గాలిలో బ‌తుకులు… విద్యుత్ లైన్‌మెన్ల జీవితాలు…

వ‌ర్షం వల్లో, గాలి వ‌ల్లో మ‌రేదైనా కార‌ణాల వ‌ల్లో మ‌నం ఒక 5 నిమిషాలు క‌రెంటు పోతేనే విసుగు చెందుతాం. విద్యుత్ సిబ్బందిని తిట్టుకుంటాం. మ‌ళ్లీ క‌రెంటు రాగానే మామూలైపోతాం. అయితే మీకు తెలుసా..? అలా క‌రెంటు వ‌చ్చేలా చేసేది ఎవ‌రో..? విద్యుత్ అధికారులు కాదు, అవును. వారు కేవలం ఆఫీసుల‌కే ప‌రిమిత‌మ‌వుతారు. మ‌రెవ‌రు క‌రెంట్ తెప్పిస్తారు..? అంటే… వారు లైన్‌మెన్‌. ఎండ, వాన‌, చ‌లి, రాత్రి, ప‌గ‌లు తేడా లేకుండా వారు ప‌నిచేస్తారు. ఎక్క‌డ విద్యుత్ సమ‌స్య వ‌చ్చినా అక్కడికి చేరుకుని స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యే వ‌ర‌కు శ్ర‌మిస్తారు. ఇంత చేసినా వారి జీవితానికి మాత్రం గ్యారంటీ లేదు.

line-men

మ‌న దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విద్యుత్ లైన్‌మెన్లు ప‌డుతున్న బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. ఓ వైపు ఉద్యోగ భద్ర‌త లేదు. మ‌రో వైపు జీవితానికి గ్యారంటీ లేదు. ఎప్పుడు ఏ ప్రమాదం బారిన ప‌డాల్సి వ‌స్తుందో తెలియ‌దు. దీనికి తోడు ప‌ని భారం. త‌గినంత సిబ్బంది లేక‌పోవ‌డంతో ప‌ది మంది చేసే ప‌ని ఒక్క‌రే చేయాల్సి వ‌స్తోంది. దీంతో నిత్యం 8 గంట‌లు కాదు, దాదాపు 12 గంట‌ల పాటు తీవ్రంగా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. ఇది వారి శారీర‌క ఆరోగ్య‌మే కాదు, మాన‌సిక ఆరోగ్యంపై కూడా ప్ర‌భావం చూపుతోంది. ఈ క్ర‌మంలో విద్యుత్ స్తంభాల‌పై ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ఒక్కోసారి అనుకోకుండా ప్ర‌మాదాల బారిన ప‌డి మృతి చెందాల్సి వ‌స్తోంది.

గ‌త 3 ఏళ్ల కాలంలో దేశంలో వివిధ సంద‌ర్భాల్లో ప‌నిచేస్తూ చ‌నిపోయిన లైన్‌మెన్ల సంఖ్య 1400. 2009-10 కాలంలో ఒడిశాలో 77 మంది, 2010-11 కాలంలో 84 మంది లైన్‌మెన్లు మృత్యువాత ప‌డ్డారు. జార్ఖండ్‌లో ప్ర‌తి 2 నెల‌ల‌కు ఇద్ద‌రు లేదా ముగ్గురు లైన్‌మెన్లు చ‌నిపోతున్నారు. రాజ‌స్థాన్‌లో గ‌త ఏడాది 33 మంది చ‌నిపోగా, నాగ్‌పూర్‌లో ముగ్గురు చ‌నిపోయారు. అయితే ఇవి అధికారిక లెక్క‌లు మాత్ర‌మే. అస‌లు నిజంగా మృతి చెందిన వారి సంఖ్య ఇంత‌కు మూడింతలు ఉంటుంద‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఇప్ప‌టికైనా సంబంధిత మంత్రులు, అధికారులు స్పందించి లైన్‌మెన్ల బాగుకోసం ఏదైనా చేయాలి. వారిని ప‌ర్మినెంట్ ఉద్యోగులుగా మార్చడం, ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌డం, ప‌నిచేసే స‌మ‌యంలో త‌గిన ర‌క్ష‌ణ ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం, ఆరోగ్యం వంటి అంశాల్లో వారికి సౌక‌ర్యాలు క‌ల్పించాలి. లేదంటే వారి జీవితాలు ఇంకా దుర్భ‌ర‌మ‌య్యేందుకు అవ‌కాశం ఉంది.

Comments

comments

Share this post

scroll to top