బలమే జీవనం బలహీనతే మరణం అని చెప్పిన “స్వామి వివేకానంద” గారి గురించి కొత్తగా చెప్పవలసిన అవసరంలేదు అనుకుంట. ప్రపంచ దేశాలకు భారత జాతి గొప్పతనం పరిచయం చేయడమే కాదు ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారిన మహానుభావుడు వివేకానంద. మనల్ని బలహీనుల్ని చేసేవన్నిటిని విషంగా భావించి తిరస్కరించామని ప్రభోదించారు స్వామిజి. మద్యపానం, ధూమపానం మనుషుల్ని మానసికంగా, శారీరకంగా బలహీనుల్ని చేస్తుంది. హానికరమైన దానిని తిరస్కరించాలి మనం. కానీ ఓ సందర్భంలో స్వామిజి హుక్కా తాగారు. కానీ స్వామిజి ఆ పని చేయటం వెనుక ఎంతో నీతి ఉంది. అసలేం జరిగిందో మీరే చూడండి!
అది 1888 ఆగస్టు నెల. స్వామిజి అగ్ర నుంచి బృందావనానికి వెళుతున్నారు. పట్టణం శివార్లను చేరుకునే సమయంలో బాట పక్కన ఒక వ్యక్తి తృప్తిగా పొగ త్రాగుతుండడం స్వామిజి కంట పడింది. చాలా దూరం నడిచి రావటంతో స్వామిజి బాగా అలసిపోయి ఉన్నారు. కాస్త పొగ పీల్చి, కాసేపు విశ్రాంతి తీసుకోవాలనిపించింది ఆయనకి. ఆ వ్యక్తిని సమీపించి అతడి హుక్కాతో తాను పొగత్రాగవచ్చునా అని అడిగారు. స్వామిజి అలా అడిగేసరికి అతను వణికిపోయి..”నన్ను క్షమించింది మహాశేయా! నేను వాడుతున్న ఈ హుక్కాతో మీరు పొగత్రాగరాదు. మీరు ఒక సన్యాసి. నేను ఒక మరుగుదొడ్లు శుభ్రం చేసేవాడిని.”
స్వామిజి తన నడకను కొనసాగించారు. కొంచెం దూరం వెళ్ళగానే ఆయన మనసులో ఓ ఆలోచన మెదిలింది. “మనుషులు అందరు ఒక్కటే..కులం పేరుతో విభజించద్దు అని ప్రభోదించే వాడిని నేను. అతను అస్పృశ్యుడు కావడం వలన అతడి హుక్కాతో పొగ పీల్చకూడదు అనుకోవడం ఎంత సిగ్గు చేటు”. అలా అనుకోని వెంటనే అతని వద్దకు వెళ్లి అతడిని పొగ సిద్ధం చేసివ్వమని అడిగారు. స్వామిజి ఆనందంగా అతడి హుక్కాతో పొగ త్రాగారు.