ఎంత ఎత్తుకు ఎదిగినా, ధ‌నం సంపాదించినా గ‌ర్వం ఉండరాద‌ని, అణ‌కువ‌తో ఉండాల‌ని చాటి చెప్పే క‌థ ఇది..!

మ‌నిషి తాను ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని ఉన్న‌త స్థానాల‌కు చేరుకున్నా, ఎంత ధ‌నం ఉన్నా అణ‌కువ‌తో ఉండాల‌ని పెద్ద‌లు చెబుతారు. అంద‌రి క‌న్నా తామే చాలా గొప్ప అని భావించ‌కూడ‌ద‌ని, తోటి మ‌నుషుల‌ను త‌క్కువ చేసి చూడ‌వ‌ద్ద‌ని, అంద‌రితోనూ స్నేహ పూర్వ‌కంగా ఉంటూ, తోటి వారికి స‌హాయం చేయాల‌ని వారు అంటారు. అది నిజ‌మే. మ‌నం మ‌నుషులం. మ‌నుషుల‌న్నాక తోటి వారికి స‌హాయం చేయాలి. లాభం చేయ‌క‌పోయినా ఫ‌ర్వాలేదు, న‌ష్టం మాత్రం చేయ‌కూడ‌దు. గ‌ర్వం అస్స‌లు ప‌నికిరాదు. అది ఉంటే మ‌నిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, చివ‌ర‌కు ప‌త‌న‌మై, పాతాళ స్థాయికి చేరుకుంటాడు. అప్పుడ‌త‌నికి మంచి ఏదీ క‌నిపించదు. ఇప్పుడు మేం చెప్ప‌బోతున్న బ్ర‌హ్మ దాస్ క‌థ కూడా ఇలాంటిదే. మొద‌ట్నుంచీ తానే గొప్ప‌వాడినని గ‌ర్వంగా ఉండే అత‌ను చివ‌ర‌కు ఏం తెలుసుకున్నాడు..? అన్న‌దే అత‌ని క‌థ‌లోని ముఖ్య‌మైన అంశం.

కాశ్మీర్‌లోని శ్రీ‌న‌గ‌ర్ ప్రాంతానికి గురు నాన‌క్ త‌న ఇద్ద‌రు శిష్యులైన మ‌ర్ద‌నా, బాల‌లతో క‌ల‌సి ఒక రోజు వ‌చ్చాడ‌ట‌. ఈ క్ర‌మంలో గురు నానక్ చేస్తున్న ఆధ్యాత్మిక భోధ‌న‌లు, ఆయ‌న ప్ర‌సంగాలు న‌చ్చిన అనేక మంది భ‌క్తులు ఆయ‌న చుట్టూ చేరి వాటిని ఆస‌క్తిగా వింటూ కూర్చున్నార‌ట‌. అయితే అదే ప్రాంతంలో నివాసం ఉండే బ్ర‌హ్మ దాస్ అనే ఒక పండితుడు మాత్రం తానే గొప్ప‌వాడిన‌ని, గురునాన‌క్ అయితే ఏంటి, త‌నకున్న జ్ఞానం ముందు గురునానక్ ఎంత‌టి వాడని హేళ‌న చేస్తూ తిరిగాడు. కానీ ఒకానొక సంద‌ర్భంలో అత‌ను ఏమ‌నుకున్నాడంటే, సరే, ఏది ఏమైనా ఒక‌సారైతే గురునాన‌క్‌ను చూద్దామ‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలో త‌న ద‌గ్గ‌ర ఉన్న ఒక తివాచీపై కూర్చుని దాన్ని వేసుకుని ఆకాశ మార్గంలో వెళ్తూ గురు నాన‌క్ ఉన్న ప్రాంతానికి వ‌చ్చాడు. కానీ ఎంత చూసినా బ్ర‌హ్మ‌దాస్‌కు గురునాన‌క్ క‌నిపించ‌లేదు.

gurunanak

ఈ క్ర‌మంలో అత‌ను ఒకానొక ద‌శ‌లో ఆశ్చ‌ర్యానికి గురయ్యాడు. అంత‌లోనే తేరుకుని తివాచీ నుంచి భూమిపైకి దిగి వ‌చ్చి మ‌ళ్లీ చూశాడు. కానీ జ‌న స‌మూహం మాత్ర‌మే అత‌నికి క‌నిపించింది. గురునాన‌క్ మ‌ళ్లీ క‌న‌బ‌డ‌లేదు. కానీ జ‌నాలేమో అక్క‌డెవ‌రో ఉండి బోధ‌న‌లు చేస్తున్న‌ట్టుగా అంద‌రూ ఒకే వైపు ఉండి శ్ర‌ద్ధ‌గా వింటుండ‌డం గ‌మ‌నించాడు. ఇక లాభం లేద‌నుకున్న బ్ర‌హ్మ‌దాస్ ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు. ఆ తరువాత మ‌ళ్లీ సాయంత్రం పూట గురునాన‌క్ బ‌స చేసిన ప్రాంతానికి వ‌చ్చి అత‌ను క‌నిపిస్తాడేమోన‌ని మ‌ళ్లీ చూశాడు. కానీ ఈసారి అత‌నికి నిరాశే ఎదురైంది. గురునాన‌క్ ఉన్నాడా అని అత‌ని శిష్యుల‌ను అడ‌గ్గా వారు అత‌ను ఉన్నాడ‌నే స‌మాధానం చెప్పారు. కానీ అక్క‌డ చూస్తే బ్ర‌హ్మ‌దాస్‌కు ఎవ‌రూ క‌నిపించ‌లేదు. ఇక లాభం లేద‌నుకుని మ‌రుస‌టి రోజు ఉద‌య‌మే మ‌ళ్లీ గురునాన‌క్ బోధ‌న‌లు చేసే ప్రాంతానికి వెళ్లాడు. అయితే ఈ సారి అత‌ను కాలిన‌డ‌క‌నే వెళ్లాడు. అప్ప‌టికీ అత‌నిలో ఏ గ‌ర్వం లేదు. కేవ‌లం గురునాన‌క్‌ను చూడాల‌నే ఓ బ‌ల‌మైన కోరిక మాత్ర‌మే ఉంది. దీనికి తోడు మ‌న‌స్సంతా అదే కోరిక నిండిపోయి ఉంది. అయితే ఈ సారి ఆశ్చ‌ర్యంగా గురునాన‌క్ క‌నిపించాడు.

ఈ క్ర‌మంలో బ్ర‌హ్మ‌దాస్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు ఎందుకు క‌నిపించ‌లేద‌ని గురునాన‌క్‌ను అడిగాడు. దానికి గురునాన‌క్ బ‌దులిస్తూ ఇప్ప‌టి వ‌ర‌కు నువ్వు గ‌ర్వ‌మ‌నే అంధ‌కారంలో, చీక‌టిలో కూరుకుపోయావు, అందుకే నీకు పట్ట‌ప‌గ‌లే నేను క‌నిపించ‌లేదు. ఎవ‌రైతో గ‌ర్వాన్ని విడిచిపెట్టి, ఇత‌రుల‌తో అణ‌కువ‌గా, విన‌యంగా ఉంటారో వారికే నేను క‌నిపిస్తాన‌ని గురునాన‌క్ బ‌దులిచ్చాడు. ఇదీ, బ్ర‌హ్మ‌దాస్ క‌థ నుంచి మ‌న‌కు తెలుస్తున్న నీతి..! అందుకే మ‌న పెద్ద‌లు అంటారు, ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎంత ధ‌నం ఉన్నా అణ‌కువ‌గా ఉండాల‌ని. అది నిజ‌మే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top