సిరియాలో ఏం జ‌రుగుతుంది? సోష‌ల్ మీడియాలో మ‌నం చూస్తున్న‌దంతా నిజ‌మేనా..?

బాంబుల గోల‌… ప్రాణాలు అర‌చేతిలో ప‌ట్టుకొని పౌరుల పరుగులు… మాంస‌పు ముద్ద‌లుగా ప‌డి ఉన్న‌ చిన్న పిల్ల‌లు. హాహాకారాలు, ఆర్త‌నాదాలు… మ‌మ్మ‌ల్ని కాపాడంటూ ప్రార్థ‌న‌లు, నివేద‌న‌లు.!! అస‌లు సిరియాలో ఏం జ‌రుగుతుంది.? ఎందుకీ మార‌ణ‌హోమం..!దీనికి ఆజ్యం ఎక్క‌డ‌..? ఈ చితి చ‌ల్లారేదెప్పుడు.? సిరియాలో నెల‌కొన్న వాస్త‌వ ప‌రిస్థితుల‌ను గూర్చి కొంత క్లుప్తంగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం.

మ‌న‌కంటే ముందుగానే 1944లో సిరియా స్వాతంత్ర్యం పొందింది. 1949 లో అమెరికా అనుకూల ప్ర‌భుత్వం అక్కడ అధికారంలోకి వ‌చ్చింది. అప్ప‌టి నుండి ప్ర‌భుత్వానికి, మిల‌ట‌రీ అధికారుల‌కు మ‌ద్య వైరం పెరుగుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు 1970 లో ప్ర‌భుత్వానికి వ్య‌తిరేఖంగా మిల‌ట‌రీ అధికారులు తిరుగుబాటు లేవ‌దీసి, ప్ర‌భుత్వాన్ని కూల‌దోసి అధికారంలోకి వ‌చ్చారు. అప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు 50 ఏళ్ళుగా అక్క‌డ నియంతృత్వ సైనిక పాల‌న న‌డుస్తోంది.

చిన్న అసంతృప్తి, చిలికి చిలికి గాలివాన‌గా మారింది:
2011 లో అనేక అర‌బ్ దేశాల ప్ర‌జ‌లు వారి వారి అధ్య‌క్షుల‌కు వ్య‌తిరేఖంగా తిరుగుబాటు చేశారు. వీటికే జాస్మిన్ విప్ల‌వాల‌ని పేరు…ఈ క్ర‌మంలో సిరియా ప్ర‌జ‌లు కూడా త‌మ దేశ నియంతృత్వ అద్య‌క్షుడైన బ‌ష‌ర్ అల్ అస‌ద్ కు వ్య‌తిరేఖంగా ద‌ర్నాలు, రాస్తారోకోలు నిర‌స‌న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. దీనికి ప్ర‌తిప‌క్షాలు ఫుల్ స‌పోర్ట్ ను అందించాయి. దీంతో చిన్న చిన్న నిర‌స‌న‌లు….హింసాత్మ‌క మార్గంలోకి వెళ్ళాయి.! దీనికి తోడు…ప్ర‌భుత్వం సున్ని మ‌త‌స్తుల‌ను ఇబ్బందుల‌కు గురిచేస్తుంద‌న్న కార‌ణంతో సైన్యంలో ఉన్న సున్ని మ‌త‌స్తులు కూడా నిర‌స‌న‌కారుల‌కు స‌పోర్ట్ నివ్వ‌డంతో.. నిర‌స‌నలోకి తుపాకులొచ్చేశాయ్. దీంతో ఈ తిరుగుబాటు మ‌రింత హింసాత్మ‌కంగా మారింది.

దిగొచ్చిన‌ అధ్య‌క్షుడు….మ‌ళ్ళీ రెచ్చ‌గొట్టిన ISIS:

పౌరులు చేస్తున్న తిరుగుబాటుకు అధ్య‌క్షుడు బ‌ష‌ర్ అల్ అస‌ద్ దిగొచ్చాడు. కొన్ని రోజుల్లోనే దేశంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని హామీ ఇచ్చి, ఉద్యోగుల జీతాలు సైతం పెంచాడు, దేశ అభివృద్దికి అంద‌రూ పాటు ప‌డాల‌ని పిలుపునిచ్చాడు.! దీంతో ఉద్య‌మం కొంత కూల్ అయింద‌నుకున్న త‌రుణంలో…ఒక్క‌సారిగా సీన్ లోకి ISIS ఎంట‌ర్ అయ్యింది… బ‌ష‌ర్ ను గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్యంగా చేసుకోవ‌డంతో తిరుగుబాటు యూ ట‌ర్న్ తీసుకుంది. ప్ర‌భుత్వ అధికారుల‌ను చంప‌డ‌మే ధ్యేయంగా ISIS ముందుకెళుతున్న క్ర‌మంలో….ప్ర‌భుత్వం కూడా వీరిని నివారించ‌డానికి క‌నిపిస్తే కాల్చ‌డం లాంటి నిర్ణ‌యాల‌ను తీసుకుంది. అలా ప్ర‌త్యక్ష యుద్దానికి సిరియా వేదికైంది.

అమెరికా, ర‌ష్యాలే అస‌లు కార‌ణం:

పెద్దన్న దేశాలైన అమెరికా ర‌ష్యాలే ఇప్ప‌టి సిరియా ప‌రిస్థితుల‌కు అస‌లు కార‌కులు. నిర‌స‌నకారుల‌కు మ‌ద్దతుగా అమెరికా, సిరియా ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా ర‌ష్యా, చైనాలు రంగంలోకి దిగ‌డంతో మ్యాట‌ర్ మ‌రింత సంక్లిష్టమ‌య్యింది.! లిబియా లాగా సిరియా చ‌మురు క్షేత్రాల‌ను కొల్ల‌గొట్టాల‌న్న ఆశ అమెరికాది, అమెరికా ఆధిప‌త్యం ఎక్కువైతే తాము త‌క్కువైపోతామ‌న్న భ‌యం ర‌ష్యా, చైనాల‌ది.! అమెరికా స‌పోర్ట్ తో నిర‌స‌న కారులు సాయుధులై మ‌రింత‌గా రెచ్చిపోతుంటే….ర‌ష్యా, చైనా స‌పోర్ట్ తో ప్ర‌భుత్వం బాంబుల వ‌ర్షం కురిపిస్తుంది.

 

సామాన్యులే బ‌లి: 
అంతర్యుద్ధం కారణంగా ఇప్పటికే సిరియాలో… ఈ 5 ఏళ్ళ‌లో రెండున్నర లక్షల మంది చనిపోయారు. ఇందులో సగం మంది అమాయ‌క ప్ర‌జ‌లే. ఐరాస అంచనా ప్రకారం 60 లక్షల మంది నిరాశ్ర‌యులయ్యారు. దాదాపు 50 లక్ష‌ల మంది ప‌క్క‌నున్న దేశాల స‌రిహ‌ద్దులో జీవ‌చ్చ‌వాల్లా బ‌తుకుతున్నారు. ప‌క్క‌నున్న దేశాలు సైతం త‌మ స‌రిహ‌ద్దులు దాటి వీరిని రానివ్వ‌క‌పోవ‌డం విషాద‌క‌రం.! స్వ‌చ్చంద సంస్థ‌లు ఇచ్చే ఆహార పొట్లాల‌పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నారు వారంతా…!


సోష‌ల్ మీడియాలో చూస్తున్న‌దంతా నిజ‌మేనా..?
16 నెల‌లుగా సిరియాలో అంత‌ర్యుద్దం జ‌రుగుతున్న మాట నిజ‌మే కానీ…మ‌రీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న విధంగా అయితే కాద‌నే చెప్పాలి. ప్ర‌భుత్వం అనుమానాస్ప‌ద ప్రాంతాల‌పై బాంబులు వేయడం నిజం, ఆ బాంబుల ధాటికి ఇండ్లు ధ్వంస‌మౌతున్నాయ‌న్న‌ది నిజం, చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నార‌న్న‌ది నిజం,అందులో చిన్న పిల్ల‌ల సంఖ్య అధికం అన్న‌ది కూడా నిజం. కాక‌పోతే చాలా వ‌రకు ఫేక్ ఫోటోలు, చాలా పాత ఫోటోలు కూడా ఈ పేరుతో వాడుతున్నారు. ఇక బాంబులు కురిపిస్తున్న వీడియో మాత్రం ర‌ష్యా వీడియో గేమ్స్ కు సంబంధించిన‌ది…. ర‌ష్యా ఛాన‌ల్స్ వీడియో గేమ్స్ ఫుటేజ్ ల‌ను సిరియాలో ఇలాగే జ‌రుగుతుంద‌ని ప్ర‌చారం చేయ‌డంతో అవి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.


ఏం చేయాలి.?
ప్ర‌జాస్వామ్యం వ‌ర్థిల్లాలి.! అంటే సిరియాలో కూడా ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాలి. దీని కోసం అన్ని దేశాలు త‌మ స‌హాకారాన్నందించి స‌మ‌స్య స‌ద్దుమ‌ణిగేలా చూడాలి.! అలాకాకుండా ఆదిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని చూసినా, మాకేంటి లాభం అని ఆశించినా….ఈ అంత‌ర్యుద్దం కాస్త మూడో ప్ర‌పంచ యుద్దానికి దారి తీసే ప్ర‌మాదం సైతం ఉంది.

Comments

comments

Share this post

scroll to top