29 ఏళ్ల క్రితం లెటర్ రాసి సముద్రంలో పడేసింది..ఇప్పుడు పేస్ బుక్ లో కనిపించింది.! ఇంతకీ ఆమె ఏం రాసింది?

నాగార్జున‌, ఆసిన్‌, ర‌క్షిత‌లు న‌టించిన శివ‌మ‌ణి సినిమా మీకు గుర్తుంది క‌దా. అందులో ఆసిన్ త‌న‌ను ర‌క్షించ‌మ‌ని ఓ లెట‌ర్‌ను రాసి సీసాలో దాన్ని పెట్టి ఆ త‌రువాత సీసాను స‌ముద్రంలోకి విసిరేస్తుంది. దీంతో ఆ సీసా స‌ముద్రంలో ప్ర‌యాణం చేసి కొన్ని సంవ‌త్స‌రాల త‌రువాత‌ వేరే చోట ర‌క్షిత‌కు ఆ సీసా దొరుకుతుంది. అందులో ఉన్న లెట‌ర్‌ను చ‌దివిన ర‌క్షిత దాన్ని ట్రాక్ చేసి ల‌వ‌ర్స్ స్టోరీని వెలికితీస్తుంది. అయితే నిజానికి ఇది సినిమా అయినా, వాస్తవంగా ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా జ‌రిగింది. కాకపోతే అందులో ల‌వ‌ర్స్ ఎవ‌రూ లేరు. కానీ అది ఒక మ‌హిళ‌ 29 ఏళ్ల క్రితం రాసింది.

ఆమె పేరు మిరాండా చావెజ్‌. ప్ర‌స్తుతం ఆమె వ‌య‌స్సు 37 సంవ‌త్స‌రాలు. అయితే ఆమెకు 8 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న‌ప్పుడు, 1988 సెప్టెంబ‌ర్ 26వ తేదీన‌ ఆమె అమెరికాలోని సౌత్ క‌రోలినాలో ఉన్న కొల్లెటాన్ కౌంటీ, ఎడిస్టో బీచ్‌లో ఓ రోజు త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి వీకెండ్‌కు వెళ్లింది. ఆ స‌మ‌యంలో ఆమె ఏమ‌నుకుందో తెలియ‌దు కానీ, త‌న పేరు, చిరునామా, తాను చ‌దువుతున్న స్కూల్‌, తాను అక్క‌డికి ఎందుకు వ‌చ్చింది… తదిత‌ర వివ‌రాల‌ను ఓ లెట‌ర్‌లో రాసి ఆ లెట‌ర్ ను మ‌డిచి సీసాలో పెట్టింది. అనంత‌రం ఆ సీసాను భ‌ద్రంగా బిర‌డాతో మూసి దాన్ని స‌ముద్రంలోకి విసిరేసింది. అంతే.. ఆ ఘ‌ట‌న జ‌రిగి 29 ఏళ్లు గ‌డిచిపోయాయి.

ఈ క్రమంలో ఆ సీసా స‌ముద్రంలో ప్ర‌యాణించింది. ఇటీవ‌లే ఓ రోజున జార్జియా స‌పెలొ ఐలాండ్ బీచ్ లో ఆ సీసా ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ క్ర‌మంలో ఆ సీసా లిండా హాంపైర్స్‌, డేవిడ్ అనే దంప‌తుల‌కు దొరికింది. దీంతో వారు ఆ సీసాలో ఉన్న లెట‌ర్‌ను తీసి చ‌ద‌వ‌గా అస‌లు విష‌యం తెలిసింది. అందులో ఉన్న అడ్ర‌స్ ప్ర‌కారం వారు మిరాండాను ట్రాక్ చేశారు. కానీ ఆ చిరునామాలో ఆమె ఉండడం లేద‌ని తెలిసింది. అయితే లిండా దంప‌తులు అంత‌టితో ఆగ‌లేదు. ఆ లెట‌ర్‌ను ఫొటో తీసి దాన్ని ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. దీంతో ఆ పోస్టు వైర‌ల్ అయింది. ఈ క్రమంలోనే ఆ పోస్టును ఎట్ట‌కేల‌కు మిరాండా చూసింది. లిండా దంప‌తుల‌ను సంప్ర‌దించింది. తాను 29 ఏళ్ల క్రితం రాసిన ఆ లెట‌ర్‌ను చూసుకుని మురిసిపోయింది. అదొక తీపి జ్ఞాప‌క‌మ‌ని చెప్పింది. అవును మ‌రి, అన్నేళ్ల త‌రువాత త‌న చిన్న‌ప్ప‌టి రాతను మ‌రోసారి చూసుకునే అవ‌కాశం ద‌క్కింది క‌దా. అది అంద‌రికీ ల‌భించ‌దు క‌దా..! అందుకే అదొక తీపి జ్ఞాప‌కం మ‌రి..!

Comments

comments

Share this post

scroll to top