ఈ కవర్ లు ఆలుగడ్డలతో తయారు చేసినవి మీకు తెలుసా? ఇదిగో ఈయనే వాటి సృష్టికర్త.!

ప్లాస్టిక్ భూతం..! నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్క‌డ చూసినా దీని ప్ర‌భావం చాలా ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ప్లాస్టిక్‌తో చేసిన ఎన్నో ర‌కాల వ‌స్తువులను మ‌నం నిత్యం వాడుతున్నాం. కార‌ణం… తేలిగ్గా, దృఢంగా ఉండ‌డం, త‌క్కువ ధ‌ర‌కు ల‌భించ‌డం. అయితే కుర్చీలు, బెంచీలు, బ‌కెట్లు, బిందెల వంటి ప్లాస్టిక్ వ‌స్తువుల సంగతి ప‌క్క‌న పెడితే మ‌న‌కు ఎక్కువ‌గా న‌ష్టం వాటిల్లుతోంది ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ వ‌ల్ల‌. వాటితో ప‌ర్యావ‌ర‌ణానికి చెప్ప‌లేనంత న‌ష్టం క‌లుగుతోంది. అవి ఒక‌సారి భూమిలోకి చేరితే చాలు, అవి పూర్తిగా క‌నుమ‌రుగు కావ‌డానికి కొన్ని వేల సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఈ క్ర‌మంలోనే చాలా చోట్ల ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల‌ను నిషేధించారు కూడా. అయినా చాలా చోట్ల అవి చ‌లామ‌ణీలోనే ఉన్నాయి. ఎందుకంటే బ‌ట్ట‌తో త‌యారైన జూట్ బ్యాగులు ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల‌తో పోలిస్తే ధ‌ర ఎక్కువ. ఇదే కార‌ణంతో చాలా మంది జూట్ బ్యాగుల‌ను వాడేందుకు వెనుకంజ వేస్తున్నారు. అయితే అలాంటి వారి కోస‌మే త‌క్కువ ధ‌ర ఉండేలా, ప‌ర్యావ‌ర‌ణానికి ఎటు వంటి హాని క‌లిగించ‌ని, పూర్తి స్థాయిలో ఎంతో లాభ‌దాయ‌క‌మైన ఓ ప్ర‌త్యేక త‌ర‌హా ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌ల‌ను త‌యారు చేయ‌డం ప్రారంభించాడు అత‌ను. అత‌ని పేరు అశ్వ‌త్ హెగ్డె.

ashwath
అశ్వ‌త్ హెగ్డె నిజానికి ఓ ఎన్ఆర్ఐ. మంగ‌ళూరులో పుట్టినా వ్యాపార ప‌ని రీత్యా క‌తార్‌లో సెటిల్ అయ్యాడు. అయితే మంగ‌ళూరు వ‌చ్చిన‌ప్పుడు అక్క‌డి ప్ర‌జ‌లు అటు ప్లాస్టిక్‌ను మానేయ‌లేక, ఇటు డ‌బ్బులు వెచ్చించి జూట్  బ్యాగుల‌ను కొనుగోలు చేయ‌లేక స‌త‌మ‌త‌మ‌వుతుండ‌డాన్ని గ‌మ‌నించాడు. దీంతో అత‌నికి ఓ ఆలోచ‌న వ‌చ్చింది. వెంట‌నే దాన్ని ఆచ‌ర‌ణ‌లో పెట్టేశాడు. ఆలుగ‌డ్డలు, టాపియోకా (ఓ ర‌క‌మైన పిండి ప‌దార్థం), మొక్క‌జొన్న పిండి, ఇత‌ర మొక్క‌ల‌కు చెందిన పిండి ప‌దార్థాలు, వెజిట‌బుల్ ఆయిల్స్‌, అర‌టిపండ్లు, ఫ్ల‌వ‌ర్ ఆయిల్ వంటి అత్యంత స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాలతో, పూర్తిగా ప‌ర్యావ‌ర‌ణ హితంగా ఉండేలా నూత‌న త‌ర‌హా ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల‌ను త‌యారు చేశాడు. అవి ఎలా ఉంటాయంటే చూసేందుకు అచ్చం ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల‌ను పోలి ఉంటాయి. కానీ అవి ప్లాస్టిక్‌తో త‌యారు కాబ‌డ‌లేదు. పూర్తిగా స‌హ‌జ సిద్ధ‌మైన ప‌దార్థాల‌తో చేసిన‌వి. అంతేకాదు, ఆయా క్యారీ బ్యాగుల‌పై ముద్రించే పెయింట్ కూడా ఆర్గానిక్ ప‌ద్ధితిలో తీసిందే.

envigreen-bags
ఈ క్ర‌మంలో స‌ద‌రు ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు నీటిలో వేస్తే కేవ‌లం ఒక్క రోజులోనే క‌రిగిపోతాయి. అదే మ‌రుగుతున్న నీటిలో వాటిని వేస్తే 15 సెకండ్ల‌లోనే క‌రిగిపోతాయి. అంతెందుకు, మ‌నం వాటిని వాడుకుని భూమిలో వేస్తే కేవ‌లం 180 రోజుల్లోనే మ‌ట్టిలో క‌లిసిపోతాయి. ఇత‌ర ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల‌కు ప‌ట్టిన‌ట్టు వేల సంవ‌త్స‌రాలు ప‌ట్ట‌దు. అందుకే అశ్వ‌త్ త‌యారు చేసిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల‌కు ఇప్పుడు అంత‌టి డిమాండ్ ఏర్ప‌డింది. ఇంత‌కీ వాటి ధ‌ర ఎంతో తెలుసా..? ప‌్లాస్టిక్ క్యారీ బ్యాగు క‌న్నా ఒక రూపాయి మాత్ర‌మే ఎక్కువ‌. అంటే సాధార‌ణ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు రూ.2కు ల‌భిస్తే వీటి ధ‌ర రూ.3 మాత్ర‌మే. అయినా అవి పూర్తి స‌హ‌జ సిద్ధ‌మైన‌వి కావ‌డంతో వాటిని కొనేందుకే జ‌నాలు ఎక్కువ ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ట‌. అయితే ఈ బ్యాగులు ఇప్పుడు క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. అది పూర్త‌యితే వీటిని పెద్ద ఎత్తున త‌యారు చేసి అంత‌టా అందివ్వాల‌నేది అశ్వ‌త్ కోరిక‌. ఈ బ్యాగులు ఇప్పుడు క‌తార్‌, దుబాయ్‌ల‌లోనూ ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఇక చివ‌రిగా ఇంకో విష‌యం, జంతువులు ఒక వేళ పొర‌పాటున ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగును తిన్నా వాటికి ఏమీ కాద‌ట‌. అవి ఎంచ‌క్కా అరిగిపోతాయ‌ట‌. అంత‌లా వీటిని త‌యారు చేశాడు అశ్వ‌త్‌. అత‌ని ప్ర‌య‌త్నానికి మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! ఇంత‌కీ అశ్వ‌త్ త‌యారు చేసిన ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల పేరు ఏమిటో తెలుసా..? ఎన్వి గ్రీన్ బ్యాగ్స్‌..!

Comments

comments

Share this post

scroll to top