దేశంలోని జాతీయ రహదారులపై ఉండే టోల్‌గేట్స్ వద్ద పసుపు రంగు లైన్ దాటిన వారు 3 నిమిషాల కన్నా ఎక్కువ సేపు టోల్ గేట్ వద్ద వేచి ఉంటే వారు టోల్ చెల్లించుకుండా ఫ్రీగానే వెళ్లవచ్చు. ఇదీ… గత కొద్ది రోజులుగా వాట్సాప్‌లో షేర్ అవుతున్న మెసేజ్. దీంతో చాలా మంది ఈ మెసేజ్‌ను చూపుతూ టోల్ గేట్ల వద్ద ఫీజు చెల్లించడం లేదని తెలిసింది. అయితే దీనిపై National Highway Authority of India (NHAI) స్పందించింది. ఈ వెసులు బాటు దేశంలో ఎక్కడా లేదని, కేవలం పంజాబ్ రాష్ట్రంలో ఉన్న జాతీయ రహదారులపై ప్రయాణించే వారికే ఈ సౌకర్యం ఉందని ఆ విభాగం వారు తేల్చి చెప్పారు.
అయితే మరి హరిఓమ్ జిందాల్ అనే అడ్వకేట్ గతేడాది సమాచార హక్కు చట్టం ద్వారా NHAIను వివరాలు అడగ్గా వారు చెప్పారు కదా. ఆయన ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆ లెటర్ వివరాలు ఉన్నాయి కదా..! అంటే.. అవును, ఉన్నాయి. అయితే వారు అందులో ఈ విషయాన్ని సరిగ్గా మెన్షన్ చేయలేదట. కేవలం పంజాబ్ రాష్ట్రంలోనే ఈ సౌకర్యం ఉంది అని ఆ సమాధానాల్లో చెప్పలేదట. దీంతో పెద్ద గందరగోళం ఏర్పడింది.
ఈ క్రమంలోనే దీనిపై NHAI తాజాగా స్పందించి స్పష్టత ఇచ్చింది. కేవలం పంజాబ్ రాష్ట్రంలోని జాతీయ రహదారులపై వెళ్లే వారికే ఈ సౌకర్యం ఉందని చెప్పింది. వారు టోల్‌గేట్స్ వద్ద ఎల్లో లైన్ దాటి 3 నిమిషాల కన్నా ఎక్కువ సేపు వేచి ఉంటే వారు టోల్ చెల్లించకుండానే వెళ్లవచ్చు. అయితే దీనిపై స్పష్టంగా తెలియకపోవడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇక తాజాగా NHAI ఇచ్చిన వివరణతో అసలు విషయం తెలిసింది. అయితే మరి కేవలం పంజాబ్‌లోనే ఈ సౌకర్యం ఎందుకు..? మిగిలిన రాష్ట్రాల్లోనూ జాతీయ రహదారులు ఉన్నాయి కదా. వాటిపై ఉన్న టోల్ గేట్స్ వద్ద కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అయి గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది కదా. మరి వాటిపై ఎందుకు ఈ సౌకర్యాన్ని అమలు చేయడం లేదు..? అని అడిగితే.. అందుకు సంబంధిత అధికారుల నుంచి సమాధానం లేదు.
కాగా గతంలో ఓ ఐఏఎస్ అధికారి టోల్ గేట్స్ వద్ద ఏర్పడే ఈ సమస్యను తొలగించడానికి పలు సూచనలు చేశారు. అవేమిటంటే… టోల్ గేట్స్ వద్ద ఉన్న ఏ లేన్‌లో అయినా కేవలం 6 కన్నా ఎక్కువ వాహనాలు నిలవకుండా వేగంగా టోల్ తీసుకోవాలి. దీంతోపాటు పీక్ అవర్స్‌లో 10 సెకండ్లకు ఒక వాహనం ఒక టోల్ లేన్ నుంచి వెళ్లేలా జాగ్రత్తలు తీసుకుంటే టోల్‌గేట్స్ వద్ద రద్దీని నియంత్రించవచ్చని అన్నారు. కానీ వాటిని NHAI ఆచరణలో పెట్టలేదు. ఇక ఈ టోల్ కష్టాలు ఎప్పుడు తీరుతాయో చూడాలి..!