పాఠ‌శాల‌కు వెళ్లాలంటే ఆ గ్రామ పిల్ల‌లు వాగు ప్ర‌వాహం దాటాల్సిందే..!

పాఠ‌శాల‌ల‌కు వెళ్లాలంటే నేటి త‌రుణంలో చిన్నారులు కేజీల కొద్దీ బ‌రువును మోయాల్సి వ‌స్తోంది. పుస్త‌కాలు, ఇతర వ‌స్తువుల‌తో కూడిన బ్యాగుల‌ను స్కూళ్ల‌కు మోసుకెళ్తూ వీపులు చింతపండు చేసుకుంటున్నారు. ఇది ఏ స్కూల్‌లో అయినా జ‌రిగే తతంగ‌మే. అయితే ఆ ప్రాంతంలో చిన్నారుల‌కు మాత్రం ఇంత కంటే పెద్ద అవ‌స్థే ఇంకోటి ఉంది. స్కూల్‌కు వెళ్లాలంటే నిత్యం సాహ‌సం చేయాల్సిందే. అది కూడా నీటిలో. దుస్తులు విప్పి, వాటిని బ్యాగుతో క‌లిపి నెత్తిన పెట్టుకుని, ఛాతి వ‌ర‌కు వ‌చ్చే వాగు నీటిలో నెమ్మ‌దిగా క‌దులుతూ ఆ వాగును దాటి వెళ్లాలి. ఒక‌వేళ పొర‌పాటునా ఏదైనా ప్ర‌మాదం జ‌రిగితే ఇక అంతే సంగ‌తులు. అలాంటి గ‌త్యంత‌రం లేని స్థితిలో ఆ గ్రామానికి చెందిన చిన్నారులు రోజూ న‌ర‌క యాత‌న అనుభ‌విస్తూ పాఠ‌శాల‌కు వెళ్తున్నారు.

vagu-crossing
అది వ‌న‌ప‌ర్తి జిల్లా శ్రీ‌రంగాపూర్ మండ‌లం శేరుప‌ల్లి గ్రామం. అక్క‌డ 1600 జ‌నాభా ఉంటుంది. ఆ గ్రామంలో కేవ‌లం ప్రాథ‌మిక పాఠ‌శాల మాత్ర‌మే ఉంది. దీంతో 6వ త‌ర‌గ‌తి ఆపైన చ‌దువులు చ‌దవాలంటే అక్క‌డికి నాలుగు కిలోమీట‌ర్ల దూరంలోని శ్రీ‌రంగాపూర్ కు వెళ్లాల్సిందే. దీంతో ఆ గ్రామానికి చెందిన దాదాపు 50 మంది విద్యార్థులు 4 కిలోమీట‌ర్ల పాటు న‌డిచి వెళ్లి మ‌రీ శ్రీ‌రంగాపూర్‌లోని పాఠ‌శాల‌కు నిత్యం వెళ్లి వ‌స్తున్నారు. అయితే స్కూల్‌కు వెళ్లే దారిలో కేవ‌లం న‌డ‌క మాత్ర‌మే ఉంటే ఓకే. ఎలాగో కొద్ది నిమిషాలు న‌డిస్తే చాలు. సుల‌భంగా రాక‌పోక‌లు సాగించ‌వ‌చ్చు. కానీ అదే దారిలో ఉండే వాగులో ఈదాల్సి వ‌స్తే. అప్పుడు ఆ పిల్ల‌ల అవ‌స్థ ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. శేరుప‌ల్లి చిన్నారులు కూడా అదే అవ‌స్థ ప‌డుతున్నారు. శ్రీ‌రంగాపూర్ లోని స్కూల్‌కు వెళ్లాలంటే వారు నిత్యం 4 కిలోమీట‌ర్లు న‌డ‌వ‌డమే కాదు, దారి మ‌ధ్య‌లో ఉన్న జింక‌లోని వాగులో కొంత దూరం వెళ్లాల్సిందే. అయితే అలా వారు వాగులో వెళ్ల‌డానికి ముందు దుస్తులు విప్పి, వాటిని బ్యాగులో పెట్టుకుని, దాన్ని మ‌ళ్లీ నెత్తిన పెట్టుకుని అప్పుడు వాగులోకి దిగి న‌డుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్ర‌మంలో ఆ పిల్ల‌లు ప‌డే అవ‌స్థ అంతా ఇంతా కాదు.

జూరాల జలాశయం నుంచి పొలాల ద్వారా వచ్చే నీటిప్రవాహంతో ఏడాది పొడవునా ఆ వాగు పారుతుంది. ఇక వ‌ర్షాకాలంలో అయితే పిల్ల‌ల‌కు సెల‌వే. ఎందుకంటే అప్పుడు ఆ వాగులో ప్ర‌వాహం ఉధృతంగా ఉంటుంది. ఈ క్రమంలో మ‌గ పిల్ల‌లు ఎలాగో చ‌దువు గ‌ట్టెక్కేస్తున్నారు కానీ ఆడ‌పిల్ల‌ల‌కు మాత్రం చ‌దువు మధ్య‌లోనే ఆగుతోంది. ఆ వాగులో న‌డిచి వెళ్ల‌లేక వారు చ‌దువు మ‌ధ్య‌లోనే ఆపేస్తున్నారు. ఈ క్ర‌మంలో వారికి చిన్న వ‌య‌స్సులోనే పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు. అలా ఉంది శేరుప‌ల్లి విద్యార్థుల ప‌రిస్థితి. అయితే స‌ద‌రు వాగుపై వంతెన నిర్మించేందుకు 2009లోనే రూ.1.90 కోట్ల వ్య‌యంతో అనుమ‌తులు మంజూర‌య్యాయి. కానీ అందుకు గాను త‌గిన భూ సేక‌ర‌ణ ఇప్ప‌టికీ చేయ‌లేదు. దీంతో ఆ వాగుపై వంతెన నిర్మాణం క‌ల‌గానే మిగిలిపోయింది ఆ గ్రామ‌వాసుల‌కు. ఇక మ‌న నేత‌లు, అధికారులు ఎప్పుడు స్పందిస్తారో, ఆ వాగుపై ఎప్పుడు వంతెన నిర్మిస్తారో ఆ దేవుడికే తెలియాలి..!

Comments

comments

Share this post

scroll to top