భూమ్మీద జన్మించిన ఏ జీవికైనా (మనిషితో సహా) తల, మొండెం ఉంటాయని తెలిసిందే. కాకపోతే కొన్ని ప్రత్యేకమైన జీవులకు ఇవి ఉండవు. అది వేరే విషయం. కానీ మెజారిటీ జీవాలకు తల, మొండెం ఉంటాయి. ఈ క్రమంలో మొండెం నుంచి తలను వేరు చేస్తే అప్పుడు ఆ జీవి బతికే అవకాశం ఉంటుందా ? కచ్చితంగా ఉండదు. కొంచెం అటో, ఇటో మొండెం నుంచి తల వేరు కాగానే ఆ జీవి చనిపోతుంది. అంతే కదా.. అయితే ఇప్పుడు మేం చెప్పబోతున్న ఆ కోడి మాత్రం అలా కాదు. ఓ వైపు తల తెగింది. అయినా వారం రోజుల పాటు బతికింది తెలుసా..!
అవును, మీరు విన్నది నిజమే. ఆ కోడికి తల తెగింది. అది ఎలా తెగిందో, లేదంటే ఎవరైనా కట్ చేశారో తెలియదు. కానీ ఆ కోడికి తలలేదు. అయినప్పటికీ ఆ కోడి వారం రోజుల పాటు బతికింది. ఈ ఘటన జరిగింది థాయ్‌లాండ్‌లో. తల తెగిన కోడి ఒకటి వీధుల్లో తిరుగుతుండడాన్ని కొందరు గుర్తించారు. దీంతో వారు షాకయ్యారు. ఆ కోడి ఓ వైపు తల తెగి రక్తం కారుతున్నా ఎలా బతికి ఉందో వారికి అర్థం కాలేదు. దీంతో వారు ఆ కోడిని హాస్పిటల్‌కు తరలించారు.
హాస్పిటల్లో వైద్యులు కోడికి యాంటీ బయోటిక్స్, ఇతర మందులు ఇచ్చారు. లోపలికి ఆహారం పంపించారు. దీంతో ఆ కోడి వారం రోజుల పాటు బతికింది. తరువాత చనిపోయింది. అలా తల తెగిన కోడి వారం పాటు బతికే సరికి ఈ వార్త కాస్తా వైరల్ అయింది. చాలా మంది ఈ కోడి ఫొటోను సోషల్ మీడియాలో షేర్ కూడా చేశారు. దీంతో ఈ వార్త నెట్లో చర్చనీయాంశమే అవుతోంది. అయితే నిజానికి ఇలా జరగడం మొదటి సారేమీ కాదట. గతంలో.. అంటే.. 1947లో అమెరికాలోని ఉతాహ్‌లో కూడా ఇలాగే తల తెగిన కోడి ఒకటి ఏకంగా 18 నెలల పాటు బతికింది. ఇప్పుడు ఈ కోడి వారం పాటు బతికింది. అవి అలా ఎలా బతికాయో ఇప్పటికైతే సైంటిస్టులకు కూడా అర్థం కాలేదు. కానీ.. ఏది ఏమైనా కోడి ఇలా తల తెగినా బతకడం అంటే నిజంగా షాకింగ్ విషయమే కదా.