ఆ హాస్పిటల్ లో రోగులకు జ్యోతిష్యం, వాస్తు స‌ల‌హాలు ఇస్తార‌ట‌.! ఎందుకో తెలుసా..?

మ‌న‌కు ద‌గ్గు, జ్వ‌రం, జ‌లుబు వంటి రోగాలు వ‌స్తే ఎక్క‌డికి వెళ్తాం. వైద్యుని వ‌ద్ద‌కే క‌దా వెళ్లి చికిత్స చేయించుకునేది..! అంతేకానీ జ్యోతిష్యుని వ‌ద్ద‌కు వెళ్లం క‌దా. అదేంటీ… ఎవ‌రైనా సుస్తీ చేస్తే డాక్ట‌ర్ వ‌ద్ద‌కే వెళ్తారు. జ్యోతిషుని వ‌ద్ద‌కు ఎందుకు వెళ్తారు..? అని అడ‌గ‌బోతున్నారా…! అవును, అయితే మీరు విన్న‌ది క‌రెక్టే. కానీ… నిజంగా అలాగా చేయాల‌ట‌. ఇది మేం చెబుతున్న‌ది కాదు, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం తాజాగా చేస్తున్న ఆలోచ‌న ఇది. ఇక‌పై అక్క‌డి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో సేవ‌లు అందించేందుకు వైద్యులే కాదు, జ్యోతిష్యులు, వాస్తు శాస్త్ర పండితుల‌ను కూడా నియ‌మిస్తార‌ట‌.

షాకింగ్‌గా ఉన్నా ఇప్పుడీ విష‌యం అక్క‌డ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో ఉన్న రెడ్‌క్రాస్ బిల్డింగ్ వ‌ద్ద ఓ యోగా సెంట‌ర్‌ను ఏర్పాటు చేసింది అక్క‌డి ప్ర‌భుత్వం. అక్క‌డి మ‌హ‌ర్షి ప‌తంజ‌లి సాన్‌స్ర్కిట్ సంస్థాన్ (ఎంపీఎస్ఎస్‌) ఆధ్వ‌ర్యంలో ఈ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉన్న ఓ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి ఈ సెంట‌ర్‌ను లింక్ చేశారు. దీంతో ఆస్ప‌త్రిలో చూపించుకున్న వారికి యోగా సెంట‌ర్‌లో ఉండే వారు యోగాపై సూచ‌న‌లు చేస్తారు. వారికి ఉన్న రోగాల‌ను బ‌ట్టి ఏయే యోగా ఆస‌నాలు వేయాలో చెబుతారు. ఇది ఇప్పుడు అక్క‌డ సత్ఫ‌లితాల‌ను ఇస్తున్న‌ద‌ట‌. అందుకే ఇలాంటి సెంట‌ర్‌ల‌ను నేరుగా ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లోనే ఏర్పాటు చేయాల‌ని భావిస్తుంది అక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వం.

అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. యోగాపై సైంటిస్టులే అధ్య‌య‌నాలు చేసి చెప్పారు కూడా, దాంతో ఆరోగ్యానికి మంచి జ‌రుగుతుంద‌ని అన్నారు. ఈ క్ర‌మంలో ఆస్ప‌త్రుల్లో ఇలా యోగా గురించి అవ‌గాహ‌న క‌ల్పించ‌డం స‌బబే. అయితే ప్ర‌భుత్వం ఇంకాస్త ముంద‌డుగు వేసి యోగా సెంట‌ర్‌ల‌తోపాటు ఆస్ట్రాల‌జీ, వాస్తు సెంట‌ర్‌ల‌ను కూడా ఏర్పాటు చేసి వాటిల్లో పండితుల‌ను పెట్ట‌నుంద‌ట‌. దీంతో వారు ప్ర‌భుత్వ హాస్పిట‌ల్స్‌కు వ‌చ్చే పేషెంట్ల‌కు జ్యోతిష్యం, వాస్తు ప‌రంగా స‌ల‌హాలు ఇస్తార‌ట‌. దీని గురించి మ‌హ‌ర్షి ప‌తంజ‌లి సాన్‌స్ర్కిట్ సంస్థాన్ ప్ర‌తినిధి ఒక‌రు తాజాగా ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఏమ‌న్నారంటే… త‌మ సంస్థ ఆధ్వ‌ర్యంలో మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో ఉన్న ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో ఆస్ట్రాల‌జీ, వాస్తు సెంట‌ర్‌ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని, వాటిల్లో ఔత్సాహిక యువ‌త‌కు జ్యోతిష్యం, వాస్తుల‌లో శిక్ష‌ణ‌నిచ్చి సర్టిఫికెట్ల‌ను అంద‌జేస్తామ‌ని, వారు త‌మ శిక్ష‌ణా కాలంలో స‌ద‌రు హాస్పిట‌ల్స్‌లో రోగుల‌కు జ్యోతిష్య‌, వాస్తు స‌ల‌హాల‌ను తెలియ‌జేస్తార‌ని… అన్నారు.

అయితే ఈ విష‌యంపై అక్క‌డి ఆరోగ్య శాఖ మంత్రి రుస్త‌మ్ సింగ్ స్పందించారు. ఈ వార్త‌ల‌న్నీ పుకార్లేన‌ని కొట్టి పారేశారు. యోగా సెంట‌ర్ స‌త్ఫ‌లితాల‌ను ఇస్తున్నందున అలాంటి సెంట‌ర్‌ల‌ను మాత్ర‌మే ఏర్పాటు చేయాల‌ని ఆలోచిస్తున్నామ‌ని, కానీ ఆస్ట్రాల‌జీ, వాస్తు సెంట‌ర్‌ల‌ను ఏర్పాటు చేయ‌బోవ‌డం లేద‌ని వివ‌ర‌ణ ఇచ్చారు. అవును మ‌రి… యోగా వ‌ర‌కు అయితే ఓకే కానీ… ఇలాంటి సైన్స్ ప‌రంగా రుజువు కాని జ్యోతిష్యం, వాస్తుల‌లో రోగుల‌కు స‌ల‌హాలు ఇవ్వ‌డ‌మేంటి, మ‌రీ చోద్యం కాక‌పోతే..!

Comments

comments

Share this post

scroll to top