ఒక్క విద్యార్థికి పాఠాలు చెప్ప‌డం కోసం ఆ టీచ‌ర్ రోజూ 50 కిలోమీట‌ర్లు వెళ్తున్నాడు తెలుసా..?

మ‌న దేశంలో ప్ర‌భుత్వ పాఠ‌శాలల్లో విద్యార్థుల‌కు ఎలాంటి స‌దుపాయాలు అందుతాయో అంద‌రికీ తెలిసిందే. శిథిలావ‌స్థ‌లో ఉండే త‌ర‌గ‌తి గ‌దులు, తాగునీటి కొర‌త‌, మ‌రుగుదొడ్ల లేమి, ఉపాధ్యాయులు త‌గినంత మంది లేక‌పోవ‌డం, ఉన్నా స‌మ‌యానికి రాక‌పోవ‌డం, పాఠాలు సరిగ్గా చెప్ప‌క‌పోవ‌డం.. ఇలా చెబుతూ పోతే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల‌కు ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల లిస్ట్ చాంతాడంత అవుతుంది. అయితే ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఆ ప్ర‌భుత్వ స్కూల్ అయితే మ‌రీ దారుణం. అందులో చ‌దువుకునేది కేవ‌లం ఒక్క విద్యార్థి మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ ఆ స్కూల్ స్కూల్‌లా ఉండ‌దు. చిన్న పాక‌లా ఉంటుంది. ఇక ఆ స్కూల్‌కు వ‌చ్చే ఉపాధ్యాయుడు కూడా ఒక్క‌డే. అత‌ను అక్క‌డికి రావ‌డానికి నిత్యం ర‌హ‌దారిపై స‌ర్క‌స్ ఫీట్లు చేయాల్సి ఉంటుంది.

అది మహారాష్ట్రలోని భోర్‌కు దగ్గర్లో ఉన్న చందార్ అనే గ్రామం. పూణెకు 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలోనే ఉంటుంది. ఆ ఊర్లో ఉండేది 15 గుడిసెలే. అంటే ఓ 60 మంది మాత్రమే ఉంటారు. ఎటువంటి సదుపాయాలు లేని ఓ కుగ్రామం అది. ఆ ప్రాంతంలో పాముల బెడద ఎక్కువ. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ తిరుగుతూనే ఉంటాయి. ఇక ఆ ఊర్లో ఓ స్కూల్ కూడా ఉంది. కానీ అందులో చ‌దువుకునేది మాత్రం ఒక్క‌డే విద్యార్థి. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. గత 2 సంవత్స‌రాల నుంచి అందులో యువ్‌రాజ్ సంగాలే (8) అనే బాలుడు ఒక్క‌డే చ‌దువుకుంటున్నాడు. ఇక ఆ విద్యార్థికి పాఠాలు చెప్పడానికి రంజినికాంత్ అనే టీచర్ రోజూ ఏకంగా 50 కిలోమీటర్లు ప్రయాణం చేస్తాడు. ఇక అత‌ను ప్ర‌యాణం చేసే రోడ్డు చాలా వ‌ర‌కు స‌రిగ్గా ఉండ‌దు. 12 కిలోమీట‌ర్ల పాటు మ‌ట్టి ఉంటుంది. ఎగుడు దిగుడుగా కూడా ఉంటుంది. దీనికి తోడు వ‌ర్షాక‌ల‌మైతే రంజినికాంత్ ఆ రోడ్డులో ప్రయాణించాలంటే చాలా అవ‌స్థ ప‌డాల్సి వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ అత‌ను ఇబ్బంది అనుకోకుండా రోజూ 50 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తూ ఆ విద్యార్థి ఒక్క‌డికే పాఠాలు చెబుతున్నాడు.

గ‌తంలో ఆ స్కూల్‌లో 11 మంది పిల్ల‌లు ఉండేవారు. కానీ ఇంట్లో వారి ఆర్థిక ప‌రిస్థితులు బాగా లేనందున వారిని వారి త‌ల్లిదండ్రులు ప‌నుల్లో పెట్టారు. దీంతో వారు స్కూల్ మానేయాల్సి వ‌చ్చింది. అలా ఒక్కొక్క‌రు స్కూల్ మానేయడంతో చివ‌ర‌కు యువ్‌రాజ్ సంగాలే మాత్రం మిగిలాడు. అత‌నొక్క‌డే ఇప్పుడా స్కూల్‌లో విద్యార్థిగా ఉన్నాడు. అత‌ను కూడా అప్పుడ‌ప్పుడు డుమ్మా కొడుతుంటాడు. దీంతో స్కూల్‌కు వ‌చ్చి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ని టీచ‌ర్ రంజినికాంత్ చెబుతున్నాడు. 1985 లో ఈ స్కూల్‌ను నిర్మించ‌గా కొన్నేండ్ల వరకు ఈ స్కూల్‌కు పైకప్పే లేదు. మొన్నీ మ‌ధ్యే పైకప్పు నిర్మించారు. కొన్నిసార్లు స్కూల్ పైకప్పు నుంచి త‌ర‌గ‌తి గ‌దిలో ఉన్న టీచ‌ర్ రంజినికాంత్‌పై పాములు ప‌డుతుంటాయి. అయినా తప్ప‌దు కదా. క‌నుక క‌త్తి మీద సాము అయినా స‌రే పాఠాల‌ను మాత్రం చెబుతున్నాడు. ఇక ఆ ప్రాంతానికి చెందిన ఎంపీ సుప్రియా సులే అసలు ఆ గ్రామానికి వచ్చిందే లేదట. మ‌రి ప్రభుత్వ అధికారులంటారా? ఎప్పుడో పోలియో చుక్కలు వేసినప్పుడు వచ్చారట. మళ్లీ అటువంటివే ఏవైనా ఉంటే వస్తార‌ట‌. లేదంటే లేదు. ఇక ఆ గ్రామాన్ని ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. ఇదీ.. ఆ స్కూల్ దుస్థితి. ఇలాంటి స్కూల్స్ మ‌న దేశంలో ఇంకా ఎన్ని ఉన్నాయో క‌దా. కానీ మ‌న నాయ‌కులు మాత్రం ఎప్పుడు చూసినా ఒక పార్టీ వారు మ‌రొక పార్టీ వారిని తిట్టుకోవ‌డ‌మే స‌రిపోయింది. ఇక వారికి ప్ర‌జా స‌మ‌స్య‌లు ఏం తెలుస్తాయి చెప్పండి. అంతా మ‌న ఖ‌ర్మ కాక‌పోతే..!

Comments

comments

Share this post

scroll to top