భీమ్ (BHIM) యాప్ గురించి మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యాలివే..!

నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఆన్‌లైన్‌లో మ‌రింత సుల‌భంగా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేందుకు గాను కేంద్ర ప్ర‌భుత్వం మొన్నా మ‌ధ్యే భీమ్ (BHIM – Bharat Interface for Money) అనే యాప్‌ను విడుద‌ల చేసిన విష‌యం విదితమే. కేవ‌లం కొద్ది గంట‌ల్లోనే ఈ యాప్ కొన్ని ల‌క్షల డౌన్‌లోడ్స్‌ను న‌మోదు చేసుకుని రికార్డు సృష్టించింది కూడా. అయితే ఈ యాప్ గురించి మ‌నం తెలుసుకోవాల్సిన ప‌లు విష‌యాలు ఉన్నాయి. అవేమిటంటే…

bhim-app

1. గ‌తంలో ఉన్న యూపీఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌), యూఎస్ఎస్‌డీ (అన్‌స్ట్ర‌క్చ‌ర్డ్ స‌ప్లిమెంట‌రీ స‌ర్వీస్ డేటా) అనే రెండు ట్రాన్స‌ఫ‌ర్ విధానాల‌కు యాప్ రూప‌మే ఈ భీమ్‌. గ‌తంలో ఆయా విధానాలు ఫీచ‌ర్ ఫోన్ల కోసం రూపొందించ‌బ‌డ్డాయి. ఈ భీమ్ విధానం స్మార్ట్‌ఫోన్ల కోసం త‌యారు చేయ‌బ‌డింది.

2. ఐఎంపీఎస్ (ఇమ్మిడియ‌ట్ పేమెంట్ స‌ర్వీస్‌) పద్ధ‌తిలో భీమ్ యాప్ ప‌నిచేస్తుంది. దీని ద్వారా డ‌బ్బు పంపితే కేవ‌లం సెకండ్ల వ్య‌వ‌ధిలోనే అవ‌తలి వ్య‌క్తికి చేరుతుంది.

3. నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఈ యాప్‌ను త‌యారు చేసింది. కేవ‌లం 2 ఎంబీ సైజ్ మాత్ర‌మే ఉండ‌డంతో ఏ స్మార్ట్‌ఫోన్‌లో అయినా దీన్ని సుల‌భంగా ఇన్‌స్టాల్ చేసుకోవ‌చ్చు.

4. భీమ్ యాప్ స‌హాయంతో ఎవ‌రైనా రోజుకు క‌నీసం రూ.1 నుంచి గ‌రిష్టంగా రూ.20వేల వ‌ర‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే ఒక‌సారి ట్రాన్స్‌ఫ‌ర్ మాత్రం రూ.10వేల‌కు మించ‌కూడ‌దు.

5. భీమ్ యాప్ ఆండ్రాయిడ్ 4.1.1 ఆపైన వెర్ష‌న్ ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌ల‌లో ఇన్‌స్టాల్ అవుతుంది. అయితే దీన్ని త్వ‌ర‌లో ఐఓఎస్‌, విండోస్ మొబైల్ 10 యూజ‌ర్ల‌కు కూడా రిలీజ్ చేయ‌నున్నారు.

6. భీమ్ యాప్‌కు కేవ‌లం ఒక బ్యాంక్ అకౌంట్‌నే అనుసంధానం చేసుకోవ‌చ్చు. మ‌న‌కు ఎన్ని అకౌంట్లు ఉన్నా వాటిలో ఏదైనా ఒక అకౌంట్‌నే దీనికి అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

7. యూజ‌ర్లు ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోగానే ముందుగా బ్యాంక్ అకౌంట్‌ను యాడ్ చేసి అనంత‌రం యూపీఐ పిన్ నంబ‌ర్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంత‌రం డెబిట్ లేదా ఏటీఎం కార్డు లోని చివ‌రి 6 అంకెల‌ను, ఎక్స్‌పైరీ డేట్‌ను ఎంటర్ చేస్తే దాంతో భీమ్ యాప్‌లో అకౌంట్ క్రియేట్ అవుతుంది. అనంత‌రం ఫోన్‌కు వ‌చ్చే ఓటీపీని యాప్‌లో క‌న్‌ఫాం చేయాల్సి ఉంటుంది.

8. ఒక‌సారి అకౌంట్ క్రియేట్ అయ్యాక పైన చెప్పిన ప‌రిమితి ప్ర‌కారం ఎవ‌రైనా డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top