మన పురాణాల ప్రకారం ఈ 8 మంది వ్యక్తులు ఇంకా బతికే ఉన్నారట! ఇంతకీ వారెవరో చూడండి!

మ‌నిషి అన్నాక ఒక‌సారి మ‌ర‌ణిస్తే ఇక అంతే. అత‌ను మ‌ళ్లీ బ‌తికేందుకు అవ‌కాశాలు లేవు. అలాగే ఏ మ‌నిషైనా ఎప్పుడో ఒక‌ప్పుడు, ఏదో ఒక రోజున మ‌ర‌ణించాల్సిందే. అది ఎలాగైనా కావ‌చ్చు. మ‌నిషికి మృత్యువు అనివార్యం. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నిషి అనేక రంగాల్లో అప్ర‌తిహ‌తంగా దూసుకెళ్తున్నాడు కానీ, మృత్యువును జ‌యించ‌గ‌లిగే మందును మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోయాడు. కనుక‌… ఎవ‌రైనా త‌మ జీవితంలో ఏదో ఒక సారి మృత్యువు బారిన ప‌డాల్సిందే. అయితే హిందూ పురాణాల ప్ర‌కారం కొంద‌రు మాత్రం ఇప్ప‌టికీ కొన్ని యుగాల నుంచీ బ‌తికే ఉన్నార‌ట‌. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. ఇంతకీ… వారెవ‌రో మీకు తెలుసా..? అదే చూద్దాం పదండి..!

immortals-1

బ‌లి చ‌క్ర‌వ‌ర్తి…
మూడ‌డుగుల స్థ‌లం కోరి వామ‌నుడి రూపంలో వ‌చ్చిన‌ శ్రీ‌మ‌హావిష్ణువుచే పాతాళ లోకానికి తొక్క‌బ‌డిన బ‌లి చ‌క్ర‌వర్తి తెలుసు క‌దా. అత‌ను ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ట‌. ప్ర‌తి ఏటా ఒక రోజున అత‌ను పాతాళ లోకం నుంచి భూమిపైకి వ‌స్తాడ‌ట‌. అదే రోజున కేర‌ళీయులు ఓన‌మ్ పండుగ జ‌రుపుకుంటార‌ట‌.

విభీష‌ణుడు…
రావ‌ణుడి త‌మ్ముడు విభీష‌ణుడు. ఇత‌ను రాముడికి యుద్దంలో స‌హ‌కరిస్తాడు. దీంతో రాముడు ఇత‌నికి మ‌ర‌ణం లేకుండా మృత్యుంజ‌యునిగా చేస్తాడు. ఈ క్ర‌మంలోనే విభీష‌ణుడు ఇప్ప‌టికీ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటాడ‌ట‌. ఇత‌నికి చెందిన గుడి ఒక‌టి రాజస్థాన్‌లోని కోటా అనే టౌన్ లో ఉంది. దేశంలో విభీష‌ణుడికి ఉన్న ఏకైక ఆల‌యం ఇదే. ఇక్క‌డే విభీష‌ణుడు ఇప్ప‌టికీ తిరుగుతూ ఉంటాడ‌ట‌.

ప‌ర‌శురాముడు…
శ్రీ‌మ‌హావిష్ణువుకు ఉన్న 10 అవ‌తారాల్లో ప‌ర‌శురామావ‌తారం కూడా ఒక‌టి. ఇత‌ను 21 సార్లు విశ్వంలో ఉన్న చ‌క్ర‌వ‌ర్తులంద‌రినీ జ‌యిస్తాడు. ఇందుకోస‌మే విష్ణువు ఇత‌న్ని కాలాల‌కు స‌మన్వ‌య‌క‌ర్త‌గా నియమించిన‌ట్టు చెబుతారు. ఇత‌ను కూడా మృత్యుంజ‌యుడే. ఇప్ప‌టికీ ఇత‌ను జీవించే ఉన్నాడ‌ట‌.

immortals-2

వేద వ్యాసుడు…
మ‌హాభార‌తాన్ని రాసిన వేద వ్యాస మ‌హ‌ర్షి కూడా మృత్యుంజ‌యుడే. ఇత‌నికీ మ‌ర‌ణం లేద‌ట‌. ఇప్ప‌టికీ జీవించే ఉన్నాడ‌ట‌.

అశ్వ‌త్థామ‌…
మ‌హాభారతంలో అశ్వ‌త్థామ‌ది ఒక ముఖ్య‌మైన పాత్ర‌. ఇత‌ను ద్రౌప‌ది కుమారుల‌ను నిద్ర‌లోనే చంపుతాడు. అభిమ‌న్యుడి కుమారుడు ప‌రీక్షిత్తును కూడా త‌ల్లి గ‌ర్భంలో ఉండగానే చంపుతాడు, కానీ కృష్ణుడు అత‌న్ని బ‌తికిస్తాడు. అనంతరం కృష్ణుడు అశ్వ‌త్థామ‌కు శాపం పెడ‌తాడు. అందులో భాగంగానే అశ్వ‌త్థామ ఇప్ప‌టికీ జీవించే ఉన్నాడ‌ట.

కృపాచార్యుడు…
కృపాచార్యుడు పాండ‌వులు, కౌర‌వుల‌కు గురువు. ద్రోణుడికి బంధువు. ఇతనికి కూడా మ‌ర‌ణం లేద‌ట‌.

మార్కండేయ మ‌హ‌ర్షి…
చాలా చిన్న వ‌య‌స్సులోనే మ‌ర‌ణం ఉంద‌ని తెలుసుకున్న మార్కండేయుడు శివునికై త‌ప‌స్సు చేసి ఆయ‌న‌చే మ‌హామృత్యుంజ‌య మంత్రం పొందుతాడు. ఈ క్ర‌మంలోనే మార్కండేయుడు మృత్యుంజ‌యుడిగా మారుతాడు. అందుకే ఆయ‌నకు కూడా మ‌ర‌ణం ఉండ‌దు. ఇప్ప‌టికీ బ‌తికే ఉన్నాడ‌ని చెబుతారు.

ఆంజ‌నేయ స్వామి…
భ‌క్తుల‌ను కాపాడే క‌లియుగ దైవంగా హనుమంతుడు పేరుగాంచాడు. ఈయ‌న కూడా మృత్యుంజ‌యుడే. ఈయ‌న‌కూ మ‌ర‌ణం లేదు, రాదు.

Comments

comments

Share this post

scroll to top