ఆమె కట్టెలు కొట్టుకుని వచ్చి అమ్ముతూ.. కొడుకును ఐఐటీకి పంపుతోంది తెలుసా..!

ఐఐటీ… మన దేశంలో చాలా మంది విద్యార్థులు చదవాలని ఆశించే విద్యాసంస్థ ఇది. పలు ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఐఐటీ కాలేజీలు ఉన్నాయి. ప్రవేశపరీక్ష రాసి అందులో మెరిట్ మార్కులు తెచ్చుకుని వాటిల్లోకి విద్యార్థులు ప్రవేశిస్తారు. నిజానికి ఐఐటీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణులు కావడం అంటే ఆషా మాషీ కాదు. అందుకు చాలా శ్రమపడాలి. నిత్యం చాలా సమయాన్ని చదువుకే కేటాయించాలి. ఇంత చేసినా కోర్సు చదివేందుకు డబ్బు ఉండాలి. కానీ.. ఆ విద్యార్థి మాత్రం అలా కాదు.. తండ్రి లేకపోయినా, పేదరికంలో ఉన్నా కష్టపడి చదివాడు. ఐఐటీ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణుడు అయ్యాడు. ఇప్పుడు ఐఐటీ కాలేజీలో చేరి తల్లి పడిన శ్రమకు తగిన ఫలితం అందివ్వనున్నాడు.

అతని పేరు వమన్ మండవి. చత్తీస్‌గడ్‌లోని దంతెవాడలో ఉన్న కిరండుల్ గ్రామంలో నివాసం ఉంటున్నాడు. అతని తల్లి పేరు మంగళి మండవి. అయితే వమన్ పుట్టిన 10 నెలలకే తండ్రి చనిపోయాడు. దీంతో వారి కుటుంబం కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కుటుంబ బాధ్యతను మంగళి నెత్తిన వేసుకుంది. తన కొడుకును ఎలాగైనా పెద్ద చదువులు చదివించాలని అనుకుని నిత్యం ఆమె బాగా కష్ట పడేది. అయితే వారి వర్గంలో సాధారణంగా పిల్లలను పశువులను కాయడానికి పనిలోకి పంపుతారు. లేదంటే కట్టెలు కొట్టుకు రమ్మని చెబుతారు. కానీ మంగళి ఉద్దేశం వేరు. తన కొడుకును ఆ పనుల్లోకి పంపలేదు. ఆమే వాటిని చేసేది. దీంతో కొడుకును ఆమె బాగా చదివించింది.

తల్లి పడుతున్న కష్టానికి అనుగుణంగానే కొడుకు వమన్ కూడా చాలా బాగా చదివేవాడు. అందుకే టెన్త్‌లో అతను 72 శాతంతో, ఇంటర్‌లో 76 శాతంతో మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణత సాధించాడు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఐఐటీ ఎంట్రన్స్ రాశాడు. మొదటి అటెంప్ట్‌లోనే అందులో ఉత్తీర్ణత సాధించాడు. దీంతో అతనికి ఐఐటీ కాలేజీలో సీటు లభించనుంది. ఈ క్రమంలో వమన్‌కు అక్కడి ప్రభుత్వం ఆర్థిక సహాయం కూడా అందించనుంది. దాంతో అతను ఐఐటీ విద్యను అభ్యసించనున్నాడు. తన తల్లి పడ్డ కష్టానికి తగిన ఫలితం లభించినందుకు వమన్ పడుతున్న సంతోషం అంతా ఇంతా కాదు. అవును మరి, అంతటి కష్టం పడ్డారు కాబట్టే ఇప్పుడు దానికి తగ్గ ఫలితం దక్కింది. అందుకే వమన్ ఐఐటీ చదువుతున్నాడు. ఇక అతని లక్ష్య సాధన ఎంతో దూరంలో లేదు. త్వరలోనే అది కూడా అతను సాధించాలని మనమూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top