హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసుల‌కు స్పెష‌ల్ జాకెట్ల పంపిణీ… వాటితో కూల్ కూల్‌గా విధులు నిర్వ‌హించ‌వ‌చ్చు తెలుసా..?

ఎండ‌లు మండిపోతున్నాయి. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల ఉష్ణోగ్ర‌త‌లు దాదాపుగా 50 డిగ్రీల వ‌ర‌కు వ‌చ్చేశాయి. దీంతో చాలా మంది జ‌నాలు బ‌య‌టికి రావాలంటేనే జంకుతున్నారు. ఉద్యోగులైతే ఉద‌యం ఆఫీసుల‌కి వెళితే సాయంత్రం అయ్యాక గానీ బ‌య‌ట‌కు రావ‌డం లేదు. సాధార‌ణ జ‌నాలు ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌వుతున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం బ‌య‌టే ఎండ‌లోనే ప‌నిచేసే వారి బాధ‌లు వ‌ర్ణ‌నాతీతం. వారు ప‌డుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా రోజంతా ఎండ‌లో ఉండి విధులు నిర్వ‌హించే ట్రాఫిక్ పోలీసుల‌కు ఎండ‌లు చుక్క‌లు చూపిస్తున్నాయి. అయితే వారికి కొంత ఉప‌శ‌మ‌నం క‌లిగేందుకు గాను కొత్త త‌ర‌హా జాకెట్ల‌ను త‌యారు చేశారు. వాటి స్పెషాలిటీ ఏంటంటే…

హైద‌రాబాద్ న‌గ‌రంలో పనిచేస్తున్న ట్రాఫిక్ పోలీసుల సౌక‌ర్యార్థం, వారికి ఎండ‌ల నుంచి కొంత‌లో కొంత ఉప‌శ‌మ‌నం ల‌భించేందుకు ఏషియ‌న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ వారు ఈ మ‌ధ్యే కొత్త త‌ర‌హా జాకెట్ల‌ను ఉచితంగా అంద‌జేశారు. వారు కార్పొరేట్ సామాజిక బాధ్య‌త దృష్ట్యా మొత్తం 200 జాకెట్ల‌ను ట్రాఫిక్ పోలీసుల‌కు ఇచ్చారు. వాటి స్పెషాలిటీ ఏంటంటే.. నీటిలో వాటిని త‌డిపి వేసుకుంటే చాలు, బ‌య‌ట ఉన్న ఉష్ణోగ్ర‌త క‌న్నా 6 నుంచి 12 డిగ్రీల త‌క్కువ ఉష్ణోగ్ర‌త‌ను శ‌రీరానికి ఇస్తాయి. దీంతో ఎండ‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అలా ఒక‌సారి త‌డిపి వాటిని వేసుకుంటే అవి 3 గంట‌ల‌కు పైగానే ప‌నిచేస్తాయి. స‌మ‌యం అవ‌గానే మ‌రొక‌సారి త‌డిపి వేసుకుంటే చాలు. ఇక డ్యూటీలో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అయితే ఈ జాకెట్లు త‌డిపిన‌ప్ప‌టికీ డ్రైగానే ఉంటాయి. త‌డిగా ఉండ‌వు..!

అయితే ఈ జాకెట్లు రాత్రి పూట వేసుకుంటే వాహ‌న‌దారుల‌కు పోలీసుల ఉనికి స్ప‌ష్టంగా తెలుస్తుంది. ఈ జాకెట్లు రాత్రి పూట వెలుతురు ప‌డితే మెరుస్తాయి. అందువ‌ల్ల పోలీసుల‌ను సుల‌భంగా గుర్తించ‌వ‌చ్చు. ఇక వీటిని చ‌లికాలంలోనూ భేషుగ్గా ఉప‌యోగించుకోవ‌చ్చు. కాక‌పోతే త‌డ‌ప‌కూడ‌దు. అలాగే వేసుకోవాలి. దీంతో శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. త‌ద్వారా చ‌లి నుంచి కూడా ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. అయితే ప్ర‌స్తుతం 200 మాత్ర‌మే ఈ జాకెట్లు ఉన్నా త్వ‌ర‌లోనే ఎక్కువ సంఖ్య‌లో కొనుగోలు చేస్తామ‌ని పోలీసు ఉన్న‌తాధికారులు చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఉన్న జాకెట్ల ప‌నితీరును చూశాక ఆ నిర్ణ‌యం తీసుకుంటామ‌ని అంటున్నారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఇక మండే ఎండ‌ల గురించి, వ‌ణికించే చ‌లి గురించి దిగులు చెందాల్సిన ప‌ని లేద‌ని వారు చెబుతున్నారు.

Comments

comments

Share this post

scroll to top