భగవంతుణ్ణి ఇలా కూడా ప్రార్థిస్తారా? కోరిన కోర్కెలు తీర్చ‌మ‌ని ఈ ప్ర‌జ‌లు దైవాన్ని ఎంత వింతగా ప్రార్దిస్తారో చూడండి!

ఏ వర్గానికి చెందిన ప్ర‌జ‌లు అయినా త‌మ త‌మ విశ్వాసాల‌కు అనుగుణంగా త‌మ ఇష్ట దైవాన్ని ప్రార్థించి తాము కోరిన కోర్కెలు నెర‌వేరాల‌ని ఆశిస్తారు. ఆ విధంగా దైవానికి పూజ‌లు చేస్తారు. ప్రార్థ‌న‌లు నిర్వ‌హిస్తారు. ఇది ఎక్క‌డైనా జ‌రిగేదే. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ప్రాంతాల్లో అలా కాదు. అక్క‌డ నిజానికి భ‌క్తులు చేసే పూజ‌లు, ప్రార్థ‌న‌లే వేరేగా ఉంటాయి. చాలా భిన్న‌మైన రీతిలో భ‌క్తులు ప్రార్థ‌న‌లు చేసి త‌మ కోర్కెలు నెర‌వేరాల‌ని కోర‌కుంటారు. ఈ క్ర‌మంలో అస‌లు ఆ ప్రాంతాలేవో, అక్క‌డ భ‌క్తులు ఏ విధంగా దైవాన్ని ప్రార్థిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

బ్ర‌హ్మ బాబా ఆల‌యం…
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జాన్‌పూర్‌లో ఈ ఆల‌యం ఉంది. ఇక్క‌డికి వ‌చ్చే భ‌క్తులు ఆల‌య ప్రాంగంణంలో ఉన్న రావి చెట్టుకు గోడ గ‌డియారాన్ని వేలాడ‌దీస్తారు. అలా చేస్తే తాము కోరుకున్న కోర్కెలు నెర‌వేరుతాయ‌ని వారి విశ్వాసం. అయితే ఇది ఎలా వ‌చ్చిందంటే… 30 సంవ‌త్స‌రాల కిందట ఓ వ్య‌క్తి ట్ర‌క్ డ్రైవింగ్ రావాల‌నే త‌ప‌న‌తో కోరిక కోరి ఈ ఆల‌యంలో గోడ గ‌డియారం క‌ట్టాడ‌ట‌. అనుకున్న విధంగానే మంచి డ్రైవ‌ర్‌గా మారాడ‌ట అత‌ను. అప్ప‌టి నుంచి అక్క‌డికి వ‌చ్చే భ‌క్తులు అంద‌రూ ఇదే ప‌ద్ధ‌తిని అనుస‌రిస్తున్నారు.

మోటార్ సైకిల్ బాబా…
జోధ్‌పూర్ లోని ప‌లి అనే ప్రాంతంలో ఓ మోటార్ సైకిల్‌నే ప్ర‌జ‌లు బాబాగా భావించి పూజ‌లు చేస్తారు. అనుకున్న కోర్కెలు నెర‌వేర్చే బాబాగా ఆ మోటార్‌సైకిల్ బాబా ప్ర‌సిద్ధి చెందింది. భ‌క్తులు ఇక్క‌డికి వ‌చ్చి మ‌ద్యం బాటిళ్ల‌ను నైవేద్యంగా ఇచ్చి కోర్కెలు కోర‌తార‌ట‌. అయితే భ‌క్తుల‌కు ఈ విశ్వాసం ఎలా ఏర్ప‌డిందంటే… 1991లో స్థానికంగా ఉండే ఓమ్ సింగ్ రాథోడ్ అనే వ్య‌క్తి త‌న రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ మోటార్ సైకిల్‌పై ఆ గ్రామంలో వెళ్తుండ‌గా, అక్క‌డ యాక్సిడెంట్ అవ‌డంతో అక్క‌డిక‌క్క‌డే అత‌ను మృతి చెందాడ‌ట‌. అయితే పోలీసులు అత‌ని మృత‌దేహాన్ని తీసేసి బైక్‌ను స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కానీ… తెల్లారేసరికి ఆ మోటార్‌సైకిల్ యాక్సిడెంట్ అయిన ప్ర‌దేశానికి వ‌చ్చింద‌ట‌. దీంతో దాన్ని దైవంగా భావించి పూజించ‌డం మొద‌లు పెట్టారు అక్క‌డి భ‌క్తులు.

షాహిద్ బాబా నిహాల్ సింగ్ గురుద్వారా…
పంజాబ్ లోని జ‌లంధ‌ర్‌లో ఉన్న ఈ గురుద్వారా స్పెషాలిటీ ఏంటంటే… ఫారిన్ వెళ్లాల‌నుకునే వారు ఈ గురుద్వారాలో ఓ చిన్న విమాన బొమ్మ‌ను ఉంచి ప్రార్థ‌న‌లు చేస్తే చాలు. వారికి త్వ‌ర‌గా విదేశీ వీసా వ‌స్తుంద‌ట‌. చాలా మందికి వీసా వ‌స్తున్నందు వ‌ల్లే ఇక్క‌డి అనేక మంది వ‌చ్చి అలా వీసా మొక్కులు మొక్కుతారు. ఈ క్రమంలో రోజూ ఇక్క‌డ గురుద్వారా లోప‌ల 100కు పైగా విమాన బొమ్మ‌లు ఉంటాయ‌ట‌.

సోలాపూర్‌…
మ‌హారాష్ట్ర‌లోని సోలాపూర్‌లో ఏటా అక్క‌డ ఉండే ముస్లింలు ఓ వింత కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తారు. వారంత త‌మ ప‌సికందుల‌ను 50 అడుగుల ఎత్తు ఉన్న భ‌వంతి నుంచి కింద‌కు విసిరేస్తారు. కింద ఉండే కొంద‌రు ప‌రుపుల ద్వారా ఆ పిల్ల‌ల‌ను ప‌ట్టుకుంటారు. ఇలా చేస్తే ఆ పిల్ల‌ల‌కు ఉండే దిష్టి పోతుంద‌ని, వారికి ఆరోగ్యం చేకూరుతుంద‌ని ఆ ప్ర‌జ‌లు భావిస్తారు. అయితే ఈ కార్యక్ర‌మంలో కొంద‌రు హిందువులు కూడా పాల్గొన‌డం విశేషం.

Comments

comments

Share this post

scroll to top