే ఉన్నాయి.

cashless

ఆయా దేశాల్లో ఎలాంటి చెల్లింపులు చేయాల‌న్నా, కొనాల‌న్నా, ఆఖ‌రికి వీధుల్లో తిరిగే చిరు వ్యాపారుల‌కు, మొబైల్ క్యాంటీన్ల‌కు, చివ‌రికి బిచ్చ‌మెత్తుకునే వారికి కూడా స్వైపింగ్ మెషిన్లు ఉన్నాయ‌ట‌. దీంతో అక్క‌డంతా ఆన్‌లైన్ లావాదేవీలే ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌ట‌. మ‌రి అలాంటి క్యాష్‌లెస్ దేశాల్లో టాప్ 10 స్థానాల్లో ఏమేం దేశాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దామా..!

స్వీడ‌న్ – ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న దేశాల‌న్నింటిలోనూ క్యాష్ లెస్ లావాదేవీలు ఎక్కువ‌గా నిర్వ‌హించే దేశంగా స్వీడ‌న్ ముందుంది. అక్క‌డ కేవలం 3 శాతం మాత్ర‌మే క్యాష్ లావాదేవీలు జ‌రుగుతాయి. 97 శాతం మంది ఆన్‌లైన్‌ను ఉప‌యోగిస్తారు.

బెల్జియం – ఈ దేశంలో 93 శాతం వ‌ర‌కు జ‌రిగేవ‌న్నీ క్యాష్‌లెస్ లావాదేవీలే. మిగ‌తా 7 శాతం మంది మాత్ర‌మే క్యాష్‌ను వాడ‌తారు. ఈ దేశంలో ఉన్న అన్ని బ్యాంకుల్లోనూ న‌గ‌దు కోసం వెళ్లిన వారికి కేవ‌లం 3వేల యూరోల వ‌ర‌కు మాత్ర‌మే క్యాష్ ఇస్తారు. అంత‌కు ఎక్కువ కావాలంటే ఆన్‌లైన్ లావాదేవీ నిర్వ‌హించాల్సిందే.

ఫ్రాన్స్ – ఫ్రాన్స్‌లో 92 శాతం వ‌ర‌కు క్యాష్‌లెస్ లావాదేవీలు జ‌రుగుతాయి. మొబైల్ బ్యాంకింగ్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, డెబిట్ కార్డుల‌ను వాడే వారు ఇక్క‌డ ఎక్కువ‌.

కెన‌డా – ఈ దేశంలో 90 శాతం క్యాష్‌లెస్ లావాదేవీలు జ‌రుగుతాయి. అందులో 70 శాతం లావాదేవీలు డెబిట్‌, క్రెడిట్ కార్డుల ద్వారా జ‌రుగుతాయి. మిగిలిన దాంట్లో మొబైల్‌, ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లు ఉన్నాయి.

యూకే – 89 శాతం క్యాష్‌లెస్ లావాదేవీలు ఈ దేశంలో జ‌రుగుతాయి. ర‌వాణా వ్య‌వ‌స్థ‌కు ఇక్క‌డ మొత్తం ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు జరుపుతారు.

ఆస్ట్రేలియా – ఈ దేశంలో 86 శాతం క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వ‌హిస్తారు. ఎంత చిన్న మొత్తంలో వ‌స్తువులు కొన్నా క‌చ్చితంగా ఆన్‌లైన్ ద్వారానే చెల్లిస్తారు.

నెద‌ర్లాండ్స్ – ఈ దేశంలో 85 శాతం క్యాష్‌లెస్ లావాదేవీలు జ‌రుగుతాయి. త్వ‌ర‌లో పూర్తి స్థాయిలో ఈ లావాదేవీలు జ‌ర‌పాల‌ని ఆ దేశం భావిస్తోంది.

అమెరికా – 80 శాతం వ‌ర‌కు క్యాష్‌లెస్ లావాదేవీలు అమెరికాలో జ‌రుగుతాయి. కిరాణా స‌రుకులు, పెట్రోల్, డీజిల్‌కు, ఇత‌ర చిన్న చిన్న అవ‌స‌రాలకు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే చెల్లింపులు చేస్తారు.

జ‌ర్మ‌నీ – ఈ దేశంలో జ‌రిగే లావాదేవీల్లో 76 శాతం వ‌ర‌కు లావాదేవీలు క్యాష్‌లెస్ త‌ర‌హాలోనే జ‌రుగుతాయి. దాదాపు ఎలాంటి పేమెంట్ లేదా కొనుగోలుకైనా అక్క‌డి ప్ర‌జ‌లు డెబిట్‌, క్రెడిట్ కార్డుల‌ను ఎక్కువ‌గా వాడుతారు.

ద‌క్షిణ కొరియా – ఇక క్యాష్‌లెస్ లావాదేవీలు నిర్వ‌హించే టాప్ 10 దేశాల్లో ద‌క్షిణ కొరియా 10వ స్థానంలో ఉంది. అక్క‌డ 70 శాతం లావాదేవీలు న‌గ‌దు లేకుండానే క్యాష్‌లెస్ రూపంలో జ‌రుగుతాయి. డెబిట్‌, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ వంటి సేవ‌ల‌ను అక్క‌డి పౌరులు ఎక్కువ‌గా వాడుతారు.

Comments

comments

Share this post

scroll to top