ఆకుప‌చ్చ‌ని గాయం ఫిదా..!

రంగుల లోకంలో వున్న‌ట్టుండి ఆశ‌ల్ని మోసుకొచ్చింది ఈ పైర‌గాలి. ఇన్నేళ్లు ఎక్క‌డున్న‌దో..ఏం చేసిందో తెలీదు. కానీ వున్న‌ట్టుండి న‌దిలా ప్ర‌వ‌హిస్తూనే లేలేత హృద‌యాల‌ను అల్లుకు పోయింది. ఎగిసిప‌డే అల‌ల్లా ..ఉల్లాసంగా..ఉత్సాహంగా తాకేసింది. ఆనాటి ప్రేమ కు స‌జీవ‌మైన‌ తార్కాణంగా నిలిచే భాగ్‌మ‌తిని త‌లుచుకునేలా చేసింది ఈ బొమ్మ‌రిల్లు. అచ్చంగా ..స్వ‌చ్ఛంగా ..మ‌న‌సు మురిపెంగా చేసేసింది ఈ కుంద‌నాల‌బొమ్మ‌..అందాల ..ప‌ద‌హార‌ణాల ముద్దుగుమ్మ‌. సాయి ప‌ల్ల‌వి కంటే భానుమ‌తి పేరే బావుంది. తెగ న‌చ్చేసింది.సినిమా చూస్తే అంతా గుర్తుంటుంది.

Sai Pallavi in Fidaa Movie

కానీ ఏం మాయ చేసేసిందో కానీ అంతా ఆమే. అంత‌టా భానుమ‌తినే. ఎంత ముద్దుగున్న‌ది. అప్పుడే జొన్న కంకుల్లా..ప‌చ్చ ప‌చ్చ‌ని నారు మ‌డుళ్లా..గంతులేసే లేగ‌దూడ‌ల్లా ..స‌ర్రుమంటూ కాటేసింది..కళ్ల‌తోనే కాదు మాట‌ల‌తో మంత్ర‌ముగ్ధుల‌ను చేసేసింది. అమెరికా మోజులో..ఇంగ్లీష్ ద‌రిద్ర‌పు ధ్యాస‌లో ప‌డిపోయిన వాళ్ల‌కు చెంప‌పెట్టు ఫిదా. అమాయ‌క‌త్వం అంటే ఏమిటో..స్వ‌చ్ఛంగా ..అర‌మ‌రిక‌లు లేకుండా మాట్లాడుకుంటే ఎంత హాయిగా వుంటుందో చూస్తే తెలుస్తుంది..

ఇంట్లో మ‌న‌మ్మాయే..ఈ అమ్మాయి. నీకేం కావాలో కోరుకో..అంటే ఇపుడు ప్ర‌తి వాకిట్లో స‌ల్లాపి చ‌ల్లి..ముగ్గులేసే ముద్దుగుమ్మ‌లు కావాలంటూ కోరుకోవ‌డం సిత్రం కాక మ‌రేమిటి. అందుకే సినిమాకున్న ప‌వ‌ర్‌. కొంద‌రు చూసి పాడైపోతారంటారు.కానీ ఫిదా చూశాక ఆ మాటను వెన‌క్కి తీసుకుంటాం. అన్నందుకు బాధ ప‌డ‌తాం. పశ్చాతాప ప‌డ‌తాం. బ్యూటీ పార్ల‌ర్ల వెంట ప‌డి..అడ్డ‌మైన రంగులు పూసుకుని తెగ హొయ‌లు ఒలికించే వారంతా త‌లొంచుకోవాల్సిన ప‌రిస్థితిని తీసుకొచ్చేసింది భానుమ‌తి.

సాయంత్రం వేళ‌ల్లో ..వెన్నెల కురిసే స‌మ‌యంలో భాగ్య‌న‌గ‌రం ర‌హ‌దారుల ప‌క్క‌న స‌ప్త వ‌ర్ణాల మేళ‌వింపైన గాజులు చేసే శ‌బ్ధంలా ..నేరుగా ..క‌త్తిలా గుచ్చుకునే చూపులు..వ‌త్తి ప‌లికే ప‌దాలు..కుర‌చ దుస్తుల‌కంటే నిండుద‌న‌మే బావుంటుంద‌ని..అదే అందాన్ని రెట్టింపు చేస్తుంద‌ని చెప్పేసింది భానుమ‌తి. సాయి ప‌ల్ల‌వి తెలంగాణ ఆర్తి గీతం..గుండె గొంతుక‌. కోటి గొంతుక‌ల స్వ‌ర‌పేటిక‌..దీనిని సినిమా అన‌లేం. ఇది మ‌ట్టి మ‌నుషుల సంస్కృతికి ద‌ర్ప‌ణం.

ఈ జాగ‌ల ఆదుకునే మ‌న‌సు దాగి ఉంట‌ది. అదే ఇపుడు తెర‌పై నిండుద‌నంగా సంత‌రించుకుంట‌ది. ప్ర‌పంచాన్ని మెస్మ‌రైజ్ చేసిన పోరాటానికి స్పూర్తిగా..అమ‌రుల త్యాగాల‌కు నిలువెత్తు సాక్షంగా నిల‌బ‌డిన తెలంగాణ‌..ఇపుడు స‌గ‌ర్వంగా త‌లెత్తుకుని నిల‌బ‌డేలా చేసింది..ఫిదా..ప్రాంతాల పేరుతో..కుల మ‌తాల‌, వ‌ర్గాల పేరుతో కొట్టుకు పోతున్న మ‌నుషుల‌ను స‌మూలంగా మార్చేసే మ‌హ‌త్త‌ర ఆయుధం..భానుమ‌తి న‌ట‌న‌.స‌హ‌జంగా..ప‌ల్లెత‌న‌పు అందాల‌ను ఇంత గొప్ప‌గా..హుందాగా..కుంచె..క‌లం..కెమెరా క‌ల‌గ‌లిసిన స‌ప్త‌వ‌ర్ణాలు క‌లిసి పోయిన బొమ్మ‌లా వుందీ బొమ్మ‌. ప‌ది కాలాల పాటు గుర్తుంచుకునేలా భానుమ‌తి వెంటాడుతుంది.

ఈ గాయం నుంచి కోలుకునేలా సాయి ప‌ల్ల‌వి మ‌నింట్లోనే ..మ‌న మ‌ధ్య‌నే వుంటుంది. ఇలాగే ఉండాలి..అలాగే గ‌ల‌గ‌లా తుంగ‌భ‌ద్ర న‌దిలా న‌వ్వాలి.. ఆటు పోట్ల‌ను త‌ట్టుకుని ..గుండెల్ని పొదివి ప‌ట్టుకుని..ప‌ల్లెత‌న‌పు హృద‌యాన్ని ఆవిష్క‌రించిన సాయిచంద్ .తండ్రిగా మెప్పించాడు. ఈ క్రెడిట్ అంతా భానుమ‌తిదే. ఆమె లేకుంటే ఈ ఫిదా లేదు. దిల్ రాజు టేస్ట్‌..శేఖ‌ర్ క‌మ్ముల అభిరుచి..వ‌రుణ్ తేజ్ అమాయ‌క‌త్వం..కెమెరామెన్ ప‌నిత‌నం..వెర‌సీ చైత‌న్య క‌లం నుంచి జాలువారిన మాట‌లు రేపిన మంట‌లు ..నిద్ర‌లో సైతం మేల్కొలిపే సంగీతం..చ‌ల్ల‌బ‌రిచేలా చేస్తున్నందుకు ..మీకంద‌రికీ మ‌రోసారి ఫిదా.

భానుమ‌తిని చూశాక త‌ల్లిదండ్రులంతా సాయి ప‌ల్ల‌వి లాంటి కూతురుంటే .ఆమె లాంటి పాప‌ను కంటే ..ఎంత బావుంటుంద‌ని అనుకోవ‌డం..ఆమె చేసిన మాయాజాలం..ఇంద్ర‌జాలం కంటే గొప్ప‌ది..కాదంట‌రా..అయితే ఇంకెందుకు ఆల‌స్యం..నిండైన వ్య‌క్తిత్వం..నిఖార్స‌యిన‌ స్వేచ్ఛ కోసం ప‌రిత‌పించి..త‌న దారిలో ముళ్లున్నా ..యుఎస్ కంటే నా ఊరే గొప్ప‌ద‌ని చాటిన భానుమ‌తి ఇపుడు ఆడ‌బిడ్డ‌ల‌కు ఆద‌ర్శం. ఫిదా చేసినందుకు మ‌మ్మ‌ల్ని గుండెల నిండా హ‌త్తుకునేలా..మ‌న‌సును దూది పింజెలా చేసేసి..గాలి ప‌తంగిలా హృద‌యం ఎగిరేలా చేసినందుకు. ఫిదా టీంకు..ప‌త్యేకించి భానుమ‌తికి ..థ్యాంక్స్‌.!

Comments

comments

Share this post

scroll to top