తమిళనాడులో “బాహుబలి – 2 ” మొదటి షోలు రద్దు అయ్యాయి తెలుసా..? అసలు కారణం ఇదే..!

ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి గర్జన మొదలైపోయింది! గురువారం అర్ధరాత్రి నుంచే థియేటర్లలో బాహుబలి ప్రతిధ్వనులు మిన్నంటిపోయాయి! విజువల్ గ్రాండియర్‌కు పట్టాభిషేకం కడుతూ రివ్యూలూ వచ్చేశాయి! కానీ, ఓ చోట మాత్రం ఆ భారీ సినిమా చడీ..చప్పుడు లేదు! అనుకున్న టైంకు పడాల్సిన ప్రీమియర్‌లు పడలేదు! సినిమాను చూసేసి చిక్కువీడని ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలన్న అభిమానుల తపనకు కళ్లెం పడింది! మొత్తానికి తమిళనాడులో బాహుబలి-2 సినిమా విడుదల కాలేదు. ఉదయం పడాల్సిన షోలన్నీ రద్దైపోయాయి. కారణం.. డిస్ట్రిబ్యూటర్లను థర్డ్ పార్టీ ప్రొడ్యూసర్ అడ్డుకోవడమే. తమిళనాడులో బాహుబలి-2 సినిమాను శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది.

వాస్తవానికి బాహుబలి-2 నిర్మాతలు.. తమిళనాడులో సినిమా హక్కులను కే ప్రొడక్షన్స్ అనే సంస్థకు అమ్మారు. సదరు సంస్థ తిరిగి శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్‌కు రూ.47 కోట్ల మొత్తానికి బాహుబలి-2 సినిమా ప్రదర్శన హక్కులను అమ్మేసింది. అందులో రూ.30 కోట్లు చెల్లించిన శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్.. మరో 17 కోట్లు బాకీ పడింది. ఇటీవలి భైరవ, కట్టప్పవ కనోమ్ సినిమాల వల్ల కలిగిన నష్టం వల్లే ఆ మొత్తాన్ని సంస్థ చెల్లించలేకపోయినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కే ప్రొడక్షన్స్ సంస్థ.. సినిమా ప్రదర్శనను అడ్డుకుందని చెబుతున్నారు. సినిమాను ప్రదర్శించకుండా డిస్ట్రిబ్యూటర్లకు అడ్డుకున్నట్టు తెలుస్తోంది. అంతేగాకుండా శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్‌ చెల్లించిన ఆ 30 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించేసి.. తామే సొంతంగా సినిమాను విడుదల చేస్తామని కే ప్రొడక్షన్స్ సంస్థ వాదిస్తున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

అందుకే తెల్లవారుజాము 3 గంటల నుంచి వేయాల్సిన ప్రీమియర్ షోలను అడ్డుకున్నట్టు చెబుతున్నారు. దాని ఫలితంగా ఉదయం 8.15 గంటల వరకు పడాల్సిన నాలుగు ప్రీమియర్లు రద్దైపోయినట్టు తెలుస్తోంది. ఇక, ప్రీమియర్ కోసం టికెట్లు కొనేసిన అభిమానులు అర్ధంతరంగా సినిమాను రద్దు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 గంటల నుంచే థియేటర్ల వద్ద వేచి చూస్తున్నామని, టికెట్లు కొని సినిమా చూసేందుకు వస్తే తీరా షో టైంలో ప్రీమియర్ రద్దు చేసినట్టు చెప్పారని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కనీసం టికెట్ల డబ్బును కూడా రీ ఫండ్ చేయలేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీతో థియేటర్‌కు వస్తే పోలీసు బందోబస్తు, మీడియా ప్రతినిధులు ఉన్నారని, భద్రత కోసం వారు వచ్చారని తాము అనుకుంటే.. అనూహ్యంగా షోలు రద్దు చేసినట్టు పిడుగు లాంటి వార్త చెప్పారని ఓ సినీ అభిమాని వాపోయాడు. కాగా, ప్రీమియర్లు రద్దైనా.. మార్నింగ్ షో (11.30 గంటల) నుంచి బాహుబలి-2 సినిమా ప్రదర్శనలు మొదలవుతాయని పలు థియేటర్ల యాజమాన్యాలు వెల్లడించాయి.

Comments

comments

Share this post

scroll to top