ఉయ్యాలవాడ న‌ర‌సింహారెడ్డి చారిత్ర‌క గాథ ఇదే తెలుసా..?

ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి చేయ‌బోతున్న త‌దుప‌రి సినిమా ఇదే. బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి అనే వీరుని క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నార‌ని తెలిసిందే. ఇది చిరంజీవికి 151వ సినిమా. అయితే చాలా గ్యాప్ త‌రువాత చిరంజీవి ఖైదీ నంబ‌ర్ 150 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఇప్పుడు అచ్చ‌మైన తెలుగు క‌థ‌, ఒక యోధుని పాత్ర‌లో ఆయ‌న ద‌ర్శ‌న‌మిస్తుండ‌డంతో ఈ సినిమాపై అంద‌రిలోనూ అంచ‌నాలు భారీగానే పెరిగాయి. వ‌చ్చే ఏడాది వేస‌విలో ఈ సినిమా విడుద‌ల‌య్యేందుకు చాన్స్ ఉండ‌గా, ఇప్పుడీ సినిమాకు చెందిన టాపిక్ ఏదైనా సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చల్ చేస్తోంది. ప్ర‌ధానంగా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి గాథ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. ఆయ‌న గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. అందుకే ఈ క‌థ‌నం.. మీ కోసం..!

క‌ర్నూలు జిల్లా ఉయ్యాల‌వాడ గ్రామంలో న‌ర‌సింహారెడ్డి జ‌న్మించాడు. ఈయ‌న తండ్రి పేరు పెద మ‌ల్లారెడ్డి. తాత జ‌య‌రామిరెడ్డి. అయితే న‌ర‌సింహారెడ్డి తండ్రి, తాత బ్రిటిష్ వారి కింద పాలెగాళ్లుగా ప‌నిచేశారు. వీరికింద కొన్ని గ్రామాలు ఉండేవి. వీరు ప్రజలకు రక్షణ కల్పించడం, పన్నులు వసూలు చేయడం, శాంతి భద్రతలను కాపాడటం, స్ధానిక న్యాయపాలన తదితర అధికారాలు కలిగివుండేవారు. అంతేకాకుండా ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను (డ్యామ్‌ల నిర్మాణం, వ్యవసాయంలో సాయం తదితరాలు) కూడా చేపట్టేవారు. అయితే బ్రిటిషు ప్రభుత్వం పాలెగాళ్లుగా ప‌నిచేస్తున్న వారి ఆస్తులు, మాన్యాలపై కన్నేసి, వాటిని ఆక్రమించుకునే ఉద్దేశంతో, వారి అధికారాలకు కోత విధిస్తూ పాలెగాళ్ళ వ్యవస్థను రద్దుచేసి, వారికి నెలవారీ భరణాలను ఏర్పాటు చేసింది. ఈ క్ర‌మంలోనే న‌ర‌సింహారెడ్డికి కూడా నెలకు 11 రూపాయల, 10 అణాల, 8 పైసలు భరణంగా వచ్చేది. అయితే అనుకోకుండా ఆ భ‌రణాన్ని కూడా అత‌నికి బ్రిటిష్ అధికారులు రాకుండా చేస్తారు.

దీంతో ఉయ్యాల‌వాడ త‌న అనుచరున్ని భ‌ర‌ణం కోసం త‌హ‌సీల్దార్ వ‌ద్ద‌కు పంపుతాడు. అప్పుడు ఆ త‌హ‌సీల్దార్ చాలా చుల‌క‌న‌గా మాట్లాడుతూ భ‌ర‌ణం కావాలంటే న‌ర‌సింహారెడ్డినే ర‌మ్మ‌న‌మ‌ని చెబుతాడు. దీంతో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి ఆగ్ర‌హం వ్యక్తం చేస్తాడు. అప్పుడే తిరుగుబాటు మొద‌ల‌వుతుంది. అలా 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడిగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిలిచారు. ఈ క్రమంలోనే ఆయ‌న 1846 జూలై 10వ తేదీన‌ 500 మంది బోయ సైన్యంతో కోయిలకుంట్ల ఖజానాపై దాడిచేసి, సిబ్బందిని చంపి, ఖజానాలోని 805 రూపాయల, 10 అణాల, 4 పైసలను దోచుకుంటాడు. ప్రొద్దుటూరు సమీపంలోని దువ్వూరు ఖజానాను కూడా దోచుకుంటాడు. బ్రిటిషు ప్రభుత్వం రెడ్డిని పట్టుకోవడానికి సైన్యాన్ని దింపుతుంది. కెప్టెన్ నాట్, కెప్టెన్ వాట్సన్‌ల నాయకత్వాల్లో వచ్చిన దళాలు రెడ్డిని పట్టుకోలేక వెనుదిరుగుతాయి. దీంతో రెడ్డిని పట్టి ఇచ్చిన వారికి అప్ప‌ట్లోనే రూ.1,000 బ‌హుమానాన్ని బ్రిటిష్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తుంది.

ఆ త‌రువాత తరువాత జూలై 23న తేదీన కెప్టెన్ వాట్సన్ నాయకత్వంలో వచ్చి గిద్దలూరు వద్ద విడిది చేసి ఉండగా, అర్ధరాత్రి రెడ్డి తన సైన్యంతో విరుచుకుపడి బ్రిటిషు సైన్యాన్ని పారదోలుతాడు. దీంతో బ్రిటిష్ సైనికులు నరసింహారెడ్డి కుటుంబాన్ని పట్టుకుని కడపలో ఖైదు చేస్తారు. ఈ క్ర‌మంలో త‌న కుటుంబ స‌భ్యుల‌ను విడిపించుకునేందుకు కడప చేరుతాడు న‌ర‌సింహారెడ్డి. అలా అత‌ను 1846 అక్టోబర్ 6న నల్లమల కొండల్లోని పేరుసోమల వద్ద గల జగన్నాథాలయం చేరుకుంటాడు. ఈ స‌మాచారం తెలుసుకున్న కడప యాక్టింగ్ కలెక్టర్ కాక్రేన్ సైన్యంతో ముట్టడించి రెడ్డిని బంధిస్తాడు. ఈ క్ర‌మంలో నరసింహారెడ్డితో పాటు 901 మందిపై కేసు పెడ‌తారు. అయితే వీరిలో 412 మందిపై నేరం రుజువు కాదు. 273 మందిని పూచీకత్తుపై వదిలిపెడ‌తారు. మ‌రో 112 మందికి 14 నెల‌ల‌ నుంచి 5 ఏళ్ళ దాకా శిక్షలు పడ‌తాయి. కొందరికి ద్వీపాంతర శిక్ష కూడా ప‌డుతుంది.

కాగా కడప స్పెషల్ కమిషనర్ కేసు విచారణ జరిపి, నరసింహారెడ్డి ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడమేకాక, హత్యలకు, దోపిడీలకు, పాల్పడినట్లు తీర్పు చెబుతూ, ఉరిశిక్ష విధిస్తాడు. 1847 ఫిబ్రవరి 22న ఉదయం 7 గంటలకు జుర్రేటి వద్ద ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా ఉరితీస్తుంది బ్రిటిషు ప్రభుత్వం. అంత‌టితో ఆగ‌క విప్లవకారులని భయభ్రాంతులను చేయడానికి, ఇలాంటి వారు త‌యారు కాకుండా ఉండాల‌నే నెపంతో నరసింహారెడ్డి తలను 1877 దాకా కోయిలకుంట్ల కోటలో ఉరికొయ్యకు వ్రేలాడదీసే ఉంచుతారు. అలా ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి త‌ల 30 ఏళ్ల పాటు వేలాడుతూనే ఉంటుంది.

అయితే ఉయ్యాల వాడ న‌రసింహారెడ్డి క‌థ ఇదే అయినా సినిమా స్టోరీలో మాత్రం కొన్ని మార్పులు, చేర్పులు చేసిన‌ట్టు తెలిసింది. మ‌రి అవి ఏంటో తెలుసుకోవాలంటే సినిమా వ‌చ్చే వ‌ర‌కు ఆగాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top