అట్ట‌డుగు నుంచి అంత‌ర్జాతీయ స్థాయి దాకా – బ‌తుకును గెలిచిన విజేత..!

అన్నీ కోల్పోయిన చోట అద్భుతం జ‌రుగుతుంద‌ని అనుకుంటామా. గుండెల్లో గున‌పాలు గుచ్చుతున్నా..కాలం ప‌రీక్ష‌కు గురి చేసినా..క‌ష్టాలు వెన్నంటి ఉన్నా..ఆత్మ స్థ‌యిర్యం కోల్పోలేదు. వెయిట‌ర్‌గా ప్రారంభ‌మైన అత‌డి జీవితం ..అట్ట‌డుగు స్థాయి నుండి ఎవ‌రూ అందుకోలేనంత అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించిన ఘ‌న‌త శ్రీ‌ధ‌ర్ బెవ‌రాదే. ఉప్పెనను త‌ట్టుకుని..సుడిగుండాల‌ను దాటుకుని గెలుపు తీరాల‌ను ముద్దాడిన అత‌డితో మాట్లాడ‌ట‌మంటే మ‌న‌ల్ని మ‌నం పోగేసుకోవ‌డం..మ‌న‌ల్ని మ‌నం ప్రేమించుకోవ‌డం అన్న‌మాట‌. ధ‌ర్మ‌బ‌ద్ధ‌మైన జీవితం..విలువలు కోల్పోని వ్య‌క్తిత్వం అత‌డిని ప్ర‌పంచం మెచ్చుకునేలా చేసింది. వ‌ర‌ల్డ్‌లోనే అత్యుత్త‌మ‌మైన బ్రాండ్‌గా పేరున్న పానాసానిక్ కంపెనీలో ప్ర‌ధాన భూమిక‌ను పోషించే స్థాయికి ఎలా చేరుకున్నాడు. ఇన్నేళ్ల ప్ర‌స్థానంలో ఎలాంటి అనుభ‌వాల‌ను ఆయ‌న పొందారు.

అర్ధాక‌లితో అల‌మ‌టించినా చెక్కు చెద‌ర‌ని విశ్వాసంతో తాను అనుకున్న ల‌క్ష్యాన్ని అధిగమించ‌డంలో శ్రీ‌ధ‌ర్ అనుస‌రించిన విధానాలు ఏమిటి..? కోట్లాది ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే శ‌క్తివంత‌మైన మెంటార్స్‌ల‌లో ఆయ‌న ఒక‌డిగా ఎలా చేరి పోయాడు. ఏ మాత్రం అవ‌కాశాలు లేని ప‌రిస్థితుల్లో తానే ఆయుధ‌మై అనుకున్న గ‌మ్యాన్ని ఎలా చేరుకున్నాడు. ఎన్నో అనుభ‌వాలు..మ‌రెన్నో క‌ష్టాల‌ను చ‌వి చూసిన ఈ అరుదైన ..అద్భుత‌మైన వ్య‌క్తి ..వ్య‌వ‌స్థ‌గా ఎలా మారాడు. సంస్థ‌ల‌ను..గ‌మ్య తీరాలకు చేర్చ‌డంలో కీల‌క పాత్ర ఎలా పోషిస్తున్నారు. అద్భుత‌మైన శ‌క్తులు ఉన్నాయా లేక స్వంతంగా త‌నను తాను మ‌ల్చుకున్నారా..వీట‌న్నింటి గురించి తెలుసు కోవాలంటే ఏడాది ప‌డుతుంది. మేనేజ్‌మెంట్ గురుగా, మెంటార్‌గా, క‌విగా, ర‌చ‌యిత‌గా, పుస్త‌క పురుగుగా, నాయ‌క‌త్వ నైపుణ్యాల‌ను అందించే టీం లీడ‌ర్‌గా, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా ఇలా ప్ర‌తి ఫార్మాట్‌ల‌లో అత్యున్న‌త‌మైన స్థానాన్ని ఎలా అందుకున్నారో శ్రీ‌ధ‌ర్‌ను చూస్తే తెలుస్తుంది.

ఒక‌ప్పుడు కాలే క‌డుపుతో పేవ్‌మెంట్‌ల మీద నిద్ర పోయిన కుర్రాడు..ప్ర‌పంచాన్ని విస్మ‌య ప‌రిచేలా చేస్తున్న ఇండియ‌న్ ఐఐటీ సంస్థ‌ల్లో కుర్రాళ్ల‌కు ..ఐటీ ఎక్స్ ప‌ర్ట్స్‌కు, టెక్కీల‌కు పాఠాలు బోధించే స్థాయికి ఎలా చేరుకున్నాడు. చ‌దువుకునేందుకు ఇబ్బందులు ప‌డ్డ ఈ వ్య‌క్తిత్వ వికాస నిపుణుడు ల‌క్ష‌లాది మందిని క‌ద‌ల‌నీయ‌కుండా ఎలా చేస్తున్నాడు. ఎలాంటి టెక్నిక్స్‌ను త‌యారు చేశాడు. దిగ్గ‌జ కంపెనీలు అత‌డినే ఎందుకు ఎంచుకుంటున్నాయి. ఇదంతా తెలుగువాడైన శ్రీ‌ధ‌ర్ గురించే. గెలుపు అంటే గ‌మ్యాన్ని చేరుకోవ‌డం. విజ‌యం అంటే ల‌క్ష్యం వైపుగా ప‌య‌నించ‌డం. ప్ర‌తి ఒక్క‌రు స‌క్సెస్‌ను కోరుకుంటారు. కొంద‌రే దాని కోసం పాటు ప‌డ‌తారు. పుస్త‌కాలు చ‌దివేందుకు డ‌బ్బుల కోసం వేచి చూసిన శ్రీ‌ధ‌ర్..అంత‌ర్జాతీయ స్థాయిలో పేరొందిన పుస్త‌క ర‌చ‌యిత‌గా ఎలా మారారు. జీవితాన్ని మ‌రింత అర్థ‌వంతంగా ..అద్భుతంగా ఎలా మ‌లుచు కోవ‌చ్చో ఆయ‌న‌ను చూసి నేర్చుకోవ‌చ్చు.

ల‌క్ష‌లాది మందిని ప్ర‌భావితం చేస్తూ..నిరాశ‌లో ఉన్న‌ప్పుడు వెలుగులు పంచుతున్న మ‌హాక‌వి శ్రీ‌శ్రీ రాసిన మ‌హాప్ర‌స్థానం అంటే పంచ ప్రాణం. ఒక చోట కూర్చుంటే ఏం వ‌స్తుంది..ప్ర‌యాణం చేస్తే ఎన్నో నేర్చుకోగ‌లుగుతాం అంటారు ఓ సంద‌ర్భంలో. వ్య‌క్తుల కంటే వ్య‌వ‌స్థ గొప్ప‌ద‌ని న‌మ్మే శ్రీ‌ధ‌ర్ ..ప‌డ‌రాని పాట్లు ప‌డ్డారు. క‌ష్టాల‌ను చ‌వి చూశారు. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేనకు స‌లహాదారుగా, థింక్ టాంక్ లో స‌భ్యుడిగా ఉన్నారు. ఆయ‌న రాసిన పుస్త‌కం రెండోసారి ముద్ర‌ణ‌కు నోచుకున్న‌ది. బెస్ట్ సెల్ల‌ర్‌గా రికార్డు సృష్టించింది. నాయ‌క‌త్వ నైపుణ్యం, భ‌విష్య‌త్‌లో దిశా నిర్దేశం చేసే దిశ‌గా ..ఆంట్ర‌ప్రెన్యూర్‌గా వంద‌లాది వ‌ర్క్ షాప్‌లు, స‌మావేశాల‌లో స్పీచెస్‌తో పాటు టీచింగ్ చేస్తారు. జ‌ర్నీలో భాగంగా ఫ్ల‌యిట్‌లో అనుకోకుండా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌లుసుకున్నారు. ఆ సంద‌ర్భంలో ఓ పుస్త‌కాన్ని ప్ర‌జెంట్ చేశారు. యాక్ట్ ఆఫ్ డినైడ్ పుస్త‌కాన్ని ఇచ్చారు. తన లాగే ప‌వ‌న్ కూడా పుస్త‌కాల పురుగు అని తెలుసుకుని ..చ‌ద‌వండి అని సూచించారు. ఇదే స‌మ‌యంలో ఈ బుక్‌లో ఏముంద‌ని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

జ‌ప‌నీస్ సంస్థ పానాసానిక్ కంపెనీలో దుబాయి కేంద్రంగా ప‌నిచేస్తున్నారు. పాపుల‌ర్ బ్రాండ్ గా ఇప్ప‌టికే పేరుంది. విజ‌య‌న‌గ‌రం జిల్లా అయితే విశాఖ‌లో నివాసం. వృత్తి రీత్యా ఎన్నో దేశాలు ప‌ర్య‌టించారు. క‌ళ్యాణ్ నుండి శ్రీ‌ధ‌ర్‌కు ఫోన్ వ‌చ్చింది. దీనిని న‌మ్మ‌లేక పోయారు. విజ‌య‌వాడ‌లో గంట పాటు ఇద్ద‌రూ మాట్లాడుకున్నారు. ఆయ‌న ఆలోచ‌న‌లు..శ్రీ‌ధ‌ర్ అనుభ‌వాలు ఒక్క‌టి కావ‌డంతో ప‌వ‌న్‌తో క‌లిసి ప్ర‌యాణం చేసేందుకు సిద్ధ‌ప‌డ్డారు. నాయ‌క‌త్వ నైపుణ్యంతో, పొలిటిక‌ల్ లీడ‌ర్ షిప్ పై శిక్ష‌ణ ఇవ్వాల‌ని కోరడంతో ఒప్పుకున్నారు. ఆయ‌న జీవితంలో ఇది మ‌రిచి పోలేని జ్ఞాప‌కం. రాజ‌కీయాలు అవినీతికి కేరాఫ్ గా మారాయి. గొప్ప గొప్ప విజ‌యాలు అందుకున్న వారంతా ఏదో ఒక రోజు క‌న్నీళ్ల‌ను దాటి వ‌చ్చిన వారేనంటారు. వ‌ర‌ల్డ్ వైడ్‌గా మోస్ట్ స‌క్సెస్ ఫుల్ ట్రైన‌ర్‌గా, మెంటార్‌గా పేరు తెచ్చుకున్న శ్రీ‌ధ‌ర్ అంచెలంచెలుగా ఎలా ఎదిగారో ఒక పాఠంగా మిగిలి పోతుంది. ఒక‌నాడు కాసుల కోసం క‌ష్టాలు ప‌డిన ఆయ‌న ..త‌ల్చుకుంటే చాలు ఎన్నో కంపెనీలు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తాయి. డాల‌ర్ల వ‌ర్షం కురిపిస్తాయి.

భ‌విష్య‌త్ ప‌ట్ల సానుకూల దృక్ఫ‌థం అన్న‌ది లేక పోతే ప్ర‌తిదీ మ‌న‌కు క‌ష్టం అని పిస్తుంది. దానిని సాధించ‌లేమోన‌న్న భ‌యం ప‌ట్టుకుంటుంది. గ‌మ్యం గొప్ప‌దైతే..బ‌తుకు ప్ర‌యాణంగా మారితే..కాలాన్ని గుర్తించి ఒడిసి ప‌ట్టుకోగ‌లిగితే ..కొండ‌ల్ని పిండి చేయొచ్చు..ఆకాశాన్ని అందుకోవ‌చ్చు. ఉరికించి..ప‌రుగులు పెట్టించే స‌క్సెస్‌ను చేజిక్కించుకోవ‌చ్చు. ఇదంతా ఒక్క రోజులో వ‌చ్చేది కాదంటారు. క‌ష్ట‌ప‌డుతూనే ఉండాలి. అలుపున్న‌ది ప‌ల‌క‌రించే దాకా. ప్ర‌తిసారి ఓట‌మే ప‌ల‌క‌రిస్తుంది. అయినా వెనుతిరిగి చూడాల్సిన ప‌నిలేదు. అప‌జ‌యం ఇచ్చే అనుభ‌వం..అనుభూతి విజ‌యంలో ఉండ‌దు. ఆ అనుభ‌వాలు నేర్పిన పాఠాలే మ‌న‌ల్ని మ‌నుషులుగా ఆలోచింప చేసేలా చేస్తాయి. ఇదంతా నేర్చుకుంటే వ‌స్తుంది. ఇంకొక‌రు చెబితే రాదంటారు. మేమంద‌రం గైడ‌ర్స్ మాత్ర‌మే. పోరాడాల్సింది..ల‌క్ష్యాన్ని చేరుకోవాల్సింది మాత్రం మీరే. ఇత‌రుల విజ‌యాలు ..గెలుపులు ..అనుభ‌వాలు స్ఫూర్తిని క‌లిగించ వ‌చ్చు..కాని కొద్ది సేపే..కానీ మ‌న‌కు మ‌నం సాధించిన స‌క్సెస్ మాత్రం ఎన‌లేని కిక్కు ఇస్తుందంటారు శ్రీ‌ధ‌ర్.

ఇప్ప‌టికే ఆశ్చ‌ర్యం అనిపిస్తుంది. శ్రీ‌ధ‌ర్ అంద‌రిలాగా ఆలోచించి వుండివుంటే ఆయ‌నో సాధార‌ణ‌మైన వ్య‌క్తిగానే ఉండి పోయేవారు. కానీ భిన్నంగా ఆలోచించారు. త‌న‌ను తాను మ‌ల్చుకున్నారు. వేలాది మందిలో నిరాశా నిస్ఫృహలు రానీయ‌కుండా విజ‌య తీరాల‌ను చేరుకునేలా చేస్తున్నారు. తండ్రిని పోగొట్టుకున్న ఆయ‌న ఎప్పుడూ..ఎల్ల‌ప్పుడూ కుటుంబంతోనే ఉన్నారు. ప్రాణం పోసే క‌న్న‌వారే మొద‌టి గురువులు. వారు లేకుండా ఎలా ..ఏదైనా అందుకుంటామా అని ప్ర‌శ్నిస్తారు. అన్న‌య్య తోడ్పాటు..త‌న‌కు తానుగా ఏర్పాటు చేసుకున్న మెట్లు..ఇవ్వ‌న్నీ త‌న‌కు ప్రేర‌ణ‌గా నిలుస్తాయంటారు. స‌మున్న‌త ల‌క్ష్యం కోసం సాగిపోతున్న ప‌వ‌ర్ స్టార్ టీంలో ఒక‌డిగా ఉండ‌డం కూడా సంతృప్తిని ఇస్తుందంటారు. పుస్త‌కాలు మ‌నుషుల్ని చేస్తాయి. ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తాయి. వ్య‌క్తుల‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మే కాకుండా త‌మ‌ను తాము తెలుసుకునేలా మార్గ‌నిర్దేశ‌నం దిశ‌గా ప్రేర‌ణనిస్తాయంటారు.

బ‌తుకు జ‌ర్నీలో హిందూ ప‌త్రిక‌లో ప‌నిచేసిన అనుభ‌వం ఆయ‌న‌ను ఇంట‌ర్నేష‌న‌ల్ రైట‌ర్‌గా మారేందుకు దోహ‌ద ప‌డింది. అమెజాన్‌లో ఇప్ప‌టికీ బెస్ట్ సెల్ల‌ర్‌గా రికార్డుకు ఎక్కింది. ఎంద‌రో మ‌హానుభావులు మ‌న మ‌ధ్య‌నే ఉన్నారు. కానీ వాళ్ల‌ను మ‌నం గుర్తించం. వారి గురించి ప‌ట్టించుకోం. సాధార‌ణ మ‌నుషుల‌కంటే అసాధార‌ణ‌మైన విజ‌యాల‌ను స్వంతం చేసుకున్న విజేత‌ల‌తో క‌ల‌వ‌డం..మాట్లాడ‌ట‌మంటే రెండు త‌రాల మ‌నుష‌ల‌తో మాట్లాడిన‌ట్టు. వాళ్ల అనుభ‌వాల తాలూకు జ్ఞాప‌కాల‌ను తోడేసుకున్న‌ట్టు. అట్ట‌డుగు నుండి అంతర్జాతీయ స్థాయికి చేరుకున్న శ్రీ‌ధ‌ర్ బెవ‌రా..రాబోయే రోజుల్లో మ‌రిన్ని విజ‌యాలు అందుకోవాలి. తెలుగు వారి స‌త్తా ఏమిటో ప్ర‌పంచానికి మ‌రోసారి రుచి చూపించాలి.

గెలుపంటే గ‌తాన్ని అర్థం చేసుకోవ‌డం..భ‌విష్య‌త్‌కు బాట‌లు వేయ‌డం అన్న క‌వి మాట‌లు శ్రీ‌ధ‌ర్ కు స‌రిపోతాయి. మ‌నుష‌ల ప‌ట్ల అచంచ‌ల‌మైన ప్రేమ‌. స‌మాజం ప‌ట్ల నైతిక బాధ్య‌త‌..కుటంబ బాంధ‌వ్యాల ప‌ట్ల మమ‌కారం..స‌డ‌ల‌ని ధైర్యం..మొక్క‌వోని ఆత్మ‌విశ్వాసం ..క‌లిగిన ఈ స‌క్సెస్‌ఫుల్ ఇంట‌ర్నేష‌న‌ల్ మోటివేట్ స్పీక‌ర్..ట్రైన‌ర్..మెంటార్ త‌న రికార్డుల‌ను తానే అధిగ‌మించాల‌ని కోరుకుందాం. ప‌ల్లెటూరు నుండి ప్ర‌పంచం మెచ్చిన శ్రీ‌ధ‌ర్ గురించి ..రాబోయే త‌రాలు తెలుసుకునేలా ఏపీ ప్ర‌భుత్వం పాఠ్యాంశాల‌లో ఓ పాఠంగా చేర్చితే కొంత మేలు జ‌రిగే అవ‌కాశం ఉంది.

Comments

comments

Share this post

scroll to top