వాహ్.. నిజంగా గురువు అంటే అతను. అసలు గురు శిష్యుల అనుబంధానికి నిజంగా అద్దం పడుతుంది ఈ ఘటన. జరిగింది మహారాష్ట్రలో. రెక్కాడితే గానీ డొక్కాడని పేద కుటుంబంలో ఉన్న విద్యార్థి అతను. ఓ వైపు పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మరో వైపు దోశ స్టాల్ నడిపే తండ్రి మంచాన పడ్డాడు. దీంతో స్టాల్ను నిర్వహించే వారు లేక బాధ్యత ఆ విద్యార్థిపై పడింది. అతని కష్టాన్ని చూసి చలించిపోయిన అతని గురువు అతను చేసే పని తాను చేశాడు. తన విద్యార్థి చేసే పనిని తాను చేసి అతనికి చదువుకునేందుకు సమయం లభించేలా చేశాడు. దీంతో ఆ విద్యార్థి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్లో పాసయ్యాడు.
అతని పేరు అవేజ్ షేక్. ఉంటున్నది మహారాష్ట్రలోని సోమ్వార్పేట్లో. అతని తండ్రికి దోశ స్టాల్ ఉంది. అందులో దోశలను వేస్తూ తద్వారా వచ్చే డబ్బుతో అవేజ్ను, అతని తమ్ముడు హుజేఫాను చదివిస్తున్నాడు. అయితే ఈ మధ్యే అవేజ్ 10వ తరగతి పరీక్షలు రాశాడు. కాగా సరిగ్గా రేపైతే గణిత పరీక్ష జరుగుతుందనగా అవేజ్ తండ్రికి అనారోగ్యం కలిగింది. దీంతో అతను స్టాల్ మూత పెట్టాల్సి వచ్చింది. అసలే రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. స్టాల్ మూతపెడితే పూటగడవదు. దీంతో తండ్రి పనిని భుజాన వేసుకున్నారు అవేజ్, హుజేఫాలు. ఆ రోజు సాయంత్రం 5.30 అవుతుంది. మరుసటి రోజే అవేజ్కు గణిత పరీక్ష ఉంది. అందులో మార్కులు సంపాదించడం ఎంత కష్టమో అవేజ్కు తెలుసు. అందుకు బాగా చదవాలి. తీరా చూస్తే దోశ స్టాల్లో పనిచేయాల్సి వచ్చింది. దీంతో ఏం చేయాలో అవేజ్కు తెలియలేదు. వెంటనే తన గురువైన సత్యం మిశ్రాకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
సత్యం మిశ్రా ఆ దోశ స్టాల్కు చేరుకుని పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అతను ఓ నిర్ణయానికి వచ్చాడు. అవేజ్కు బదులుగా ఆ స్టాల్లో అతను పనిచేస్తానని చెప్పి పని ప్రారంభించాడు. దీంతో అవేజ్కు చదువుకునేందుకు సమయం లభించింది. అలా సత్యం మిశ్రా ఆ రోజు సాయంత్రం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు ఆ స్టాల్లో పనిచేశాడు. కస్టమర్లకు దోశలు సైప్లె చేశాడు. ప్లేట్లు కూడా కడిగాడు. కాగా అవేజ్ విజయవంతంగా గణిత పరీక్ష రాశాడు. అందులో అతనికి 100కు 87 మార్కులు వచ్చాయి. నిజానికి మహారాష్ట్ర ఎస్ఎస్సీ పరీక్షలో 85 మార్కులు దాటితే చాలా గొప్ప విషయం. ఎందుకంటే అన్ని సబ్జెక్టుల్లోనూ 85 మార్కులు దాటిన విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం రూ.50వేల నగదు బహుమతి ఇస్తుంది. ఈ క్రమంలో అవేజ్ కూడా అన్ని పరీక్షల్లోనూ 85కు పైగా మార్కులు తెచ్చుకోవడంతో అతనికి కూడా రూ.50వేల బహుమతి వచ్చింది. అతనికి బహుమతి వెనుక అతని కృషే కాదు, అతని గురువు సత్యం మిశ్రా కృషి కూడా ఉంది. నిజంగా వీరిద్దరిదీ చాలా గొప్ప అనుబంధం కదా..! హ్యాట్సాఫ్ టు సత్యం మిశ్రా..!