హామీలు కోకొల్ల‌లు – ఆక‌ట్టుకోని మేనిఫెస్టోలు

ఎలాగైనా స‌రే ప‌వ‌ర్‌లోకి రావాల‌నే ఉద్ధేశంతో తెలంగాణ‌లో అన్ని పార్టీలు జ‌నం జ‌పం చేస్తున్నాయి. కుప్ప‌లు తెప్ప‌లుగా హామీలు గుప్పిస్తున్నాయి. ఆయా పార్టీలు ఇస్తున్న హామీలు అమ‌లు కావాలంటే కోట్లాది రూపాయ‌లు కావాల్సి ఉంటుంది. అర‌చేతుల్లో స్వ‌ర్గం చూపిస్తున్నాయి. ఓట్ల‌ను దండుకునేందుకు ప్లాన్లు ఇప్ప‌టికే సిద్ధం చేశాయి. ఎలాగైనా స‌రే కోట్లు కుమ్మ‌రించేందుకు రెడీ అవుతున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ మ‌రోసారి నీళ్లు ..నిధులు..నియామ‌కాలంటూ ముందుకు వ‌స్తోంది. మిష‌న్ భ‌గీర‌థ ..కాక‌తీయ పేరుతో చేప‌ట్టిన ప్రాజెక్టులు పూర్త‌య్యే ద‌శ‌లో ఉన్నాయ‌ని చెబుతోంది. క‌ళ్యాణ‌ల‌క్ష్మి, కేసీఆర్ కిట్‌, షాదీ ముబార‌క్‌, ఫీజు రీ అంబ‌ర్స్ మెంట్‌, రైతు బంధు, ఆస‌రా , త‌దిత‌ర ప‌థ‌కాల‌ను ఊద‌ర‌గొడుతోంది. నిరుద్యోగుల‌కు నిరుద్యోగ భృతిని ప్ర‌క‌టించ‌డం విస్మ‌యానికి గురి చేసింది.

నాలుగున్న‌ర ఏళ్ల పాటు అధికారంలో ఉన్న గులాబీ దళం నిరుద్యోగుల‌ను నానా ర‌కాలుగా వేధింపుల‌పాలు చేసింది. అక్ర‌మ కేసులు బ‌నాయించింది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ల‌క్ష ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని అసెంబ్లీ సాక్షిగా ప్ర‌క‌టించిన ఆ పార్టీ అధినేత కేసీఆర్ ..మాట మార్చారు. తాను అన‌లేద‌న్నారు. వేలాది పోస్టులు ఇప్ప‌టికే నింపామ‌ని..ఇంకా భ‌ర్తీ చేస్తామంటూ న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు. తెలంగాణ వ‌స్తే త‌మ బ‌తుకులు బాగుప‌డ‌తాయ‌ని ఆశించిన వారిని కోలుకోలేకుండా చేశారు. కేవ‌లం 32 వేలు మాత్రమే భ‌ర్తీ చేసి చేతులెత్తేశారు. భ‌ర్తీ చేసిన వాటిలో పోలీసులు, హోం గార్డులే ఎక్కువ‌. చాలా ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు ఇచ్చినా అవి మ‌ధ్య‌లోనే ఆగి పోయాయి. లెక్క‌లేన‌న్ని కేసులు వాటి మీద‌. అయినా ఈ ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించేందుకు చొర‌వ చూప‌లేదు. నిరుద్యోగుల ప‌ట్ల క‌క్ష పూరిత‌మైన ధోర‌ణిని అవ‌లంభించింది. దీంతో నిరుద్యోగులు ల‌క్ష‌లాది మంది ఈ స‌ర్కార్ ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కులాల వారీగా చీల్చుకుంటూ నిధుల‌పేరుతో మోసం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

అటు ఉద్యోగుల్లో కానీ..ఇటు ప్ర‌జా ప్ర‌తినిధుల్లో కానీ జ‌వాబుదారీ త‌నం లేకుండా పోయింది. ఫ‌క్తు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులుగా అవ‌తారం ఎత్తార‌న్న విమ‌ర్శ‌లున్నాయి. ఐటీ హ‌బ్ ద్వారా వంద‌లాది కంపెనీలు వ‌చ్చాయ‌ని..వేలాది మందికి ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్కాయ‌ని స‌ర్కార్ ప్ర‌క‌టించింది. కానీ వాస్త‌వంగా చూస్తే ఇక్క‌డి వారికి ఎండ‌మావే మిగిలింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏయే ఐటీ కంపెనీలు ..తెలంగాణ విద్యార్థుల‌కు ఇచ్చార‌న్న దానిపై స్ప‌ష్ట‌మైన స‌మాధానం లేదు. ప్ర‌చారంలో ఉన్నంత స్పీడ్‌..కొలువుల భ‌ర్తీ విష‌యంలో లేకుండా పోయింది. ఉద్యోగాలు ఇవ్వ‌లేమ‌ని..ప్ర‌త్యామ్నాయ మార్గాలు చూసుకోవాల‌ని..స‌ర్కార్ అన్నీ ఇవ్వ‌లేద‌న్న విష‌యాన్ని గుర్తించాల‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. స‌క‌ల జ‌నుల స‌మ్మెలో కీల‌క భూమిక పోషించిన ఆర్టీసీని ప్రైవేట్ ప‌రం చేస్తాన‌ని హెచ్చ‌రించారు. దీంతో సంస్థ‌నే న‌మ్ముకున్న వేలాది మంది ఉద్యోగులు మ‌రింత అభ‌ద్ర‌త‌కు లోన‌య్యారు. ఉచిత క‌రెంట్‌, రైతుబంధు ప‌థ‌క‌మే త‌మ‌ను ర‌క్షిస్తాయ‌ని..ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేలా చేస్తాయ‌ని టీ ఆర్ ఎస్ భావిస్తోంది.

Telangana election partys

ఎన్న‌డూ లేని విధంగా ఈసారి టికెట్ల కేటాయింపు ద‌గ్గ‌రి నుండి ఇత‌ర పార్టీల‌ను క‌లుపు కోవ‌డం వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ
ఆచి తూచి వ్య‌వ‌హ‌రించింద‌నే చెప్పాలి. ముఖ్యంగా మేనిఫెస్టో త‌యారీపై ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ, మైనార్టీల జ‌పం చేసింది. రిటైర్ మెంట్ వ‌య‌సు పెంచింది. రైతుల‌కు 2 ల‌క్ష‌ల రుణ మాఫీ ప్ర‌క‌టించింది. పేద‌ల‌కు ఆరు సిలిండ‌ర్లు ఇస్తామ‌ని పేర్కొంది. ప్లాటు స్వంతంగా ఉంటే ఇల్లు క‌ట్టుకునేందుకు నేరుగా 5 ల‌క్ష‌లు వారి బ్యాంకు ఖాతాల్లో జ‌మ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ప్ర‌తి నెలా నిరుద్యోగుల‌కు 3 వేల రూపాయ‌ల భృతి ఇస్టామ‌ని తెలిపింది. అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ల‌క్ష ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ఇస్తామ‌ని..పాత ప‌ద్ధ‌తిలోనే డీఎస్‌సీ నిర్వ‌హిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. అధికార పార్టీ కంటే సామాజిక స‌మ న్యాయం కాంగ్రెస్ పాటించింద‌నే చెప్పాలి.

బీసీల‌కు వెన్నుద‌న్నుగా ఉంటూ వ‌చ్చిన తెలుగుదేశం పార్టీ త‌న మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, ఎల్‌. ర‌మ‌ణ‌, త‌దిత‌రులు ప్ర‌క‌టించారు. తెలంగాణ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను ప్ర‌జా ఆస్ప‌త్రిగా మారుస్తామ‌ని, నిరుద్యోగుల‌కు అండ‌గా ఉంటామ‌ని, స‌క‌ల జ‌నుల సంక్షేమానికి పెద్ద‌పీట వేస్తామ‌ని..ఖాళీగా ఉన్న కొలువుల‌ను త‌క్ష‌ణ‌మే భ‌ర్తీత చేస్తామ‌ని వెల్ల‌డించింది. ధ‌ర్నా చౌక్‌ను పున‌రుద్ధ‌రిస్తామ‌ని, అమ‌ర వీరుల‌ను గౌర‌విస్తామ‌ని, వారి కుటుంబాల్లో ఒక‌రికి ఉద్యోగం, ఇల్లు ఇస్తామ‌ని తెలిపింది. మ‌హాకూట‌మికి ఛైర్మ‌న్‌గా ఉన్న కోదండ‌రాం ఆధ్వ‌ర్యంలోని టీజేఎస్ మేనిఫెస్టో అంత‌గా ఆక‌ట్టుకోలేదు. కాంగ్రెస్‌, టీడీపీ భారీగానే క‌స‌ర‌త్తు చేశాయి. ఇక అన్ని పార్టీల మేనిఫెస్టోల‌ను ప‌రిశీలిస్తే అంతిమంగా ప్ర‌జ‌ల ఆశ‌ల‌ను రేకెత్తించేలా ఉన్నాయి. ఆచ‌ర‌ణాత్మ‌కంగా లేవ‌నే చెప్పాలి. సంక్షేమ ప‌థ‌కాల‌పైనే దృష్టి సారించ‌డం వ‌ల్ల లోటు బ‌డ్జెట్ ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంది. ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేందుకు ఇంకా కొంత స‌మ‌య‌మే మిగిలి ఉంది..మ‌రి ఓట‌ర్లు ఏ మేర‌కు ..ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారో..ఏ మేనిఫెస్టోను అక్కున చేర్చుకుంటారో త్వ‌ర‌లో తేల‌నుంది. అంత దాకా వేచి చూడ‌ట‌మే మిగిలింది.

Comments

comments

Share this post

scroll to top