అప్పుడామెకు 20 సంవత్సరాలు. అదే ఏట ఆమెకు పెళ్లయింది. భర్త వెంట కర్ణాటక వెళ్లింది. కొత్త ప్రాంతం. కొత్త భాష. అంతా కొత్త. ఎవరూ తెలియదు. ఆమె తన పెళ్లి వల్ల గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయింది. తరువాత ఏడాది చేద్దామనుకున్నా అత్త అనారోగ్యం కారణంగా వీలు పడలేదు. తరువాత ఏడాది గ్రాడ్యుయేషన్ పూర్తి చేద్దామనుకుంటే కూతురు జన్మించింది. తరువాత కొంత గ్యాప్ వచ్చినా ఎట్టకేలకు ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. మంచి మార్కులు సాధించింది. అప్పటికి ఆమెకు 25 ఏళ్లు. రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె అత్త చనిపోయింది.
మరో రెండు సంవత్సరాలకు మామ కూడా చనిపోయాడు. అప్పుడామెకు 29 ఏళ్లు. సరిగ్గా భర్త చనిపోవడానికి 7 రోజుల ముందు ఆమెకు మూడో బిడ్డ జన్మించింది. అప్పుడు ఆమెకు కష్టాలు రెట్టింపయ్యాయి. అత్తింటి వారు సహాయం చేయలేదు. అప్పుడు తన కూతురు స్కూల్ ఫీజు రూ.45 కట్టేందుకు ఆమె వద్ద డబ్బులు లేవు. అయినా ఏదో ఒక పనిచేసింది. ముగ్గురు పిల్లలతో ఒంటరిగా , ఎవరి సహాయం లేకుండా జీవించడం మొదలు పెట్టింది.
ఆమెకు అప్పుడు 30 ఏళ్లు వచ్చాయి. ఆ ఏట ఆమె బీఏ పాసైంది. మరుసటి ఏడాదికి 31 ఏళ్లు నిండాయి. బీఎడ్ పూర్తి చేసింది. ఓ స్కూల్లో టీచర్‌గా పనిచేయడం మొదలు పెట్టింది. తరువాత ఎంఏ పూర్తి చేసింది. 32వ ఏట తన సొంత రాష్ట్రం మహారాష్ట్రకు వచ్చేసింది. ముగ్గురు పిల్లలతో కలిసి కొన్ని రోజులు తల్లిదండ్రుల వద్ద ఆమె ఉన్నది. తరువాత వారిని విడిచిపెట్టి సొంతంగా ఓ ఇల్లు తీసుకుని అందులో తన పిల్లలతో జీవించడం మొదలు పెట్టింది. తరువాత 36 ఏళ్లప్పుడు ఆమె పిల్లలతో కలిసి పూణెకు మకాం మార్చింది.
పూణె లాంటి నగరంలో ముగ్గురు పిల్లలతో ఉండడమంటే మాటలు కాదు. ఎన్నో ఖర్చులు ఉంటాయి. అయినా ఆమె బెదరలేదు. ఓ వైపు టీచర్‌గా పనిచేస్తూనే మరోవైపు పిల్లలకు చక్కని విద్యను చెప్పించింది. ఆమె తన 41వ ఏట అప్పటి ఆ రాష్ట్ర మాజీ హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ చేతుల మీదుగా స్త్రీ శక్తి పురస్కారం అందుకుంది. ఈ పురస్కారం అందుకున్న మొదటి మహిళ ఆమే. ఇప్పుడామె కూతురు టాప్ యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. రెండో కుమారుడు ఇంజినీరింగ్ టాపర్ అయి ప్రముఖ కంపెనీలో విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇక చివరి కుమారుడు.. అది.. నేనే.. సీఏ ఆలిండియా లెవల్లో 14వ ర్యాంక్ సాధించా. కేపీఎంజీలో ఇంటర్న్‌షిప్ చేస్తున్నా.. ఇదీ.. నా.. మా.. అమ్మకథ..!