తాము పండించిన పంటలను తామే స్వయంగా ఆన్ లైన్లో అమ్ముకుంటున్న కర్ణాటక రైతులు, దళారులకు నో ఛాన్స్..!

పంటల కోసం రుణం తీసుకోవడం, విత్తనాలు, ఎరువులు కొనడం, పంట వేయడం, పండించడం, అమ్మడం… ఇలా ఎన్నో దశల్లో ఓ రైతు అనేక కష్టనష్టాలకోర్చి నేడు వ్యవసాయం చేస్తున్నాడు. అయితే తాను అనుకున్నవన్నీ సక్రమంగా జరిగి పంట బాగా పండినా గిట్టుబాటు ధర లేకపోతే ఇబ్బందే. దీనికి తోడు దళారీల దందా అంతా ఇంతా కాదు. రైతు పండించిన పంటలను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి మార్కెట్‌లో ఎక్కువ లాభానికి అమ్ముకుంటున్నారు. దీంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ నేపథ్యంలోనే దళారీ వ్యవస్థకు చెక్ పెట్టేందుకు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అక్కడి రైతులకు సువర్ణావకాశాన్ని కల్పించింది. దీంతో వారు ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే తమ పంటలను అమ్ముకుంటున్నారు. అనుకున్న ధరకు పంటలను అమ్మి ఆర్థికంగా లాభ పడుతున్నారు.
యూనిఫైడ్ మార్కెటింగ్ ప్లాట్‌ఫాం (యూఎంపీ) పేరిట కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2014లో రాష్ట్రీయ ఈ-మార్కెట్ సర్వీసెస్ (ఆర్‌ఈఎంఎస్) పేరిట ఓ సరికొత్త మాధ్యమాన్ని వర్తకులు, రైతులకు అనుసంధానంగా అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. దీని వల్ల వర్తకులు ఆయా పంటలకు తాము చెల్లించాలనుకున్న ధరలను ఆన్‌లైన్‌లో పెడతారు. అది చూసిన రైతులు తమకు అనుకూలమైతే సదరు వర్తకునికి తమ పంటలను అమ్ముకోవచ్చు. ఆన్‌లైన్ విధానం కాబట్టి రైతులకు దీంతో భయం లేదు. వారు ఎప్పటికప్పుడు తమ పంట అమ్మకానికి సంబంధించిన వివరాలను ఎస్‌ఎంఎస్ రూపంలో తెలుసుకోవచ్చు. పంటను అమ్మగానే వ‌ర్త‌కుడు ఇచ్చే సొమ్ము బ్యాంక్ అకౌంట్‌లో జ‌మ అయిందో లేదో కూడా ఎస్ఎంఎస్‌ల ద్వారా తెలుసుకునే వీలు క‌ల్పించారు.
farming-india
యూఎంపీ విధానం ద్వారా అగ్రిక‌ల్చ‌ర‌ల్ ప్రొడ్యూస్ మార్కెట్ క‌మిటీ (ఏపీఎంసీ)ల‌లో రైతులు తమ పంట‌ల‌ను అమ్ముకునే వీలును క‌ర్ణాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వం క‌ల్పించింది. కాగా ఈ ఏపీఎంసీలు రాష్ట్ర వ్యాప్తంగా 157 ఉండ‌గా వాటిలో 103 ఏపీఎంసీల‌ను ఇప్ప‌టికే ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం రైతుల‌కు అందుబాటులోకి తెచ్చింది. వాటి ద్వారా అక్క‌డి రైతులు ఇప్పుడు త‌మ పంటల‌ను నేరుగా వ‌ర్త‌కుల‌కే అమ్ముకుని లాభాలు పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌స్తుతం 1.4 కోట్ల మంది రైతులు యూఎంపీ విధానం ద్వారా ల‌బ్ది పొందుతుండ‌గా, ప్ర‌తి గ్రామంలోనూ దాదాపు 200 మంది రైతుల‌కు ఈ విధానం ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు.
నిజంగా దేశంలోని ప్ర‌తి గ్రామానికి చెందిన రైతుకు ఇలాంటి ప‌ద్ధ‌తిలో త‌మ త‌మ పంట‌ల‌ను అమ్ముకునేలా వీలు క‌ల్పిస్తే అంత‌కు మించిన సంక్షేమ కార్య‌క్ర‌మం ఇంకోటి ఉండ‌దేమో.

Comments

comments

Share this post

scroll to top