ఆగ‌ని ఆత్మ‌హ‌త్య‌లు – ఆందోళ‌న‌లో త‌ల్లిదండ్రులు

తెలంగాణ‌లో విద్యా వ్య‌వ‌స్థ నీరు గారి పోయింది. కేజీ టూ పీజీ పేరుతో జ‌పం చేస్తున్న ప్ర‌భుత్వం క‌నీస వ‌స‌తులు క‌ల్పించ‌డంలో. వ‌న‌రులు ఏర్పాటు చేయ‌డంలో పూర్తిగా వైఫ‌ల్యం చెందింది. ఇప్ప‌టికే ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు చేసిన త‌ప్పిదాల నిర్వాకానికి 16 మందికి పైగా విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మ‌రికొంద‌రు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ బోర్డు ముందుగానే ఫ‌లితాల‌ను వెల్ల‌డించింది. ఎలాంటి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చోటు చేసుకోలేదు. దీంతో తీవ్ర‌మైన ఒత్తిడి తెలంగాణ ఇంట‌ర్ బోర్డుపై ప‌డింది. దీంతో గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో హుటా హుటిన టిఎస్ ఇంట‌ర్ బోర్డు ఉన్న‌తాధికారులు జ‌నార్ద‌న్ రెడ్డి, డాక్ట‌ర్ అశోక్‌లు ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాలు వెల్ల‌డించారు. ప్ర‌క‌టించిన నాటి నుండి నేటి దాకా తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చోటు చేసుకున్నాయి.

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్‌లో టాప్ పొజిష‌న్లో ఉన్న స్టూడెంట్స్ సెకండియ‌ర్ వ‌ర‌కు వ‌చ్చేస‌రిక‌ల్లా చాలా స‌బ్జెక్టులు కోల్పోయారు. దీంతో పేరెంట్స్, స్టూడెంట్స్ ఆందోళ‌న బాట ప‌ట్టారు. ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేశారు. ఏకంగా ఇంట‌ర్ బోర్డు నిర్వాకంపై స‌ర్వ‌త్రా నిర‌స‌న వ్య‌క్త‌మైంది. తెలంగాణ అంత‌టా ఆయా ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులంతా తాము క‌ష్ట‌ప‌డి చ‌దివి..ప‌రీక్ష‌లు రాస్తే ..అనుభ‌వం లేని ఇన్విజిలేట‌ర్లు చేసిన త‌ప్పిదాల‌కు త‌మకు త‌క్కువ మార్కులు వేశారంటూ మండిప‌డ్డారు. ఏకంగా నాంప‌ల్లిలోని ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యం ఎదుట త‌ల్లిదండ్రుల‌తో పాటు విద్యార్థులు ఆందోళ‌న‌కు దిగారు. పిల్ల‌లు, పేరెంట్స్ అని చూడ‌కుండా తెలంగాణ పోలీసులు దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. పిల్ల‌ల‌కు బేడీలు వేసుకుంటూ ..ఈడ్చుకెళ్లారు. మీడియా ఈ దురాగ‌తాన్ని హైలెట్ చేయ‌డంతో ఒక్క‌సారిగా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం ప్రారంభ‌మైంది. ఈ ఒక్క నిర్వాకం కార‌ణంగా ముక్కు ప‌చ్చ‌లార‌ని బిడ్డ‌లు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు.

తాము ఫెయిల్ అయిన‌ట్టు మార్కులు రావడంతో త‌ట్టుకోలేక త‌ల్ల‌డిల్లి పోయారు. కార్పొరేట్ కాలేజీల యాజ‌మాన్యాలు ఇచ్చే ఆమ్యామ్యాల‌కు త‌లొగ్గిన అధికారులు త‌మ‌ను రోడ్డు పాలు చేశారంటూ బాధితులు ఆరోపించారు. ప‌రిస్థితి చేయి దాటి పోవ‌డంతో..ఆగ్ర‌హం చెందిన స్టూడెంట్స్ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ అశోక్‌ను ఘెరావ్ చేశారు. మ‌రో వైపు రీ వాల్యూయేష‌న్ కోస‌మైనా ద‌ర‌ఖాస్తు చేసుకుందామంటే బోర్డు వెబ్ సైట్ ఓపెన్ కాక పోవ‌డంతో మ‌రింత ఆందోళ‌న‌కు లోన‌య్యారు. రోజు రోజుకు స‌మ‌స్య తీవ్రం కావ‌డంతో హుటాహుటిన ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జోషి..విద్యాశాఖ అధికారుల‌తో స‌మావేశాన్ని నిర్వ‌హించారు. పిల్ల‌లు చ‌నిపోవ‌డంపై రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ స్పందించారు. త‌క్ష‌ణమే ఎందుకు ఇలా జ‌రిగిందో..పొర‌పాట్ల‌కు కార‌ణం ఏమిటో త‌న‌కు నివేదించాల‌ని ఆదేశించారు.

సంబంధిత విద్యా శాఖ మంత్రి జ‌గ‌దీష్ రెడ్డి త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. ఏబీవీపీ, బీజేపీ, కాంగ్రెస్ , టీడీపీ పార్టీలు బోర్డు కార్య‌ద‌ర్శి అశోక్ ను స‌స్పెండ్ చేయాల‌ని, మంత్రిని తొల‌గించాల‌ని కోరాయి. ఇంట‌ర్ ప‌రీక్ష‌ల్లో ఎలాంటి అవ‌క‌వ‌త‌క‌లు జ‌ర‌గ‌లేద‌ని, ఏం జ‌రిగింద‌నే విష‌యంపై ముగ్గురు స‌భ్యుల‌తో క‌మిటీని ఏర్పాటు చేస్తున్న‌ట్లు టీఆర్ ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్ వెల్ల‌డించారు. ఈ విష‌యంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎలాంటి పొర‌పాట్లు జ‌ర‌లేదని..సున్నా మార్కులు వేసిన విద్యార్థికి తిరిగి 99 మార్కులు వేయ‌డంపై కార్య‌ద‌ర్శి వివ‌ర‌ణ ఇచ్చారు. అటు ప్ర‌భుత్వం నుండి కానీ ఇటు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు నుంచి కానీ స‌రైన స‌మాధానం రావ‌డం లేదంటూ పేరెంట్స్, స్టూడెంట్స్ వాపోయారు. రాష్ట్ర మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్‌ను ఆశ్ర‌యించారు.

ఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని, అధికారుల నిర్ల‌క్ష్యం, సిబ్బంది బాధ్య‌తారాహిత్యం వ‌ల్ల‌నే త‌మ పిల్ల‌లు ఫెయిల్ అయ్యార‌ని ఆరోపించారు. త‌ప్పుల‌పై స‌మ‌గ్ర విచార‌ణ‌కు ఆదేశించాల‌ని, త‌మ పిల్ల‌ల‌కు భ‌రోసా క‌ల్పించాల‌ని కోరారు. మొద‌టి సంవ‌త్స‌రంలో మెరిట్ మార్కులు సాధించిన స్టూడెంట్స్‌ను రెండో సంవ‌త్స‌రం లో ఫెయిల్ చేశార‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. ఒక స‌బ్జెక్టుకు క‌నీసం 60 మార్కులు మాత్ర‌మే ఉంటే ..బోర్డు ఏకంగా 69 మార్కులు వేసింద‌ని..ఇదొక్క‌టి చాలు..అది ఎంత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుందో తెలుస్తుంద‌న్నారు. ఘోర తప్పిదాలకు కారణమైన ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారులతోపాటు గ్లోబెరినా సాఫ్ట్‌వేర్‌ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

విద్యార్థుల పిటిషన్‌ను హెచ్‌ఆర్‌సీ విచారణకు స్వీకరించింది. ఇంత ఆందోళ‌న జ‌రుగుతుంటే మ‌రో వైపు ఇంట‌ర్ బోర్డు కార్య‌ద‌ర్శి డాక్ట‌ర్ అశోక్ కుమార్ కు మ‌ద్ధ‌తుగా తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ ఫ‌ర్ జ‌స్టిస్ నిలిచింది. ఇంటర్‌ విద్యలో ఎన్నో సంస్కరణలు అమలు చేసిన ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు చేయడం ఎంత వరకు సమంజసమని సంస్థ కన్వీనర్‌ మహ్మద్‌ ఇస్మాయిల్‌, వర్కింగ్‌ కన్వీనర్‌ ప్రవీణ్‌కుమార్‌, ప్రతినిధులు ప్రశ్నించారు. ఇంటర్‌ బోర్డు ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా మధుసూదన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద ఈ వ్య‌వ‌హారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాల్సి ఉంది.

Comments

comments

Share this post

scroll to top