ఈయ‌న 2 లక్ష‌ల టాయిలెట్ల‌ను క‌ట్టించి టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయ్యారు తెలుసా..!

బహిరంగ మ‌ల‌విస‌ర్జ‌నతో మాన‌వాళికే కాదు, పర్యావ‌ర‌ణానికి కూడా ఎంత హాని క‌లుగుతుందో అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వాలు టాయిలెట్ల‌ను క‌ట్టుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు సూచిస్తుంటాయి. అందులో భాగంగా వీలైనంత ఆర్థిక స‌హాయం కూడా చేస్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ దేశంలో ఇంకా చాలా మందికి మ‌రుగుదొడ్లు లేవు. మరీ ముఖ్యంగా గంగాన‌దీ ప‌రివాహ‌క ప్రాంతంలో, దాని చుట్ట పక్క‌ల ఉన్న గ్రామాల్లోనైతే మ‌రుగుదొడ్లు చాలా మందికి లేవు. దీంతో పెద్ద ఎత్తున గంగాన‌ది కాలుష్యం అవుతోంది. ఈ విష‌యాన్ని గ‌మ‌నించారు కాబ‌ట్టే ఆయ‌న ఆ ప్రాంతాల‌న్నింటిలోనూ ఏకంగా 2 ల‌క్ష‌ల మ‌రుగుదొడ్లు క‌ట్టించారు. ఆయ‌నే ఈశ్వ‌ర్ ప‌టేల్‌.

ఈశ్వ‌ర్ ప‌టేల్ త‌న 12వ ఏట నుంచి సామాజిక సేవ‌ను చేయ‌డం మొద‌లు పెట్టాడు. ఆ వ‌య‌స్సు నుంచే గాంధీస్ సేవాదళ్‌లో చేరి స‌మాజ హితం కోసం ప‌నిచేయ‌సాగాడు. ఆ కోవ‌లోనే వ‌య‌స్సు పెరుగుతున్న‌కొద్దీ ఇంకా సేవ‌కే అంకిత‌మ‌య్యాడు. అయితే గంగాన‌ది ప‌రివాహ‌క ప్రాంతం, ఆ చుట్టు ప‌క్క‌ల గ్రామాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌కు మ‌రుగుదొడ్లు లేక‌పోవ‌డం వ‌ల్ల పెద్ద ఎత్తున డ్రైనేజీ నీరు గంగాన‌దిలో క‌లుస్తుంద‌ని తెలుసుకున్నాడు. దీనికి తోటు ఆ ప్రాంతాల్లో బ‌హిరంగ మ‌ల‌విసర్జ‌న వ‌ల్ల చుట్టూ ఉన్న ప‌ర్యావ‌ర‌ణానికి, గంగాన‌దికి కూడా కాలుష్య స‌మ‌స్య వ‌స్తుండ‌డాన్ని ఆయ‌న గ‌మ‌నించారు. దీంతో ఆ ప్రాంతాల్లో ఉన్న గ్రామ‌స్తుల‌కు మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టించే బృహ‌త్ ప్ర‌ణాళిక‌కు శ్రీ‌కారం చుట్టాడు.

అలా అనేక ఏళ్ల పాటు శ్ర‌మించి ఆయన 2 ల‌క్షల వ‌ర‌కు మ‌రుగుదొడ్ల‌ను నిర్మింప‌జేశారు. అందుకు గాను ఆయ‌న 118 సంస్థల స‌హ‌కారం కూడా తీసుకున్నారు. అయితే ఈశ్వ‌ర్ ప‌టేల్ గుజ‌రాత్ హ‌రిజ‌న్ సేవ‌క్ సంఘ్ అధ్య‌క్షుడిగా, గాంధీజీ స‌బ‌ర్మ‌తి హ‌రిజ‌న్ ఆశ్ర‌మ్ ట్ర‌స్ట్ మేనేజింగ్ ట్ర‌స్టీగా, ఎన్విరాన్‌మెంట‌ల్ శానిటేష‌న్ ఇనిస్టిట్యూట్ డైరెక్ట‌ర్‌గా, మాన‌వ్ సాధ‌నా ట్ర‌స్ట్‌, గాంధీ ఆశ్ర‌మ్ వ్య‌వ‌స్థాప‌కుడిగా ప‌ని చేశారు. దీంతో అన్ని సంస్థ‌ల స‌హ‌కారం తీసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమీ కాలేదు. ఈ క్ర‌మంలోనే 2 ల‌క్ష‌ల టాయిలెట్ల నిర్మాణాల‌ను పూర్తి చేసి ఆయ‌న టాయిలెట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచారు. అందుకు గాను ఈశ్వ‌ర్ ప‌టేల్‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం ల‌భించింది. మ‌హాత్మా గాంధీ అవార్డు కూడా ఆయ‌న్ను వ‌రించింది. కాగా ఈశ్వ‌ర్ ప‌టేల్ 2010, డిసెంబ‌ర్ 26న మ‌ర‌ణించారు. అయిన‌ప్ప‌టికీ సామాజిక సేవ‌లో, స్వ‌చ్ఛ‌తలో ఆయ‌న చూపిన స్ఫూర్తి నేటికీ ఆచ‌ర‌ణీయంగా మారింది. ఇందుకు గాను ఆయ‌న్ను మ‌నం ఎప్ప‌టికీ స్మ‌రించుకోవాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top