ఇన్ఫోసిస్ వ్య‌వ‌స్థాప‌కులు నారాయ‌ణ మూర్తి, ఆయన భార్య సుధామూర్తిల అంద‌మైన ప్రేమ క‌థ గురించి తెలుసా..?

ఇన్ఫోసిస్‌.. ఈ కంపెనీ గురించి పెద్ద‌గా చెప్పాల్సిన ప‌నిలేదు. సాఫ్ట్‌వేర్ రంగంలో దిన దినాభివృద్ధి చెందుతూ ఈ కంపెనీ దూసుకుపోతోంది. ఎంతో మంది దీని వ‌ల్ల ఉపాధి పొందుతున్నారు. అనేక దేశాల్లో ఈ కంపెనీ సేవ‌లు అందిస్తోంది. అయితే దీని ఆవిర్భావం వెనుక వ్య‌వ‌స్థాప‌కుడు నారాయ‌ణ మూర్తి, ఆయ‌న భార్య సుధా మూర్తి చాలా క‌ష్ట‌ప‌డ్డారు. అందులోనే వారి అంద‌మైన ప్రేమ క‌థ కూడా దాగి ఉంది. వీరు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఆ కంపెనీని నేడు ఈ స్థాయికి తీసుకొచ్చారు. వారి జీవితానికి చెందిన ప‌లు ముఖ్య‌మైన విష‌యాలు.. మీ కోసం…

 

నారాయ‌ణ మూర్తి, సుధా మూర్తి అప్ప‌ట్లో పూణెలో ప్ర‌స‌న్న అనే ఓ కామ‌న్ ఫ్రెండ్ ద్వారా మొద‌టి సారిగా క‌లుసుకున్నారు. త‌రువాత ఒక‌సారి పూణెలోని గ్రీన్ ఫీల్డ్స్ హోట‌ల్‌లో పార్టీ సంద‌ర్భంగా మ‌ళ్లీ క‌లుసుకున్న వీరు మంచి స్నేహితులు అయ్యారు. దీంతో వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించింది. ఈ క్ర‌మంలో సుధ‌ను పెళ్లి చేసుకునేందుకు నారాయ‌ణ మూర్తి ఆమె తండ్రిని క‌లిసి విష‌యం చెప్పాడు. అయితే ఆయ‌న నారాయ‌ణ మూర్తిని ఒక ప్ర‌శ్న అడిగాడు. జీవితంలో నువ్వు ఏం అవుదామ‌ని అనుకుంటున్నావ్ అని అడగ్గా.. అందుకు నారాయణ మూర్తి.. క‌మ్యూనిస్టు పార్టీలో చేరి రాజకీయాల్లో రాణిస్తూ అనాథాశ్ర‌మం న‌డ‌పాల‌ని ఉంది అని చెప్పారు. అది ఆయ‌న‌కు న‌చ్చ‌లేదు. త‌న కూతురితో నారాయ‌ణ మూర్తి పెళ్లికి అడ్డు చెప్పారు.

త‌రువాత 3 సంవ‌త్స‌రాలు గ‌డిచాయి. అయినా వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ అలాగే ఉంది. ఇక 1970ల‌లో వ‌చ్చిన కంప్యూట‌ర్ బూమ్ వ‌ల్ల నారాయ‌ణ మూర్తికి మంచి జాబ్ దొరికింది. 1977లో ముంబైలోని ప‌ట్ని కంప్యూట‌ర్స్‌లో జీఎంగా చేరాడు. మంచి జాబ్ కావ‌డంతో సుధ తండ్రి వారి పెళ్లికి అడ్డు చెప్ప‌లేదు. దీంతో వారి పెళ్లి జ‌రిగిపోయింది. ఫిబ్ర‌వరి 10, 1978వ తేదీన వారి వివాహం జ‌రిగింది. అందుకు వారికి రూ.800 మాత్ర‌మే ఖ‌ర్చు అయింది. దాన్ని ఇరు వ‌ర్గాలు స‌మానంగా పంచుకున్నారు. ఇక నారాయ‌ణ‌, సుధా మూర్తి దంప‌తుల‌కు ఇద్ద‌రు సంతానం క‌లిగారు.

అలా నారాయ‌ణ‌, సుధా మూర్తిల దాంప‌త్య జీవితం సాఫీగా సాగుతుండ‌గా 1981లో నారాయ‌ణ మూర్తి సొంతంగా తానే ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టాల‌ని అనుకున్నారు. అప్పుడు సుధా మూర్తి తాను సేవ్ చేసుకున్న రూ.10వేల‌ను నారాయ‌ణ మూర్తికి ఇచ్చారు. ఈ క్ర‌మంలో ఆయన మ‌రికొంద‌రితో క‌లిసి ఇన్ఫోసిస్‌ను స్థాపించారు. త‌రువాత 1983లో వారు బెంగుళూరుకు మ‌కాం మార్చారు. త‌రువాత ఇక వెన‌క్కి తిరిగి చూడ‌లేదు. ఇద్ద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి ఇన్ఫోసిస్‌ను నేడు ప్ర‌పంచ స్థాయి కంపెనీగా తీర్చిదిద్దారు. అయిన‌ప్ప‌టికీ వారు ఒక‌ప్పుడు ఎలా ఉన్నారో ఇప్ప‌టికీ అలాగే ఉన్నారు. ముందు వారిది అంద‌మైన ప్రేమ జంట‌. త‌రువాతే కంపెనీలో పార్ట్‌న‌ర్స్‌. క‌నుక‌నే వారు ఇప్ప‌టికీ త‌మ అంద‌మైన ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇప్ప‌టికీ చూడ ముచ్చ‌టైన జంటగా ఉన్నారు. వారిని చూసి ఎన్నో జంట‌లు ప్రేమ విష‌యంలో స్ఫూర్తి పొందాల్సిందే క‌దా..!

 

 

Comments

comments

Share this post

scroll to top