ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రదేశాల్లో భిన్నమైన రహదారులు, రైలు మార్గాలు ఉంటాయి. హైవేలు, ఘాట్ రోడ్లు, మట్టి రోడ్లు… ఇలా అనేకం ఉంటాయి. వాటిలో కొన్ని సాఫీగా ఉంటే కొన్ని మలుపులు తిరిగి వంకర్లుగా ఉంటాయి. ఇంకొన్ని మలుపులతో పాటు ప్రమాదకరంగా ఉంటాయి. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా సరిగ్గా ఇలాంటి రోడ్ల గురించే. నిజానికి వాటిలో ప్రయాణించాలంటేనే ఎంతో ధైర్యం కావాలి మరి. ఎందుకంటే అవి అంత డేంజరస్‌గా ఉంటాయి. వాటిల్లో ప్రయాణించేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. లేకపోతే మృత్యువు ఒడిలోకి చేరినట్టే అవుతుంది. ఇక కొన్ని రైల్వే బ్రిడ్జిలు కూడా ప్రమాదకరంగా అనిపిస్తాయి. మరి ఆ రోడ్లు, రైలు మార్గాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
Also Watch:
1. పంబన్ రైల్వే బ్రిడ్జి, ఇండియా
రోడ్డు కాకపోయినా, రైలు మార్గమే అయినా నిజానికి ఈ బ్రిడ్జి రైళ్లకు కూడా ప్రమాదకరమైందే. ఎందుకంటే దీన్ని పూర్వం ఎప్పుడో నిర్మించారు. తరువాత కాలంలో బలమైన గాలలు వీచడం వల్ల 1964లో చాలా వరకు ఈ బ్రిడ్జి నాశనమైంది. దీన్ని మళ్లీ పునర్నిర్మించారు. అప్పటి నుంచి ఈ బ్రిడ్జిపై రైళ్లలో వెళ్లే వారు జంకుతున్నారు. ఎందుకంటే బలమైన గాలులు వీయడం ఇక్కడ సర్వ సాధారణం. ఆ గాలుల వేగం గంటకు 55 కిలోమీటర్లు మించితే ప్రమాదమే. బ్రిడ్జి కూలిపోతుంది. కనుక ఇక్కడ డిస్ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. గాలి వేగం పెరిగితే ఈ బ్రిడ్జిపై రైళ్లు వెళ్లవు.
2. స్కిప్పర్ కానయాన్ రోడ్డు, న్యూజిలాండ్
ఇది కొండ చుట్టూ ఉండే రహదారి. ఈ రోడ్డు మొత్తం ప్రమాదకరమైన మలుపులు సడెన్ గా వస్తాయి. వాలు ఎక్కువగా ఉంటుంది. తక్కువ వెడల్పు ఉన్న బ్రిడ్జిలు ఈ రోడ్డులో ఉంటాయి. ఈ క్రమంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్డుగా ఇది పేరుగాంచింది. ఈ రోడ్డులో ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు అక్కడి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ ఇవ్వవు.
3. కాకకోరం హైవే, పాకిస్థాన్-చైనా
ప్రపంచంలోనే అత్యంత ఎత్తు మీద ఉన్న హైవేగా ఈ రోడ్డు ప్రసిద్ధిగాంచింది. మొత్తం 1300 కిలోమీటర్లు దూరాన్ని ఈ హైవే కవర్ చేస్తుంది. దాదాపుగా 4600 మీటర్ల (15,091 అడుగుల) ఎత్తున ఈ హైవే ఉంటుంది. వర్షాకాలంలో ఈ హైవేపై ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కొండ చరియలు విరిగిపడుతుంటాయి. ఇక చలికాలంలో హిమపాతం కారణంగా దీన్ని మూసేస్తారు.
4. ఐర్ హైవే, ఆస్ట్రేలియా
ఈ రోడ్డు అంద ప్రమాదకరమైంది కాదు, కానీ దీనిపై ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా అధిక సంఖ్యలో ఈ రోడ్డుపై ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఎందుకంటే ఈ రోడ్డు చుట్టు పక్కల ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు ఉంటాయి. ఈ రోడ్డు చాలా చోట్ల కొన్ని కిలోమీటర్ల మేర అలా నిటారుగా సాగిపోతూనే ఉంటుంది. దీంతో డ్రైవర్లు రాత్రి పూట సులభంగా నిద్రలోకి జారుకుంటారట. అందుకని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మొత్తం 1600 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.
5. ట్రెయిన్ టు ది క్లౌడ్స్, అర్జెంటినా
ఈ ట్రెయిన్ ఏకంగా 42 బ్రిడ్జిలు, 21 సొరంగాలు, 2 జిగ్ జాగ్ ట్రాక్‌లు, 2 వంపుల దార్ల గుండా వెళ్తుంది. నిజంగా ఇందులో ప్రయాణించాలంటే ధైర్యం ఉండాలి. కానీ ధైర్యం చేస్తే అద్భుతమైన ప్రకృతి అందాలను వీక్షించవచ్చు.
6. సాలార్ డి ఉయుని రోడ్డు, బొలీవియా
సముద్ర మట్టానికి దాదాపుగా 3650 మీటర్ల (11,811 అడుగుల) ఎత్తున ఈ హైవే ఉంటుంది. ఈ హైవే పక్కన కూడా అద్భుతమైన ప్రకృతి అందాలు ఉంటాయి. ఇక్కడ సెల్ ఫోన్లు పనిచేయవు. ఒంటరిగా మాత్రం దీనిపై ఎవరూ వెళ్లరు. బృందాలుగానే వెళ్తారు. ఇక్కడ రాత్రి పూట -30 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి.
7. ది నోస్ ఆఫ్ ది డెవిల్ రైల్వే, ఈక్వెడార్
దాదాపుగా 800 మీటర్ల (2,624 అడుగుల) ఎత్తులో ఈ రైల్వే ట్రాక్ ఉంటుంది. కానీ కొండ చుట్టూ తిరుగుతూ రైళ్లు వెళ్తాయి. వీటిపై కూర్చుని ప్రయాణించే వీలు ఒకప్పుడు ఉండేది. కానీ తరువాతి కాలంలో అలా ప్రయాణించడాన్ని నిషేధించారు.
8. మీక్లాంగ్ రైల్వే మార్కెట్, థాయ్‌లాండ్
థాయ్‌లాండ్‌లో ఉన్న ఈ మార్కెట్ గుండా రైళ్లు వెళ్తాయి. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో అవి ఇక్కడ వెళ్తాయి. అలా అవి వెళ్లే క్రమంలో చిరు వ్యాపారులు తమ టెంట్లను, కూరగాయలు, పండ్లు వంటి వాటిని ట్రాక్ మీద నుంచి తీయాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదాలు జరుగుతాయి.
9. పాసేజ్ డు గోయిస్, ఫ్రాన్స్
ఈ రహదారి నిజానికి సముద్రంలోనే ఉంటుంది. కాకపోతే రోజుకు రెండు సార్లు కొంత సమయం పాటు రోడ్డు బయటకు వస్తుంది. అప్పుడే దానిపై ప్రయాణించాలి. అది కూడా వేగంగా వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే 4 మీటర్ల ఎత్తుకు ఈ రోడ్డపై నీళ్లు వచ్చేస్తాయి.
10. ది జేమ్స్ డబ్ల్యూ డి.వాల్టన్ హైవే, అలస్కా, యూఎస్ఏ
ఈ హైవేపై 666 కిలోమీటర్ల పాటు మొత్తం రాళ్లు ఉంటాయి. మిగిలిన 75 కిలోమీటర్ల పాటు తారు ఉంటుంది. ఈ హైవేపై 3 చోట్లు పెట్రోల్ పంప్‌లు ఉంటాయి. కేవలం ఒక మెడికల్ సెంటర్ మాత్రమే ఉంటుంది. అయితే వీటిని స్థానిక పోలీసులు ఎప్పటికప్పుడు చెక్ చేస్తారు. ఎందుకంటే అలస్కాలో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. అందుకని ఈ రోడ్డుపై వెళ్లే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు గాను గ్యాస్, పెట్రోల్ స్టేషన్లు, ఎమర్జెన్సీ సేవలను ఎప్పటికీ అందుబాటులో ఉంచుతారు.