సమ ఉజ్జీల మధ్య పోరాటం ఎలా వుంటుందో తెలుసు కోవాలంటే ..ఐపీఎల్ మ్యాచ్‌లు చూడాల్సిందే. ప్రతి జట్టులో ఏదో ఒక ప్రత్యేకతతో టోర్నీలో తమ ప్రతాపాన్ని చూపించింది. ప్రపంచ కప్ కు వార్మప్ మ్యాచ్‌లుగా పనికొస్తాయని బీసీసీఐ భావించింది. పేరుకే వయసులో చిన్నోళ్లయినా టోర్నమెంట్లో అభిమానులకు తమ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి తీపి జ్ఞాపకాలను మిగిల్చారు. రిషబ్ పంత్, శాంసన్ లాంటి ఆటగాళ్లు మెరిశారు. ఎలాంటి బంతులైనా సరే అలవోకగా ఆడారు. పరుగులు రాబట్టారు. ఇండియన్ క్రికెట్ టీంకు ఆటగాళ్ల కొరత అంటూ లేకుండా పోయింది. ఒకరు కాక పోతే మరొకరు రెడీగా ఉన్నారు ..దేశం తరపున ఆడేందుకు. ఐపీఎల్ పుణ్యమా అంటూ టాలెంట్ కలిగిన క్రికెటర్స్ తమను తాము ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లభించింది. దీంతో ఐపీఎల్ బౌలర్లు, బ్యాట్స్ మెన్స్ కు ఓ వేదికగా ఉపయోగ పడింది.
విశాఖపట్నం కేంద్రంగా జరిగిన ఐపీఎల్ ఎలిమినేటర్ లో ఢిల్లీ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఘన విజయం సాధించింది. ఆరు విజయాలతో ప్లే ఆఫ్ లో చోటు సంపాదించిన ఆ జట్టు మరో అడుగు వేయలేక చతికిల పడింది. ఓవర్ ఓవర్ కు మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో అనూహ్యంగా ఢిల్లీ కేపిటల్స్ గెలుపొందింది. చెన్నైతో పోరుకు సిద్ధమైంది. ఆ జట్టులో రిషబ్ పంత్ గోడలా నిలబడ్డాడు. తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించడంలో కీలక భూమిక పోషించాడు. ఏ బౌలర్‌ను విడిచి పెట్టలేదు. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేయగలిగింది. గప్తిల్ 19 బంతులు ఆడి ఒక ఫోర్, నాలుగు సిక్సర్లతో 36 పరుగులు చేయడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది.
పృథ్వీ షా బ్యాటింగ్‌లో మెరిపించినా..ఢిల్లీని గెలిపించిన ఘనత మాత్రం రిషబ్ పంత్ దే. శిఖర్ ధావన్ మూడు ఫోర్లతో 17 పరుగులు చేసి పెవిలియన్ కు చేరుకోగా..పృథ్వీ ఒక్కడే రైజర్స్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ముచ్చటైన షాట్లతో అలరించాడు. పది ఓవర్లలో ఒకే ఒక వికెట్‌ను కోల్పోయిన ఢిల్లీ ..వెంట వెంటనే వికెట్లను కోల్పోయింది. శ్రేయస్ అయ్యర్ తో పాటు ఊపు మీదున్న షాను ఖలీల్ అహ్మద్ అవుట్ చేయడంతో ఒక్కసారిగా రన్ రేట్ పడిపోయింది. 36 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఢిల్లీది. 15వ ఓవర్ లో రషీద్ ఖాన్ ఆట స్వరూపాన్నే మార్చేశాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మన్రో, పటేల్‌లను అవుట్ చేశాడు.
థంపి వేసిన 18వ ఓవర్ లో వరుసగా 4, 6, 4, 6 కొట్టాడు. భువి వేసిన 19వ ఓవర్ లో రూథర్డ్ ఫర్డ్ అవుట్ కాగా..ఐదో బంతికి పంత్ పెవిలియన్ దారి పట్టాడు. ఆఖరు ఓవర్ లో 5 పరుగులు కావాల్సి వచ్చింది. చివరి రెండు బంతుల్లో రెండు పరుగులు చేయాల్సి ఉండగా ఖలీల్ బంతిని పాల్ బౌండరీ దాటించి జట్టుకు విజయాన్ని అందించాడు . అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టులో మనీష్ పాండే, విలియమ్సన్, విజయ్ శంకర్ లు ధాటిగా ఆడడంతో ఆ మాత్రం స్కోర్ చేసింది. జట్టుకు విజయాన్ని అందించిన రిషబ్ పంత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.