అయ్య‌ప్ప మాలను ధ‌రించిన వారు పాటించే క‌ఠిన నియ‌మాలు ఇవే..!

అయ్య‌ప్ప స్వామి దీక్ష మాల ధార‌ణ అంటేనే భ‌క్తులు ఎంతో నిష్ట‌తో ఆచ‌రించాల్సి ఉంటుంది. ఎన్నో క‌ఠినమైన నియ‌మాలు, నిబంధ‌న‌లు ఉంటాయి. స్వామి కోసం మొక్కుకున్న భ‌క్తులు మాల వేసుకుని 41 రోజుల పాటు అత్యంత క‌ఠిన‌మైన పద్ధ‌తిలో దీక్ష చేస్తూ అనంత‌రం శ‌బ‌రిమ‌ల వెళ్లి స్వామిని ద‌ర్శించుకుని మాల తీసేస్తారు. ఈ క్ర‌మంలో చాలా మంది ఒక‌టి క‌న్నా ఎక్కువ సార్లు మాల‌ను ధ‌రిస్తుంటారు. అందుకు వారికి స్వామిపై ఉన్న న‌మ్మ‌క‌మే కార‌ణం. కోరిన కోర్కెలు తీర‌తాయ‌ని, అనుకున్న‌ది నెర‌వేరుతుంద‌ని, అంతా శుభ‌మే క‌ల‌గాల‌ని కోరుకుంటూ చాలా మంది భ‌క్తులు మాల వేసుకుంటారు. అయితే మాల వేసుకున్న‌న్ని రోజులు వారు అత్యంత నిష్టతో ప‌లు నియ‌మాల‌ను పాటించాల్సి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ayyappa

1. అయ్య‌ప్ప మాల ధ‌రించాల‌నుకునే భ‌క్తులు 3 రోజుల ముందు నుంచే మ‌ద్యం, మాంసం మానేయాలి. త‌ల వెంట్రుక‌లు, గోర్ల‌ను ముందుగానే క‌త్తిరించుకోవాలి. మాల ధ‌రించే రోజు పాద‌ర‌క్ష‌లు లేకుండా శుభ్ర‌మైన దుస్తుల‌ను ధ‌రించి న‌ల్ల‌ని లుంగీ, కండువా, చొక్కా, తుల‌సిమాల తీసుకుని అయ్య‌ప్ప ఆల‌యానికి వెళ్లాలి.

2. ఆరు సార్లు మాల వేసుకున్న గురు స్వామి భ‌క్తుల‌కు మాల ధార‌ణ చేస్తారు. మాల ధ‌రించే ముందు బ్ర‌హ్మ‌దేవుని చంద‌నంగా, శివుడిని విబూధిగా, విష్ణువును కుంకుమ‌గా భావించి నుదుటిపై పెట్టుకోవాలి. కుటుంబంలో త‌ల్లిదండ్రులు మ‌ర‌ణిస్తే ఏడాది పాటు మాల‌ను ధ‌రించ‌కూడ‌దు. భార్య మ‌ర‌ణిస్తే ఆరు నెల‌ల పాటు దీక్ష‌కు దూరంగా ఉండాలి.

3. అయ్య‌ప్ప మాల ధ‌రించిన భ‌క్తులు దీక్ష‌ను పూర్తి చేసుకోవ‌డానికి విడిది ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో స్థ‌లం ఉంటే పీఠం ఏర్పాటు చేసుకోవ‌చ్చు. అది వీలుకాక‌పోతే ఇత‌ర స్వాముల‌తో క‌లిసి స‌న్నిధానం ఏర్పాటు చేసుకోవాలి. అయితే స‌న్నిధానంలో ఎత్త‌యిన పీఠం ఏర్పాటు చేసి నూత‌న వ‌స్త్రంపై బియ్యం పోసి గ‌ణ‌ప‌తి, సుబ్ర‌హ్మ‌ణ్య స్వామి, అయ్య‌ప్ప స్వాముల చిత్ర‌పటాల‌ను ప్ర‌తిష్ఠించాలి.

4. దీక్ష కోసం సంక‌ల్పం తీసుకుని క‌ల‌శ‌స్థాప‌న చేయాలి. అయితే ఒక్క‌సారి గ‌న‌క క‌ల‌శ స్థాపన చేస్తే దీక్ష ముగిసేవ‌ర‌కు దాన్ని క‌దిలించ‌కూడ‌దు. అదేవిధంగా దేవతల చిత్ర‌ప‌టాల‌కు శిర‌స్సు నుంచి పాదాల వ‌ర‌కు అలంక‌ర‌ణ చేయాలి. దీపారాధ‌న చేశాక గ‌ణ‌ప‌తి, అమ్మ‌వారు, సుబ్ర‌హ్మ‌ణ్య స్వామిని పూజించాలి. అనంత‌రం అయ్య‌ప్ప‌ను పూజించాలి.

5. మొద‌టి స్తారి మాల ధ‌రించిన వారిని క‌న్నెస్వామి అని, రెండోసారికి కత్తి స్వామి అని, మూడో సారికి గంట స్వామి అని, నాలుగోసారి గ‌ద స్వామి, ఐదో సారి పెరు స్వామి, ఆరోసారి గురు స్వామి అని పిలుస్తారు. అనంత‌రం కూడా ప‌లు ర‌కాల పేర్ల‌తో అయ్య‌ప్ప స్వాముల‌ను పిలుస్తారు.

6. మాల ధ‌రించిన స్వాములు బ్ర‌హ్మ ముహుర్తంలో నిద్ర లేవాలి. చన్నీళ్లతో స్నానం ఆచ‌రించాలి. సూర్యోద‌యం కాక‌ముందే పూజ చేయాలి. తిరిగి సాయంత్రం చ‌న్నీటి స్నానం చేసి సంధ్యా పూజ పూర్తి చేయాలి.

7. భిక్షాట‌న చేసిన బియ్యంతోనే స్వ‌యంగా వండుకోవాలి. అలా సాధ్యం కాని స్థితిలో 41 రోజుల మండ‌ల దీక్ష పూర్త‌య్యాక ఇరుముడి క‌ట్టుకోవడానికి ముందు ఐదు ఇళ్ల‌లో భిక్షాట‌న చేయాలి.

8. మ‌ధ్యాహ్నం 3 గంట‌ల లోపు భిక్ష చేయాలి. సాయంత్రం పూజ అనంత‌రం కొద్ది మొత్తంలో అల్పాహారాన్ని స్వీక‌రించ‌వ‌చ్చు.

9. క‌టిక నేలపై నిద్రించాలి. ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక ఆహారం తీసుకోవాలి.

10. మ‌ల విస‌ర్జ‌న‌కు వెళ్తే తిరిగి స్నానం ఆచ‌రించి స్వామి వారి శ‌ర‌ణుఘోష చెప్పి హార‌తి తీసుకోవాలి.

11. ఒక‌సారి వేసుకున్నాక మాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తీయ‌రాదు. నిత్యం ఏదైనా ఒక దేవాల‌యాన్ని సందర్శించాలి. స్వామియే శ‌ర‌ణం అయ్య‌ప్ప అనే మంత్రాన్ని ప‌ఠిస్తూ ఉండాలి.

12. త‌న శ‌క్తి కొద్దీ క‌నీసం ఒక్క‌సారైనా అయిదుగురు అయ్య‌ప్ప‌ల‌కు భిక్ష పెట్టాలి.

13. హింస‌, దుర్భాష‌లాడ‌డం, అబ‌ద్దాలు చెప్ప‌డం వంటి వాటికి దూరంగా ఉండాలి.

14. దీక్ష చేప‌ట్టిన వారిలో చిన్నా పెద్దా అని చూడ‌కూడ‌దు. ఏ అయ్య‌ప్ప స్వామికైనా పాదాభివంద‌నం చేయాలి. త‌ల్లిదండ్రుల‌కు త‌ప్ప ఇత‌రుల‌కు పాదాభివంద‌నం చేయ‌కూడ‌దు.

15. బ్ర‌హ్మ‌చ‌ర్యం పాటించాలి. నుదుటిపై విబూధి, కుంకుమ‌, చంద‌నం క‌చ్చితంగా ధ‌రించాలి.

16. ప‌దునెట్టాంబ‌డి అంటే 18 మెట్లు అని అర్థం. ఆ మెట్ల‌లో ఎంతో మ‌హాత్మ్యం ఉంటుంద‌ట‌. కామం, క్రోధం, లోభం, మ‌దం, మాత్స‌ర్యం, మోహం, ద‌ర్పం, అహంకారం, వీక్ష‌ణా శ‌క్తి, వినికిడి శ‌క్తి, అగ్రాణ శ‌క్తి, రుచి చూసే శ‌క్తి, స్ప‌ర్శ శ‌క్తి, స‌త్వ గుణాలు, త‌మో గుణం, ర‌జో గుణం, విద్య‌, అవిద్య ఇలా అష్టాద‌శ శ‌క్తులు అయ్య‌ప్ప ఆల‌యం ముందు మెట్ల‌పై నిక్షిప్తమై ఉంటాయ‌ట‌. ఆ మెట్ల‌లో 18 ర‌కాల శ‌క్తులు ఉండ‌డం వ‌ల్ల 18 సార్లు యాత్ర చేస్తే ఎంతో మంచిద‌ని పురాణాలు చెబుతున్నాయి.

17. దీక్ష‌ధార‌ణ‌లో ఉన్న‌వారు శ‌బ‌రిమ‌ల యాత్ర అనంత‌రం ఇంటికి వ‌చ్చాకే మాల‌ను తీసేయాల‌ట‌. ఇంటి ద‌గ్గ‌ర మాతృమూర్తితో మూల తీయించి అందులో మాల‌ను మ‌రుస‌టి ఏడాది కోసం భ‌ద్ర ప‌ర‌చాలి.

Comments

comments

Share this post

scroll to top