ఆగ‌ని అరెస్టులు ..ఆందోళ‌న‌లు – ఇంట‌ర్ బోర్డు దగ్గర ప‌రిస్థితి ఉద్రిక్తం

ఇంట‌ర్ బోర్డు నిర్వాకానికి ..ప్ర‌భుత్వ బాధ్య‌తా రాహిత్యానికి మ‌రో విద్యా కుసుమం రాలి పోయింది. ఎంతో క‌ష్ట‌ప‌డి చదివిన విద్యార్థులు వారి త‌ల్లిదండ్రులు నాలుగో రోజు ఆందోళ‌న బాట ప‌ట్టారు. మ‌రికొంద‌రు రోడ్డుపై ఆందోళ‌ణ చేప‌ట్టారు. వారికి మ‌ద్ధ‌తుగా ప‌లు విద్యార్థి సంఘాల‌తో పాటు వివిధ పార్టీలన నేత‌లు మ‌ద్ధ‌తు ప్ర‌క‌టించారు. అస‌లు దోషులెవ‌రో ఇంత‌వ‌ర‌కు తేల్చ‌లేద‌ని, ఇంత మంది చ‌నిపోయినా క‌నీసం సీఎం కేసీఆర్ స్పందించ‌లేద‌ని బాధితులు వాపోయారు. అధికారులు క‌నీసం స్పందించ‌డం లేద‌ని , స‌రైన స‌మాధానం చెప్ప‌డం లేద‌ని ఆరోపించారు. తాము మార్కులు కోల్పోయి ఇబ్బందులు ప‌డుతుంటే..రీ కౌంటింగ్ కు, రీవాల్యూయేష‌న్ కు డ‌బ్బులు ఎందుకు క‌ట్టాల‌ని ప్ర‌శ్నించారు. బిడ్డ‌ల‌ను కోల్పోయిన పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వం తిరిగి తీసుకు వ‌స్తుందా అని నిల‌దీశారు. పోలీసులు త‌మ‌ను ఈడ్చుకు వెళుతున్నార‌ని, అరెస్టులు చేస్తున్నా ఏ ఒక్క‌రు ఇటు వైపు క‌న్నెత్తి చూడ‌డం లేద‌న్నారు.

విద్యా శాఖ మంత్రి త‌క్ష‌ణ‌మే దీనికి బాధ్య‌త వ‌హిస్తూ రాజీనామా చేయాల‌ని, అవ‌క‌త‌వ‌క‌ల‌కు, పొర‌పాట్ల‌కు కార‌ణ‌మైన ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్ ను వెంట‌నే స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేశారు. ఇంట‌ర్ బోర్డు తీరును నిర‌సిస్తూ ప్ర‌గ‌తి భ‌వ‌న్ ముట్ట‌డికి ఎస్ఎఫ్ఐ ఆధ్వ‌ర్యంలో విద్యార్థులు ముట్ట‌డించే ప్ర‌య‌త్నం చేశారు. దీంతో ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ద్ద భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఆందోళ‌న‌కారుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్క‌డ ప‌రిస్థితి పూర్తిగా ఉద్రిక్తంగా మారింది. మ‌రో వైపు డివైఎఫ్ఐ విద్యార్థి సంఘంతో పాటు గ్లోబ‌రిన్ టెక్నాల‌జీ సంస్థ ముట్ట‌డికి సిపిఐ పిలుపునిచ్చింది. పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డేందుకు కార‌ణ‌మైన ఈ సంస్థ పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని నేత‌లు కోరారు. సీఎంకు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులు, త‌ల్లిదండ్రుల‌కు సంఘీభావంగా అన్ని జిల్లా కార్యాల‌యాల ఎదుట ధ‌ర్నా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది.

ఏబీవీపీ ఆధ్వ‌ర్యంలో వీరికి మ‌ద్ధ‌తు ప‌లికారు. డిసిసి అధ్య‌క్షుల ఆధ్వ‌ర్యంలో అన్ని క‌లెక్ట‌రేట్‌ల వ‌ద్ద నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని పీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇదిలా ఉండ‌గా వివాదాల‌కు కేంద్ర బిందువుగా మారిన గ్లోబ‌రిన్ సంస్థ‌పై త్రిస‌భ్య క‌మిటీ విచార‌ణ కొన‌సాగుతోంది. ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్, గ్లోబ‌రీస్ టెక్నాల‌జిస్ సిఇఓ రాజుతో పాటు ఫ‌లితాల ప్ర‌క్రియ‌లో ప్ర‌మేయం వున్న వారంద‌రిని ప్ర‌శ్నించింది. గ‌డువు లోగా నివేదిక స‌మ‌ర్పిస్తామ‌ని క‌మిటీ ఛైర్మ‌న్ వెల్ల‌డించారు. ఇంత జ‌రిగినా ఆందోళ‌న‌లు త‌గ్గ‌డం లేదు. పేరెంట్స్, స్టూడెంట్స్ త‌మ‌కు న్యాయం జ‌రిగేంత దాకా ఇక్క‌డి నుంచి వెళ్ల‌మ‌ని అంటున్నారు. పోలీసుల తీరుపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది. త‌మ పిల్ల‌లు చ‌నిపోతే ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తారా అంటూ పేరెంట్స్ ప్ర‌శ్నించారు.

Comments

comments

Share this post

scroll to top