ట‌ర్మ్ పాల‌సీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా..? అయితే ఈ అంశాల‌ను క‌చ్చితంగా గుర్తు పెట్టుకోండి..!

ఒక‌ప్పుడంటే కాదు గానీ… ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు ఇన్సూరెన్స్ పాల‌సీల ఆవ‌శ్య‌క‌త గురించి బాగా తెలుస్తోంది. అనుకోకుండా ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే అప్పుడు త‌న‌పై ఆధార ప‌డ్డ కుటుంబ స‌భ్యుల ప‌రిస్థితి ఎలా..? అనే ఆలోచ‌న పెరిగింది. అందుకే చాలా మంది ఇన్సూరెన్స్ పాల‌సీల‌ను తీసుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలోనే అనేక ఇన్సూరెన్స్ కంపెనీలు వివిధ ర‌కాల ఆఫ‌ర్ల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అనేక ర‌కాలైనా ట‌ర్మ్ పాల‌సీల‌ను అవి ఆఫ‌ర్ చేస్తున్నాయి. అయితే ఏ పాల‌సీ తీసుకునేట‌ప్పుడు అయినా, తీసుకున్న త‌రువాత అయినా మ‌నం ప‌రిశీలించాల్సిన‌, జాగ్ర‌త్త ప‌డాల్సిన అంశాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎంత బీమా అయితే బెట‌ర్‌..?
సాధార‌ణంగా ఏ మ‌నిషి ప్రాణానికైనా, జీవితానికైనా వెల‌క‌ట్ట‌డం అసాధ్య‌మైన ప‌ని. అది ఎవ‌రికీ సాధ్యం కాదు. మ‌ర‌లాంట‌ప్పుడు ఎవ‌రైనా ఒక వ్య‌క్తికి ఎంత బీమా అవస‌రం అవుతుంది..? అంటే ఇందుకు బీమా కంపెనీలు ప‌లు విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వేర్వేరు వ్య‌క్తుల‌కు వేర్వేరుగా బీమాను సూచిస్తాయి. అది ఎలా ఉంటుందంటే… ఒక వ్యక్తి తన వార్షిక ఆదాయానికి పన్నెండు రెట్లు కలిపి అందులోంచి అత‌ని పెట్టుబడుల విలువను తీసివేయగా వచ్చిన విలువకు సమానమైన బీమా రక్షణను కలిగి ఉండాలి. ఒకవేళ రుణాలు ఉంటే ఆ మేరకు విలువను పెంచుకోవాలి. దీంతో పాటు ఆ వ్య‌క్తి జీవన శైలి, ప్రస్తుత, భవిష్యత్తు అవసరాలు వంటి అంశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఒక వేళ ఆ వ్య‌క్తికి విహహం అయి ఉంటే అప్పుడు భార్య, పిల్లలు, వారి ప్రస్తుత, భవిష్యత్తు ఆర్థిక అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకుని వారికి అవ‌స‌రం అయ్యే బీమాను లెక్కించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎప్పుడైనా అనుకోని పరిస్థితుల్లో కుటుంబ యజమాని దూరమైతే అతని రుణాలు, క్రెడిట్ కార్డు బిల్లులు, ఇత‌ర అప్పులు వంటివి పాల‌సీదారు త‌ర్వాత కుటుంబ సభ్యులకు భారం కాకుండా చూసుకోవాలి. వీట‌న్నింట‌నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని బీమా తీసుకుంటే అప్పుడు చాలా మంచిది. దీంతో య‌జ‌మాని లేకున్న‌ప్ప‌టికీ కుటుంబ సభ్యుల‌పై భారం ప‌డ‌దు.

కాలపరిమితి కూడా ప్ర‌ధాన‌మే..!
ఎవ‌రైనా ఏ ట‌ర్మ్ పాల‌సీ తీసుకున్నా కాల ప‌రిమితిని కూడా దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్ తీసుకోవాలి. స‌హ‌జంగా ఏ వ్య‌క్తి అయినా అత‌ను సంపాదించే కాలం ముగిసే వరకు తప్పనిసరిగా బీమా ర‌క్ష‌ణ ఉండాలి. అందుకే బీమా ఎప్పటివరకు ఉండాలన్న ప్రశ్న వ‌చ్చినప్పుడు రిటైర్మెంట్ వరకు అనే సమాధానం వస్తుంది. అంటే రిటైర్మెంట్ వయస్సు లోంచి ప్రస్తుత వయస్సును తీసివేయగా వచ్చే కాలానికి బీమా పాలసీ తీసుకోవాలి. ఉదాహరణకు 60 ఏళ్లు రిటైర్మెంట్ వయస్సు అనుకుంటే 35 ఏళ్ల వ్యక్తి కనీసం 25 సంవత్సరాలకు (60-35=25) టర్మ్ పాలసీ తీసుకుంటే బెట‌ర్‌. ప్ర‌స్తుతం లైఫ్ లాంగ్ క‌వ‌రేజీ ఉండే(హోల్ లైఫ్‌) పాల‌సీలు కూడా మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. కాబ‌ట్టి అవ‌స‌రం అనుకుంటే హోల్ లైఫ్ పాల‌సీల‌ను కూడా ఎంచుకోవ‌చ్చు. వీటితో ఇంకా ఎక్కువ ర‌క్ష‌ణ ఉంటుంది.

క్లెయిం రికార్డుల‌ను ప‌రిశీలించాలి..!
చాలా మ‌టుకు బీమా కంపెనీలు త‌మ క్లెయిం రికార్డుల‌ను వినియోగ‌దారుల‌కు చూపించ‌వు. అలా చూపించ‌కుండానే ఇన్సూరెన్స్‌ల‌ను ఇస్తాయి. అయితే తీరా ఇన్సూరెన్స్ క్లెయిం చేసుకుందామ‌ని వెళితే కొన్ని కంపెనీలు ముప్పు తిప్ప‌లు పెడ‌తాయి. క‌నుక ఎవ‌రైనా ఇన్సూరెన్స్ పాల‌సీ తీసుకునే ముందు ఆ కంపెనీ క్లెయిం రికార్డుల‌ను ప‌రిశీలించాలి. దీంతో మ‌న‌కు వాటిపై ఒక అవ‌గాహ‌న వ‌స్తుంది. స‌ద‌రు కంపెనీ క్లెయింల‌ను సుల‌భంగా పరిష్క‌రిస్తుందా..? లేదా..? అన్న‌ది రూఢి చేసుకున్నాకే పాల‌సీ వేయాలి. లేదంటే క్లెయిం చేసుకోవాల్సి వ‌చ్చిన‌ప్పుడు ఇబ్బందులు ఎదుర‌వుతాయి. అయితే ఏ బీమా కంపెనీకి చెందిన క్లెయిం రికార్డుల‌ను అయినా ఇంటర్నెట్‌లో మ‌నం సుల‌భంగా వెత‌క‌వ‌చ్చు. ఆ స‌మాచారం మ‌న‌కు ఇట్టే దొరుకుతుంది.

రైడర్ల‌పై క‌న్నేయాలి..!
చాలా వ‌ర‌కు బీమా కంపెనీలు ఇప్పుడు కొంత అద‌న‌పు ప్రీమియం చెల్లిస్తే ఉన్న పాల‌సీకే అద‌నపు సౌక‌ర్యాల‌ను అందిస్తున్నాయి. క‌నుక ఇలాంటి రైడ‌ర్ల‌పై కూడా క‌న్నేసి ఉంచాలి. వాటిని అవ‌స‌రం అయితే తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల కొత్త పాల‌సీ తీసుకోవాల్సిన ప‌ని ఉండ‌దు. స‌హ‌జంగా కొత్త పాల‌సీకే ఎక్కువ ఖ‌ర్చు అవుతుంది, ఇలాంటి రైడ‌ర్ల‌కు త‌క్కువ అవుతుంది. క‌నుక వీటిపై కూడా క‌న్నేసి ఉంచితే మంచి ఆఫ‌ర్ ఉన్న‌ప్పుడు అద‌నపు ప్రీమియం చెల్లించి అద‌న‌పు సౌక‌ర్యాల‌ను పొంద‌వ‌చ్చు. దీంతో కొత్త పాల‌సీ వేయాల్సిన అవ‌స‌రం రాదు.

డిస్కౌంట్లు అంత ముఖ్యం కాదు…
ప్ర‌స్తుతం చాలా వ‌ర‌కు బీమా కంపెనీలు తాము అంద‌జేస్తున్న పాల‌సీల‌పై డిస్కౌంట్ల‌ను కూడా అందిస్తున్నాయి. అవి ఎలా ఇస్తాయంటే… ఉదాహ‌ర‌ణ‌కు మీకు పొగ‌తాగే అల‌వాటు లేద‌నుకోండి, ప్రీమియంలో కొంత డిస్కౌంట్ ఉంటుంది. అలాగే మ‌హిళ‌ల‌కు ప్ర‌త్యేక రాయితీలు ఉంటాయి. అయితే వీటిని చూసి పాల‌సీలు తీసుకోవ‌ద్దు. ఎందుకంటే బీమా వ‌ల్ల వ‌చ్చే స‌దుపాయాల‌ను మాత్ర‌మే ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే అప్పుడు దాని వ‌ల్ల మ‌న‌కు పూర్తి ర‌క్ష‌ణ ఉంటుంది. బీమా చేసిన ప్ర‌యోజ‌నం ద‌క్కుతుంది.

అన్ని వివరాల‌ను ఇవ్వాలి..!
పాలసీల‌ను తీసుకునే వారు క‌చ్చితంగా రూల్స్ పాటించాలి. బీమా కంపెనీలు కోరిన పూర్తి స‌మాచారాన్ని త‌ప్పులు లేకుండా ఇవ్వాలి. ఏ వివ‌రాల‌ను అడిగినా దాచి పెట్ట‌వ‌ద్దు. అన్ని వివ‌రాల‌ను ఇవ్వాలి. దీంతో ఎప్పుడైనా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే ఇబ్బందులు ఎదురు కాకుండా ఉంటాయి. లేదంటే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు.

వైద్య పరీక్షలు…
బీమా కంపెనీలు కోరితే ఇన్సూరెన్స్ చేయించుకునే వారు వైద్య ప‌రీక్ష‌లు కూడా చేయించుకోవ‌డం బెట‌ర్‌. లేదంటే ఆ త‌రువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ఆరోగ్యం విష‌యంలో ఏ వివ‌రాల‌ను కూడా బీమా కంపెనీల వ‌ద్ద దాచి పెట్ట‌రాదు. అన్ని వివ‌రాల‌ను ఇవ్వాల్సిందే. భ‌విష్యత్తులో క్లెయిం ప్ర‌క్రియ సుల‌భ‌త‌రం కావాలంటే తప్ప‌నిస‌రిగా ఆరోగ్యం వివ‌రాల‌ను ఇవ్వాలి. ఒక వేళ స్థూలకాయం వంటి చిన్న ఆరోగ్యపరమైన అంశాలు వైద్య పరీక్షల్లో బయటపడితే అధిక ప్రీమియం చెల్లించడమే మంచిది. కొన్నింటికి మొద‌టి రెండేళ్లు వెయిటింగ్ పీరియ‌డ్ ఉంటుంది. వైద్య ప‌రీక్ష‌ల ద్వారా అంతిమంగా పాల‌సీదారుల‌కే ప్ర‌యోజ‌నం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఈ విష‌యంలో అస్స‌లు నిర్ల‌క్ష్యం చేయ‌రాదు.

ద్రవ్యోల్బణం…
మ‌న దేశంలో ఏ వ‌స్తువుకైనా ఒక‌ప్పుడు ఉన్న ధ‌ర‌లు ఇప్పుడు లేవు. పెరుగుతూనే ఉన్నాయి. అందుకు కార‌ణం ద్ర‌వ్యోల్బ‌ణం. కాబ‌ట్టి బీమా విష‌యంలోనూ దీన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల్సి ఉంటుంది. పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణానికి అనుగుణంగా క‌నీసం 5 సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి అయినా బీమా ర‌క్ష‌ణ మొత్తాన్ని 5 నుంచి 10 శాతం మేర పెంచుకోవాలి. అంటే అందుకు అనుగుణంగా ప్రీమియం ఎక్కువ చెల్లిస్తే బెట‌ర్‌. ఉదాహ‌ర‌ణ‌కు ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును మీరు రూ.10 లక్షలు పెట్టి కొన్నారనుకుంటే ఏటా సగటున 8 శాతం ద్రవ్యోల్బణ రేటు ఉంద‌నుకుంటే ఇదే వస్తువును 2032లో కొనడానికి రూ.45 లక్షల వ‌ర‌కు ఖర్చు చేయాల్సి ఉంటుంది. క‌నుక‌ ద్రవ్యోల్బణ సమస్యను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ముందు చెప్పిన‌ట్టుగా బీమా ర‌క్ష‌ణ‌ను 5 ఏళ్ల‌కు ఒక‌సారి పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తే మంచిది.

Comments

comments

Share this post

scroll to top