ర‌క్షాబంధ‌న్ అంటే సోద‌రులు, సోద‌రీమ‌ణుల పండుగే కాదు… భార్యాభ‌ర్త‌ల పండుగ కూడా..!

ర‌క్షా బంధ‌న్‌… ఈ పేరు చెబితే చాలు. అన్నాచెల్లెల్లు, అక్కా త‌మ్ముళ్ల మ‌ధ్య ఉన్న ప్రేమానుబంధాలు, ఆప్యాయ‌త‌లు గుర్తుకు వ‌స్తాయి. శ్రావ‌ణ పూర్ణిమ రోజున వ‌చ్చే ఈ పండుగ‌ను కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత భేదం లేకుండా ప్ర‌తి ఒక్క‌రూ జరుపుకుంటారు. అక్క‌లు, చెల్లెల్లు త‌మ త‌మ్ముళ్లు, అన్న‌ల‌కు రాఖీల‌ను క‌ట్టి, వారికి స్వీట్ తినిపించి, త‌మ‌కు ర‌క్ష‌గా నిల‌వమ‌ని కోరుతారు. ఈ క్ర‌మంలో అన్న‌లు, త‌మ్ముళ్లు త‌మ అక్క‌లు, చెల్లెల్ల చేతిలో డ‌బ్బో, న‌గ‌లో ఏదైనా గిఫ్టో చేతిలో పెట్టి మీకు మేమున్నామ‌ని చాటి చెబుతారు. సాధార‌ణంగా జ‌రిగే ర‌క్షాబంధ‌న్ ఇది. అయితే మీకు తెలుసా..? రాఖీ పండుగ అన్న‌ద‌మ్ములు, అక్కా చెల్లెల్ల పండుగే కాదు, భార్యా భ‌ర్త‌ల పండుగ కూడా. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆ రోజు భార్య‌లు కూడా త‌మ భ‌ర్త‌ల‌కు రాఖీ క‌ట్ట‌వ‌చ్చ‌ట‌. మీరు ఆశ్చ‌ర్యపోయినా ఇది నిజంగా నిజ‌మే. దీని వెన‌క ఉన్న కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

rakhi

ఇంద్రుడు తెలుసుగా. స్వర్గంలో ఉంటాడు. రంభ‌, ఊర్వ‌శి, మేన‌క వంటి అప్స‌ర‌స‌ల నృత్యాలు, మేజువాణీలు, భోగ‌భాగ్యాల న‌డుమ తుల‌తూగుతూ ఉంటాడు. ఆ… అవును, అత‌నే. అయితే ఇంద్రుడు ఒక‌సారి రాక్ష‌సుల‌తో యుద్ధానికి వెళ్లిన‌ప్పుడు అత‌ని భార్య ఇంద్రాణి అత‌నికి రాఖీ క‌డుతుంద‌ట‌. దీని వ‌ల్ల త‌న భ‌ర్త‌కు ఎలాంటి అపాయం రాద‌ని, యుద్ధంలో విజ‌యం సాధిస్తాడ‌ని ఆమె న‌మ్మింది. ఈ క్ర‌మంలోనే ఇంద్రుడు యుద్ధంలో విజ‌యం పొందిన‌ట్టు చెబుతారు. అలా రాఖీ క‌ట్ట‌డం మొద‌లైంద‌ట‌. అయితే అది అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల పండుగ‌గా నేటి త‌రానికి మారిపోయింది. దీని వెనుక కూడా ఓ క‌థ ఉంది.

త‌న అన్న అయిన య‌ముని సౌఖ్యం కోసం అత‌ని చెల్లెలు యమున అత‌నికి ఒకానొక సంద‌ర్భంలో రాఖీ క‌డుతుంద‌ట‌. దీంతో చెల్లెలి ప్రేమ‌ను గ‌మ‌నించిన య‌ముడు అప్ప‌డు ఇలా అంటాడ‌ట‌. అదేమిటంటే శ్రావ‌ణ పూర్ణిమ రోజున రాఖీ క‌ట్టించుకున్న అన్న‌లు, త‌మ్ములు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, సుఖ సంతోషాల‌తో జీవించాల‌ని య‌ముడు అంటాడ‌ట‌. అందుకే ఆ రోజున రాఖీ పండుగ జ‌రుపుకోవ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. అదేవిధంగా క‌ర్ణావ‌తి అనే రాణి మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి హుమాయున్‌కు త‌మ రాజ్యాన్ని ర‌క్షించాల‌ని వేడుకుంటూ ఓ రాఖీ పంపుతుంద‌ట‌. ఈ క్ర‌మంలో ఆమె ఆ రాఖీని అనుకోకుండా శ్రావ‌ణ పూర్ణిమ రోజునే పంపాల్సి వ‌చ్చిందట‌. క్ర‌మంగా ఇది అంత‌టా వ్యాపించింది. మొద‌ట ఈ పండుగ‌ను రాజ‌స్థాన్‌లోని కొంద‌రు వ‌ర్గాల ప్ర‌జ‌లు జరుపుకునే వార‌ట‌. అనంత‌రం అది దేశ‌వ్యాపిత‌మైంద‌ని చెబుతారు.

ఇప్పుడంటే రాఖీలు ర‌క ర‌కాల ఆకారాల్లో, రంగుల్లో ల‌భ్య‌మ‌వుతున్నాయి కానీ ఒక‌ప్పుడు రాఖీలు వేరేగా ఉండేవి. వాటిని దూది, దారంతో త‌యారు చేసేవారు. కొంత మెత్త‌ని దూదిని తీసుకుని దాన్ని గుండ్రంగా వ‌చ్చేలా చేసి, దానికి 3 దారాల‌ను క‌ట్టి రాఖీల‌ను త‌యారు చేసేవారు. అనంత‌రం వాటిని ప‌సుపు నీటిలో ముంచి త‌దుప‌రి సోద‌రుల‌కు క‌ట్టేవారు. కానీ ఇప్ప‌టి రాఖీలు చాలా వెరైటీగా ల‌భిస్తుండ‌డం అంద‌రికీ తెలిసిందే. కాబ‌ట్టి, తెలుసుకున్నారుగా, ర‌క్షాబంధ‌న్ అంటే సోద‌రులు, సోద‌రీమ‌ణుల మ‌ధ్య జ‌రుపుకునే పండుగే కాదు, భార్యా భ‌ర్త‌ల‌ది కూడా. భ‌ర్త‌కు ఏం కాకూడ‌ద‌ని, ఎల్ల‌ప్పుడూ విజ‌యం సాధించాల‌ని భార్య‌, భార్య‌కు ర‌క్ష‌ణగా ఉండాల‌ని భ‌ర్త జ‌రుపుకునే పండుగ‌… ర‌క్షాబంధ‌న్‌..!

Comments

comments

Share this post

scroll to top