ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా పాక్ చేతిలో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఈ ఓటమని సగటు భారత అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అయితే.. అభిమానుల మాటేమో గానీ ప్లేయర్లు మాత్రం అంత సీరియస్‌గా ఏమీ తీసుకోలేదు. ఆట కదా, అందులో గెలుపోటములు సహజం. అని లైట్ తీసుకున్నట్టుగానే కనిపిస్తోంది. అందుకు విరాట్ కోహ్లి మ్యాచ్ అనంతరం చేసిన కామెంట్లే ఉదాహరణ. పాక్ చక్కగా ఆడిందని విరాట్ కితాబునిచ్చాడు. సరే… ఈ విషయం పక్కన పెడితే అసలు భారత్ ఈ మ్యాచ్‌లో ఎందుకు ఓడిందనే కారణాలను పలువురు క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి ఆ కారణాలు ఏమిటో తెలుసుకుందామా…!
1. భారత్ ఓటమికి ఉన్న కారణాల్లో మొదటిది టాస్. టాస్ గెలిచాక భారత కెప్టెన్ కోహ్లి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అయితే తాము టాస్ గెలిచినా ఫీల్డింగే తీసుకునే వారమని, చేజింగ్ ఆ పిచ్‌పై సులభంగా ఉంటుందని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కూడా చెప్పాడు. కానీ టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుని ఉంటే బాగుండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా మరో వైపు టాస్ గెలిస్తే పాకిస్థాన్‌కు బ్యాటింగ్ ఇవ్వవద్దని ఆ దేశ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ కూడా అన్నాడు. దీంతో భారత్ టాస్ గెలిచాక బ్యాటింగ్ తీసుకుని ముందుగా బ్యాటింగ్ చేసి ఉంటే ఓడిపోయి ఉండేది కాదని విశ్లేషకులు అంటున్నారు.
2. ఇక భారత్ ఓటమికి గల కారణాల్లో రెండోది నిర్లక్ష్యపు బౌలింగ్. అదే టీం కొంప ముంచింది. సెంచరీ చేసిన ఫకార్ జమాన్ 3 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేసే అవకాశాన్ని బుమ్రా కాలదన్నాడు. నోబాల్ విసరడంతో అతని ఔట్ కాస్తా నాటౌట్ అయింది. దీంతో ఫకార్ సెంచరీ చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకుండా ఫకార్ జమాన్ తన తొలి వన్డే సెంచరీతో చెలరేగాడు. ఇది పాక్‌కు ప్లస్ అయింది. ఆ తరువాత కూడా మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేదు. భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యాలు ఫర్వాలేదనిపించారు.
3. సాధారణంగా చేజింగ్ అంటే భారత జట్టులో మనకు ముందుగా గుర్తుకు వచ్చేది కోహ్లి. ఎన్నో మ్యాచ్‌లను అతను ఒంటి చేత్తో చేజ్ చేసి గెలిపించిన సందర్భాలు ఉన్నాయి. విరాట్ కోహ్లికి ముందు బ్యాటింగ్ చేసిన ఇన్నింగ్స్‌లో కన్నా చేజింగ్‌లోనే ఎక్కువ బ్యాటింగ్ యావరేజ్ కూడా ఉంది. దీంతో కోహ్లి ఈసారి కూడా రన్స్ ను చేజ్ చేసి గెలిపిస్తాడని అభిమానులు భావించారు. కానీ సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటయ్యాడు. దీంతో భారత్ విజయావకాశాలకు అక్కడే గండిపడింది. ఆ తరువాత వచ్చిన బ్యాట్స్‌మెన్ వచ్చినట్టే పెవిలియన్ బాట పట్టారు.
4. పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ ఆమిర్ తన పదునైన బౌలింగ్‌తో ముగ్గురు భారత టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్లను వెనక్కి పంపించాడు. అతని ధాటికి రోహిత్ (0), ధావన్ (21), కోహ్లి (5)లు ఔటయ్యారు. దీంతో భారత్‌కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఇది జట్టు ఓటమికి గల 4వ కారణం.
5. ఇక టీమిండియా ఓటమికి ఉన్న మరో కారణం ఏమిటంటే… హార్దిక్ పాండ్యా ఔట్ కావడం. 76 స్కోరుతో అప్పటికే 6 సిక్సర్లను బాది మంచి ఫామ్‌లో ఉన్న హార్దిక్ పాండ్యా జట్టును విజయపథంలో నడిపిస్తాడని అనుకున్నారు. కానీ జడేజా చెత్త రన్నింగ్ కారణంగా అతను రనౌట్ అయ్యాడు. దీంతో ఇక భారత్ గెలిచే అవకాశం లేకపోయింది. అలా భారత్ చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో రన్నరప్ స్థానానికి పరిమితమైంది.