మన దేశంలో ప్రభుత్వ హాస్పటల్స్‌లో పేదలకు అందుతున్న సదుపాయాలు రోజు రోజుకీ తీసికట్టు నాగంబొట్టు అన్న చందంగా మారుతున్నాయి. వైద్యులు ఆస్పత్రులకు సకాలంలో రాకపోవడం ఒకెత్తయితే, హాస్పిటల్స్ పరిసరాల్లో ఉండే అపరిశుభ్ర వాతావరణం, నిర్లక్ష్యంగా ఉంటూ లంచం చేతిలో పడితే గానీ పనిచేయని సిబ్బందితో జనాలు అనేక అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రభుత్వ హాస్పిటల్స్‌కు వెళితే వైద్యం సరిగ్గా లభించదని, ప్రాణాలు పోతాయని చెప్పి డబ్బు ఎక్కువైనా చాలా మంది ప్రైవేటు హాస్పిటల్స్‌లోనే చికిత్స చేయించుకుంటున్నారు. అయితే ప్రభుత్వ హాస్పిటల్స్ నిర్లక్ష్యానికి అద్దం పట్టే మరో అమానుష సంఘటన తాజాగా జరిగింది.
ఉత్తర ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో విద్యార్థులతో వెళ్తున్న ఓ పాఠశాల బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సులో హెల్పర్‌గా పని చేస్తున్న ఘన్ శ్యామ్(25) అనే వ్యక్తితోపాటు అందులో ప్రయాణిస్తున్న 25 మంది విద్యార్థులకు తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అందరినీ చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న ఝాన్సీ మెడికల్ కాలేజీకి తరలించారు. అయితే ఘన్శ్యామ్కు ప్రమాదంలో ఎడమ కాలు పూర్తిగా కట్ అయింది. దీంతో ఆ కాలును తీసుకుని అతన్ని ఐసీయూలో చేర్చారు.
ఐసీయూలో ఉన్న ఘన్ శ్యామ్ పాలిట ఆ హాస్పిటల్ వైద్యులు పూర్తిగా నిర్లక్ష్యంగా, అమానుషంగా ప్రవర్తించారు. తెగిపోయిన అతని కాలునే అతని తల కింద దిండుగా అమర్చారు. దీన్ని చూసిన ఘన్ శ్యామ్ ఆస్పత్రి వైద్యులకు పలుమార్లు చెప్పాడు. అయినా వారు పట్టించుకోలేదు. దీంతో అతను ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి సిబ్బంది, వైద్యులతో వాగ్వివాదానికి దిగాడు. ఆ సమయంలో ఘన్ శ్యామ్‌ను ఎవరో వీడియో తీసి నెట్లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ కాగా అక్కడి వైద్యశాఖ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని ఘటనకు కారణమైన ఇద్దరు వైద్యులను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఏది ఏమైనా మన దేశంలో పేదలకు అందుతున్న వైద్య సదుపాయాలు మాత్రం ఇంకా మారలేదనే చెప్పవచ్చు. ఇందుకు నాయకులు సిగ్గు పడాల్సిందే. వారికి ఓట్లు వేసి గెలిపిస్తున్నందుకు మనం చింతించాల్సిందే.