మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చే పద్ధతి ఇకపై చెల్లబోదని సుప్రీంకోర్టు స్పష్టంచేసిన నేపధ్యంలో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈ దురాచారానికి బలైన వారంతా సుప్రీంకోర్టు తీర్పు తరువాత తమ దీనగాథలను వినిపిస్తున్నారు.పశ్చిమ్ బెంగాల్‌లోని హావ్‌డాకు చెందిన ఇష్రత్ జహాన్‌ది.. తన భర్త ముర్తాజాతో 15 ఏళ్ల వైవాహిక జీవితం. అనంతరం 2015 ఏప్రిల్‌లో దుబాయ్ నుంచి ఫోన్లో 3 సార్లు తలాక్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. నలుగురు పిల్లలను కూడా తీసుకెళ్లిపోయాడు. అతను మరో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపిస్తూ జహాన్ పిటిషన్ వేశారు. పిల్లలను తనకు అప్పగించాలని, భరణం ఇవ్వాలని కోరారు. దంపతులిద్దరి సొంత రాష్ట్రం బిహార్. 2000లో పశ్చిమ్‌బెంగాల్‌కు వచ్చేసి.. అదే సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టిన తర్వాత అతను కొడుకు కోసం మరోపెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అయితే 2010లో వారికి కుమారుడు పుట్టినప్పటికీ వారి బంధం మాత్రం సజావుగా సాగలేదు. అనంతరం దుబాయ్ వెళ్లి ముమ్మారు తలాక్ చెప్పాడు.తలాక్ అంటే ఉన్నపళంగా మూడుసార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం. ఈ మూడు తలాక్ పద్దతులను పాటిస్తుంటారు.అవేంటో తెలుసుకోండి.
తలాక్–ఎ–అహ్సాన్:
ముస్లిం దంపతులు విడాకులు తీసుకోవడానికి సరైన మార్గంగా దీన్ని పరిగణిస్తారు. అహ్సాన్ అనే పదానికి అర్థం… అత్యుత్తమ లేదా సరైన. దీని ప్రకారం… భార్య రుతుక్రమంలో లేనప్పుడు… భర్త ఏకవాక్యంలో విడాకులు ఇస్తున్నట్లు చెప్పాలి. తర్వాత భార్య నిర్దేశిత కాలంపాటు నిరీక్షించాలి. ఈ కాలాన్ని ఇద్దత్ అంటారు. మూడు నెలసరులు ‘ఇద్దత్’గా ఉంటుంది. ఒకవేళ భార్య గర్భంతో ఉంటే శిశువు జన్మించేదాకా ఇద్దత్ కాలం ఉంటుంది. ఈ సమయంలోపు భర్త మనసు మార్చుకుంటే… తలాక్‌ను వెనక్కితీసుకోవచ్చు. ఇద్దత్ కాలం ముగిస్తే మాత్రం విడాకులు మంజూరైనట్లే.
తలాక్–ఎ–హసన్:
పునరాలోచనకు తగినంత సమయం ఉంటుంది కాబట్టి దీన్ని కూడా కొంతవరకు మంచి పద్ధతిగానే పరిగణిస్తారు. ఈ విధానంలో మూడునెలల వ్యవధిలో నెలకోమారు చొప్పున భర్త మూడుసార్లు భార్యకు తలాక్ చెబుతాడు. తర్వాత విడాకులు మంజూరవుతాయి. ఒకవేళ ఆలోపు మనసు మార్చుకుంటే… వైవాహిక బంధాన్ని కొనసాగించవచ్చు.
తలాక్–ఎ–బిద్దత్:
‘తలాక్… తలాక్… తలాక్’ అని వరుసగా మూడుసార్లు చెప్పేసి విడాకులు తీసుకోవడమే తలాక్–ఎ–బిద్దత్. షరియా చట్టం ప్రకారం ఇది చెల్లుబాటవుతోంది. ఒమేయద్ రాజులు విడాకులకు సులభమార్గంగా దీన్ని పరిచయం చేశారు. ఒక్కసారిగా మూడు పర్యాయాలు భర్త తలాక్ చెప్పాడంటే ఇక అంతే. విడాకులే. నిర్ణయాన్ని మార్చుకోవడానికి అవకాశం ఉండదు.
తలాక్ మూలంగా సాధారణ మహిళలే కాదు సెలబ్రిటీల జీవితాలు కూడా అతలాకుతలం అయ్యాయి.అందుకు ఉదాహారణ బాలివుడ్ నటి మీనాకుమారి సడెన్ గా భర్త తలాక్ చెప్పగానే నిశ్చేశ్చురాలయి తర్వాత పెళ్లి పేరెత్తకుండా నిస్సారంగా బతికింది.తర్వాత భర్త పశ్చాత్తాపపడి మళ్లీ నిఖా చేసుకుందామన్నాడు. ఈ నేపధ్యంలో ముస్లిం మత పెద్దలు… ఒకసారి నిఖా చేసుకున్న మహిళతో మరోమారు నిఖా చేసుకునేందుకు అవకాశం లేదని చెప్పారు. అయితే ఇందుకు పరిష్కారంగా ముందుగా మీనాకుమారికి మరొకరితో నిఖా జరిపించాలని చెప్పారు. అప్పడు ఆ నూతన వరుడు.. మీనాకుమారికి ట్రిపుల్ తలాక్ చెప్పాల్సి ఉంటుదన్నారు. దీని తరువాతే మీనాకుమారిని… కమాల్ అమ్రోహీ మరోమారు నిఖా చేసుకునేందుకు అర్హుడవుతాడని చెప్పారు. అనున్నట్టు అంతా సవ్యంగానే జరిగింది. అప్పటి హీరోయిన్ జీనత్ అమన్ తండ్రి అమానుల్లా ఖాన్‌తో మీనాకుమారి నిఖా జరిగింది. తరువాత అతను మీనాకుమారికి ట్రిపుల్ తలాక్ చెప్పారు. అప్పుడు కమాల్ అమ్రోహీ మీనా కుమారిని తిరిగి నిఖా చేసుకున్నాడు. కాగా మీనాకుమారి 1972, మార్చి 31న కన్నుమూశారు.