చుట్టూ నీటి క‌రువుతో అల్లాడుతున్న ఎన్ని గ్రామాలు ఉన్నా, ఆ గ్రామంలో మాత్రం నీరు పుష్క‌లంగా దొరుకుతోంది… ఎందుకంటే..?

ఎండ‌లు మండిపోతున్న నేటి త‌రుణంలో ఎక్క‌డ చూసినా తీవ్ర‌మైన నీటి కొర‌త ఉన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ప్ర‌ధానంగా మ‌హారాష్ట్ర‌లోనైతే ఆ స‌మ‌స్య మ‌రింత తీవ్రంగా ఉంది. ఆ ప్రాంతంలో ఎక్క‌డా చుక్క నీరు దొరక్క ప్ర‌జ‌లు అల్లాడుతున్నారంటే స‌మ‌స్య ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అదే రాష్ట్రంలోని ఓ గ్రామం మాత్రం క‌రువును ఎదుర్కొన‌లేదు. ఇలా అనే కంటే క‌రువు వారిని ఏమీ చేయ‌లేక‌పోయింది అంటే క‌రెక్ట్‌గా ఉంటుందేమో! ఎందుకంటే ఆ గ్రామ ప్ర‌జ‌లు సాధించిన విజ‌యం అలాంటిది. ఆ రాష్ట్రంలోని అనేక గ్రామాలు తీవ్ర‌మైన నీటి కొర‌త‌తో అవ‌స్థ‌లు ప‌డుతుంటే ఆ గ్రామం మాత్రం అందుకు విభిన్నంగా ఉంది. ప్ర‌తి ఒక్క‌రికీ స‌మృద్ధిగా నీరు దొరుకుతోంది. అయితే ఇదంతా కేవ‌లం ఒకే రోజులో వారు సాధించిన విజ‌యం కాదు. దాని వెనుక ఎన్నో సంవ‌త్స‌రాల కృషి దాగి ఉంది.

water-atm

మ‌హారాష్ట్ర ఔరంగాబాద్ ప‌ట్ట‌ణంలోని ప‌టోడా అనే ప్రాంతంలో ఉన్న ఓ చిన్న గ్రామం అది. ప‌టోడా రూర‌ల్ ఏరియాకు చెందుతుంది. గ‌త 12 ఏళ్ల నుంచి ఆ గ్రామ ప్ర‌జ‌లు భూగ‌ర్భ జ‌లాలను పెంచ‌డంలో స‌ఫ‌లీకృతుల‌య్యారు. వ‌ర్షం ప‌డిన‌ప్పుడు వ‌చ్చే నీటితో స‌హా, రోజువారీ అవ‌స‌రాల‌కు ఉప‌యోగించే నీటిని కూడా వృథా పోనివ్వ‌కుండా గ్రామంలో ప్ర‌తి చోటా ఇంకుడు గుంత‌ల లాంటి నిర్మాణాలు చేపట్టారు. ఒక్క వ‌ర్షం చుక్క‌ను కూడా విడిచి పెట్టేది లేద‌న్నంత ధీమాగా వారు ఆ నిర్మాణాల‌ను చేశారు. దీంతో అక్క‌డ భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. ఈ క్ర‌మంలోనే ఆ గ్రామ ప్ర‌జ‌లు విలేజ్ వాట‌ర్ మేనేజ్‌మెంట్ క‌మిటీ పేరిట సొంత‌గా ఓ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని ద్వారా ఇంటింటికీ న‌ల్లాల‌ను బిగించుకున్నారు. వాటికి నీటి మీట‌ర్ల‌ను ఏర్పాటు చేసుకున్నారు. అయితే అంత‌టితో వారు ఆగిపోలేదు. ఆ గ్రామంలో ఏ ఇంట్లోనూ నీరు వృథా చేయ‌కూడ‌ద‌ని గట్టిగా నిశ్చ‌యించుకున్నారు. అందుకోసం వారు ప‌కడ్బందీ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.

water-atm

ఈ నేప‌థ్యంలో ఆ గ్రామ ప్ర‌జ‌లు స్వ‌చ్ఛ‌మైన తాగునీటి కోసం వాట‌ర్ ఏటీఎంల‌ను ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కో కుటుంబానికి ఏటీఎం కార్డులా ఓ వాట‌ర్ కార్డును ఇచ్చారు. వాటి ద్వారా ఒక్కో కుటుంబానికి రోజూ దాదాపు 20 లీటర్ల శుద్ధి చేసిన జ‌లాన్ని ఉచితంగా అందిస్తున్నారు. ఇంకా కావాల‌నుకున్న వారు రూ.5 చెల్లిస్తే 1వేయి లీట‌ర్ల నీటిని కొనుగోలు చేయ‌వ‌చ్చు. అయితే ఇందుకోసం ఎవ‌రినీ అడ‌గాల్సిన ప‌నిలేదు. నేరుగా వాట‌ర్ ఏటీఎం వ‌ద్ద‌కు వెళ్లి కార్డు పెట్టి, కాయిన్ వేస్తే చాలు, నీరు బ‌య‌టికి వ‌స్తుంది.

ఆ గ్రామ ప్ర‌జ‌లు అనుస‌రిస్తున్న ఈ విధానానికి గాను ఆ గ్రామానికి 22 రాష్ట్రీయ, జాతీయ అవార్డులు కూడా ల‌భించాయి. ప్ర‌స్తుతం క‌రువుతో చుట్టు ప‌క్క‌ల గ్రామాలు నీటికి అవ‌స్థ‌లు ప‌డుతున్నా, ఆ గ్రామంలో మాత్రం నీటికి కొర‌త లేదు. దీన్ని బ‌ట్టి చూస్తే ఎవ‌రైనా అదే విధంగా చేస్తే అస‌లు నీటి స‌మ‌స్య రానే రాద‌ని చెప్ప‌వ‌చ్చు. అయితే దానికి ప్ర‌జలంద‌రి స‌మ‌న్వ‌యం అవ‌స‌రం.

Comments

comments

Share this post

scroll to top