దేవేంద్రుడు, అగ్నిదేవుడు, వరుణుడు, వాయుదేవుడు కన్నేసిన మనోహరమైన దమయంతి నలుడికే ఎందుకు దక్కింది?

హిందూ పురాణాల్లో ఉండే న‌ల‌ద‌మ‌యంతుల గురించి అందరికీ తెలిసిందే. శ‌ని గ్ర‌హ ప్ర‌భావం కార‌ణంగా రాజ్యాన్ని, స‌ర్వ సంప‌ద‌ల‌ను కోల్పోయి, అనంతరం కొన్ని ప‌రిణామాల వ‌ల్ల కురూపిగా మారి చివ‌ర‌కు త‌న రాజ్యాన్ని తాను న‌లుడు ద‌క్కించుకుంటాడు. ఈ క్ర‌మంలో న‌లుడితోపాటు అత‌ని భార్య ద‌మ‌యంతి కూడా భ‌ర్త వల్ల ఎన్నో క‌ష్టాల‌ను అనుభ‌విస్తుంది. అయిన‌ప్ప‌టికీ చివ‌ర‌కి క‌థ సుఖాంతం అవుతుంది. అయితే అస‌లు న‌లుడు రాజ్యాన్ని ఎందుకు కోల్పోతాడు, చివ‌ర‌కు ఎలా తిరిగి దాన్ని పొందుతాడు, ద‌మ‌యంతి ప్రేమ ఎటువంటిది అన్న వివ‌రాల‌ను ఈ క‌థలో తెలుసుకుందాం.

విదర్భగా పిలవబడే కుండిన దేశపు రాజు భీమరాజు. ఆయన కూతురే దమయంతి. నిషిధ రాజాధిపతి వీరసేనుని కుమారుడు నలుడు. ఒకరి గుణగుణాలను గురించి ఒకరు తెలుసుకుని నలదమయంతులు ఇద్ద‌రూ ప్రేమలో పడతారు. అయితే ద‌మ‌యంతి రూపలావణ్యాలకే కాదు, గుణసౌశీల్యాలకు కూడా మారు పేరుగా ఉండేది. దీంతో ఆమెను పొందేందుకు దేవేంద్రుడు, అగ్ని, వరుణుడు, వాయుదేవుడు కూడా ఆస‌క్తి చూపుతారు. అయితే ద‌మ‌యంతి తాను న‌లున్ని ప్రేమిస్తున్న విష‌యం తండ్రి భీమ‌రాజుకు చెప్ప‌దు. దీంతో భీమ‌రాజు ద‌మ‌యంతికి స్వ‌యం వ‌రం ప్ర‌క‌టిస్తాడు. దానికి దేవేంద్రుడు, అగ్ని, వ‌రుణుడు, వాయుదేవుడు వ‌స్తారు. ఇక ద‌మ‌యంతి ప్రియుడు న‌లుడు కూడా వ‌స్తాడు.

అయితే స్వ‌యం వ‌రం స‌మ‌యంలో దేవేంద్రుడు, అగ్ని, వ‌రుణుడు, వాయుదేవుడు న‌లుగురూ ద‌మ‌యంతికి న‌లుడిలాగే క‌నిపిస్తారు. దీంతో ఆమె కొంత సేపు ఆశ్చ‌ర్యానికి లోన‌వుతుంది. చివ‌ర‌కు ఆమె ఇష్ట‌దైవ‌మైన స‌ర‌స్వ‌తి దేవిని ప్రార్థించ‌గా అప్పుడు ఆమెకు అస‌లు న‌లుడు క‌నిపిస్తాడు. దీంతో న‌లుడి మెడ‌లో పూల‌మాల వేసి అత‌న్ని ఆమె పెళ్లి చేసుకుంటుంది. ఈ క్ర‌మంలో వారి పెళ్లి అంగ‌రంగ వైభవంగా జ‌రుగుతుంది. త‌రువాత వారికి కూతురు, కుమారుడు జ‌న్మిస్తారు.

న‌లుడు, ద‌మ‌యంతి అలా స్వ‌ర్గ సుఖాల‌ను అనుభ‌విస్తుండ‌గా ఒక్క‌సారిగా వారి జీవితంలో పెను మార్పులు వ‌స్తాయి. శ‌ని గ్ర‌హ ప్ర‌భావం కార‌ణంగా న‌లుడు దుర్వ్యసనాల బారిన ప‌డ‌తాడు. దీంతోపాటు సోదరుడైన పుష్కరుని చేతిలో జూదంలో ఒడిపోతాడు. దీంతో నలుడు రాజ్యాన్ని, స‌ర్వ సంప‌ద‌ల‌ను కోల్పోతాడు. భార్య ద‌మ‌యంతితో స‌హా కట్టుబట్టలతో అడవులకు వెళ‌తాడు. అయితే ఆ కీకార‌ణ్యంలో పిల్ల‌లు ఉండ‌డం మంచిది కాద‌ని భావించిన ద‌మ‌యంతి త‌న పిల్ల‌ల‌ను తండ్రి వ‌ద్ద‌కు పంపుతుంది. ఇక ద‌మ‌యంతి కష్టాలు చూడలేక నలుడు దమయంతిని అడవిలోనే వదిలి వెళ్ళిపోతాడు.

అలా అడ‌విలో తిరుగుతున్న ద‌మ‌యంతిని ఎరుకలవాడు బలాత్కారం చేయ‌బోయి భ‌స్మం అవుతాడు. దీంతో ద‌మ‌యంతి భర్తను వెతుకుతూ అడవిని దాటి నగరం చేరుకుంటుంది. త‌రువాత పినతల్లి పద్మావతి ఇంటికి వెళ్తుంది. అక్క‌డి నుంచి తండ్రి వ‌ద్ద‌కు ద‌మ‌యంతి చేరుకుంటుంది. కానీ ఆమెకు న‌లుని జాడ తెలియ‌దు. అయితే మ‌రోవైపు దమయంతిని వీడిన నలుడు అడవులలో తిరుగుతుండగా కర్కోటకమనే సర్పం నలుని కాటేస్తుంది. దీంతో నలుని దేహఛాయ నలుపు రంగులోకి మారిపోతుంది. నలుడు కురూపి అవుతాడు. అత‌ను అస‌లు గుర్తు ప‌ట్ట‌లేనంతా మారిపోతాడు. ఈ క్ర‌మంలోనే బాహుకుని పేరుతో రథ‌సారధిగా మారి విదర్భ రాజ్యానికి చేరుకుంటాడు నలుడు. అది త‌న మామ‌గారి రాజ్య‌మే. అక్క‌డ అంతఃపురంలో కురూపిగా ఉన్న న‌లున్ని ఎవ‌రూ గుర్త ప‌ట్ట‌రు. కానీ భార్య ద‌మ‌యంతి మాత్రం భ‌ర్తను ఇట్టే గుర్తిస్తుంది. వారి మ‌ధ్య ఉన్న ప్రేమే ఆమెను మ‌ళ్లీ అత‌ని వ‌ద్దకు చేర్చింది. అందుకే ఆమె అత‌న్ని కురూపిగా ఉన్నా గుర్తిస్తుంది.

త‌రువాత కొన్ని రోజుల‌కు న‌లునిపై ఉండే శ‌ని గ్ర‌హ ప్ర‌భావం పోతుంది. దీంతో అత‌నికి మ‌ళ్లీ నిజ రూపం వ‌స్తుంది. అలా కాగానే న‌లుడు పుష్కరునితో మరోసారి జూదమాడి తాను కోల్పోయిన‌ రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంటాడు. దీంతోపాటు స‌క‌ల సంప‌ద‌లు మ‌ళ్లీ వ‌స్తాయి. ఇక అప్పటి నుంచి న‌లుడు, ద‌మ‌యంతి ఇద్ద‌రూ అచంచలమైన ప్రేమానురాగాల‌తో ఉంటారు. ఆద‌ర్శ‌వంత‌మైన జంట‌లా జీవనం సాగిస్తారు. అందుకే న‌ల ద‌మ‌యంతుల క‌థ‌ను ప్ర‌తి జంటా త‌ప్ప‌క‌ వినాల‌ని చెబుతారు..!

Comments

comments

Share this post

scroll to top