మ‌ద్యానికి బానిస అయిన ఆ తండ్రి మారుతాడా..? ఆ బాలిక‌లు ప్ర‌యోజ‌కులు అవుతారా..? – రియ‌ల్ స్టోరీ..!

అడుగులు త‌డ‌బ‌డుతున్నాయి. కాళ్లు చెరో దిక్కు వెళ్తున్నాయి. క‌ళ్లు బైర్లు క‌మ్ముతున్నాయి. ఎవ‌రో తోసిన‌ట్టుగా ఒక్క‌సారిగా కింద ప‌డ్డాడు అత‌ను. మ‌ళ్లీ తేరుకుని పైకి లేచే ప్ర‌య‌త్నం చేశాడు. సాధ్యం కాలేదు. అలా కొంత సేపు ఇబ్బందులు ప‌డ్డాడు. ఇంత‌లో ఓ బాలిక వ‌చ్చింది. అత‌న్ని లేవ‌దీసింది. కింద ప‌డిపోకుండా స‌పోర్ట్‌గా వెనుక నిలుచుంది. ఆమె సపోర్ట్‌తో అత‌ను న‌డుస్తున్నాడు. అయినా అడుగులు త‌డ‌బ‌డుతూనే ఉన్నాయి. ఇంత జ‌రుగుతున్నా వీరిని ఆ వీధిలో ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎవ‌రి ప‌నుల్లో వారు ఉన్నారు. స్కూళ్ల‌కు, కాలేజీల‌కు వెళ్లే విద్యార్థులు, ప‌నుల‌కు వెళ్లే కూలీలు, కార్యాల‌యాల్లో ప‌నిచేసే ఉద్యోగులు ఎవ‌రి మానాన వారు పోతున్నారు. ఉద‌యం స‌మ‌యం క‌దా, ర‌ద్దీ కార‌ణంగా లేటైతే ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంద‌నేమో… ఎవ‌రూ కూడా ఆ బాలికను, అత‌న్ని ప‌ట్టించుకోవ‌డం లేదు. అయినా ఆ బాలిక అత‌న్ని తీసుకుపోతోంది. అత‌న్ని ఇంటి దగ్గ‌ర దింపాలి క‌దా. ఇంత‌కీ ఆ బాలిక అత‌నికి ఏమ‌వుతుందో తెలుసా..? స్వయానా కూతురు.

ఉద‌యాన్నే తండ్రి తాగి ప‌డిపోవ‌డంతో అత‌న్ని వెతుక్కుంటూ హ‌ల‌మ్మ బ‌య‌ల్దేరింది. ఓ వీధిలో ప‌డిపోయిన తండ్రి లింగప్ప‌ను ఆమె ప‌ట్టుకుని ఇంటికి తీసుకువ‌చ్చింది. వారి ఇల్లు చూస్తే… నిజానికి అది ఇల్లు కాదు. నాలుగు గోడలు, పైన క‌ప్పు ఉన్నాయి, అంతే. వ‌ర్షానికి ఏ క్ష‌ణంలో అయినా కూలిపోవ‌చ్చు అన్న‌ట్టుగా ఉన్నాయి ఆ గోడలు. అన్నీ ప‌గుళ్లే. మొత్తం ఒక్క‌టే గ‌ది. అందులోనే మూల‌న వంట వండుకోవాలి. మ‌రో మూల‌న ప‌డుకోవాలి. ఇంకో మూల‌న పిల్ల‌లు చ‌దువుకోవాలి. అత‌నికి హ‌లమ్మే కాదు, మ‌రో కూతురు కూడా ఉంది. ఇద్దరు కూతుళ్లు ఆ రోజు స్కూల్‌కు వెళ్ల‌లేదు. తండ్రిని ఇంటికి తేవ‌డంలో పెద్ద కూతురు, ఇంటిని చూడ‌డంతో రెండో కూతురుకు స‌రిపోయింది.

చ‌దువు అంటే గుర్తుకు వ‌చ్చింది. హ‌ల‌మ్మ, ఆమె చెల్లెలు ఇద్ద‌రూ ప్రతిభావంతులే. వారి ఇంటి లోప‌ల గోడ‌ల‌ను చూస్తే ఎవ‌రికైనా ఆ విష‌యం ఇట్టే తెలిసిపోతుంది. ఇంగ్లిష్ భాష‌లోనైతే వారు రోజూ ఎన్నో ప‌దాల‌ను కొత్త‌గా నేర్చుకుంటూ ఉంటారు. వారు అలా చ‌ద‌వ‌డం చూసి లింగ‌ప్ప సంతోషంగా ఫీల‌వుతాడు. తాను తాగుబోతునే, కానీ త‌న కూతుళ్ల‌ను మాత్రం బాగా చ‌దివిస్తానంటాడు. కూతుళ్లేమో అది అయ్యే ప‌నేనా అన్న‌ట్టు చూస్తారు. తండ్రిని మార్చ‌డం కోసం వారు గోడ‌ల నిండా క‌న్న‌డ‌లో ఏవో రాస్తారు. వాటిని చ‌దివి అయినా తండ్రి బాగు ప‌డ‌తాడేమో, మ‌ద్యం బానిస నుంచి విముక్తుడు అవుతాడేమో అని వారి ఆశ‌. ఆ ఆశ తీరుతుందా..? వారు చ‌దువుకుని ప్ర‌యోజ‌కులు అవుతారా..? లింగ‌ప్ప అన్న మాట‌ల‌ను నిల‌బెట్టుకుంటాడా..? కాల‌మే చెప్పాలిక‌..!

— క‌ర్ణాట‌కకు చెందిన ఓ కుటుంబంలోని ఇద్ద‌రు బాలిక‌లు ప‌డుతున్న వేద‌న‌కు అక్ష‌ర రూప‌మే పైన క‌థ‌. ఇది రియ‌ల్ స్టోరీ. క‌ల్పితం కాదు..!

Comments

comments

Share this post

scroll to top