వారు ఒక‌ప్పుడు దేశం కోసం పోరాడిన గొప్ప సైనికుడు… నేడు బిచ్చ‌మెత్తుకుని జీవనం గ‌డుపుతున్నాడు.

మ‌న దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి 70 ఏళ్ల‌యింది. ఈ సంద‌ర్భంగా ఇటీవ‌లే స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌ను కూడా ఘ‌నంగా జ‌రుపుకున్నాం. చాలా మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌ను, మ‌హా నేత‌ల‌ను, గొప్ప నాయ‌కుల‌ను త‌ల‌చుకుని వారు మన దేశానికి ఏ విధంగా స్వాతంత్ర్యం తెచ్చారో కూడా గుర్తు చేసుకున్నాం. కానీ అలాంటి మ‌హా పోరాట యోధుల్లో కొంత మందిని మాత్రం మ‌రిచిపోయాం. ఇప్పుడే కాదు, స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి మ‌నం వారి గురించి ఆలోచించ‌లేదు. ఏటా మరిచిపోతూనే ఉన్నాం. ఇక ప్ర‌భుత్వాలు, రాజ‌కీయ నాయ‌కుల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎందుకంటే వారికి ప్ర‌జా స‌మస్య‌లే గుర్తుండ‌వు. ఇక అలాంటి పోరాట యోధులు ఎలా గుర్తుంటారు చెప్పండి. ఈ క్ర‌మంలో వారి గురించి, వారి ద‌య‌నీయ జీవితం గురించి ఇప్పుడైనా తెలుసుకుందాం.

soldiers

అత‌ని పేరు శ్రీ‌ప‌త్‌జీ. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ఝాన్సీలో ఉంటాడు. ఇప్పుడ‌త‌ని వ‌య‌స్సు 90 ఏళ్లు. ఒక‌ప్పుడు నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ప్ర‌సంగానికి ఆక‌ర్షితుడై తాను కూడా దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాల‌ని నిశ్చ‌యించుకున్నాడు. అదే క్ర‌మంలో నేతాజీ ఏర్పాటు చేసిన ఇండియ‌న్ నేష‌న‌ల్ ఆర్మీలో చేరాడు. ఎన్నో సంద‌ర్భాల్లో సైనికుడిగా దేశం కోసం పోరాడాడు. కానీ ఇప్పుడ‌త‌ని జీవితం చూస్తే ఎవ‌రికైనా జాలి క‌ల‌గ‌క మాన‌దు. ఒక‌ప్పుడు దేశం కోసం పోరాడిన వ్య‌క్తి, గొప్ప సైనికుడి లాంటి వ్య‌క్తి నేడు తిన‌డానికి తిండి లేక, ఉండ‌డానికి చోటు లేక బిచ్చ‌మెత్తుకుని బ‌తుకున్నాడు. రోడ్ల‌పై, ఖాళీ ప్ర‌దేశాల్లో, పార్కుల్లో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ నిద్రిస్తున్నాడు. ఎండ‌కు ఎండుతూ, వాన‌కు త‌డుస్తూ, చ‌లికి వ‌ణుకుతూ ఇంకా ద‌య‌నీయ స్థితికి అత‌ను చేరుకున్నాడు.

soldiers1

అయితే శ్రీ‌ప‌త్‌జీ కుటుంబం ఒక‌ప్పుడు బాగా బ‌తికిన వారే. కానీ కొడుకు వ్య‌స‌నాల కార‌ణంగా ఉన్న భూమిని, ఇల్లును కోల్పోవాల్సి వ‌చ్చింది. ఈ క్ర‌మంలో కొడుకును నియంత్రించ‌డం కోసం అత‌ను చేసిన ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. దీంతో కుటుంబ భారం మొత్తం శ్రీ‌ప‌త్‌జీపైనే ప‌డింది. ఈ కార‌ణంగా అత‌ను కుటుంబ భారాన్ని మోయ‌లేక నేడు యాచ‌కుడిగా మారిపోయాడు. ఇత‌నే కాదు, ప్ర‌యాగ్‌పూర్‌కు చెందిన ఓరిలాల్ అనే మ‌రో వ్య‌క్తిది కూడా ఇలాంటి ప‌రిస్థితే. ఇత‌ను కూడా నేతాజీ ఏర్పాటు చేసిన ఆర్మీలో చేరి అనేక పోరాటాలు చేశాడు. కానీ నేడు 99 ఏళ్ల వ‌య‌స్సులో క‌డుపు కోసం బిచ్చ‌మెత్తుకుని బ‌తుకుతున్నాడు.

అయితే శ్రీ‌ప‌త్‌జీ, ఓరిలాల్‌లు మాత్ర‌మే కాదు, ఇంకా దేశంలో ఇలాంటి వారు చాలా మందే ఉన్నార‌ని తెలిసింది. వీరంద‌రినీ ప్ర‌భుత్వం క‌చ్చితంగా ఆదుకోవాల్సిందే. లేదంటే మ‌న‌కు స్వాతంత్ర్యం వ‌చ్చి కూడా అర్థం లేదు. దాన్ని అనుభ‌వించేందుకు మ‌న‌కు అర్హ‌త లేదు. అంతే క‌దా..! మీరేమంటారు..!

Comments

comments

Share this post

scroll to top