అత‌ను ఒక‌ప్పుడు ఒలంపిక్ మెడ‌లిస్ట్‌. ఇప్పుడు వీల్ చెయిర్లు తోస్తూ నెల‌కు రూ.5వేలు సంపాదిస్తున్నాడు..!

క్రీడాకారులంటే నిజానికి మ‌న దేశంలో ఎవ‌రికీ గౌర‌వం ఉండ‌దు. ఇక రాజ‌కీయ నాయ‌కులు అయితే వారికి వాగ్దానాలు చేస్తారు. కానీ వాటిని నెర‌వేర్చ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. దీంతో పేద క్రీడాకారులు బ‌త‌క‌డ‌మే మ‌రింత దుర్ల‌భ‌మ‌వుతుంది. అలాంటి స్థితిలో వారు దేశం త‌ర‌ఫున ఎలా ఆడ‌తారు. స‌రిగ్గా ఇదే స్థితిలో ఉన్నాడు ఓ యువ క్రీడాకారుడు. నిజానికి అత‌ను ప్ర‌త్యేక ఒలంపిక్స్‌లో భార‌త్‌కు గోల్డ్ మెడ‌ల్స్ సాధించి పెట్టాడు. కానీ ఇప్పుడు బ‌త‌క‌డ‌మే చాలా క‌ష్ట‌త‌ర‌మై పోయిన దుర్భ‌ర స్థితిలో జీవ‌నం వెళ్ల‌దీస్తున్నాడు.

అత‌ని పేరు రాజ్‌బీర్ సింగ్‌. వ‌య‌స్సు 17 సంవ‌త్స‌రాలు. పంజాబ్‌లోని లూథియానాలో నివాసం ఉంటున్నాడు. ఇత‌ను 2015లో అమెరికాలోని లాస్ ఏంజ‌ల్స్‌లో నిర్వ‌హించిన స్పెష‌ల్ ఒలంపిక్స్ వ‌ర‌ల్డ్ స‌మ్మ‌ర్ గేమ్స్‌లో భార‌త్ త‌ర‌ఫున పాల్గొన్నాడు. 1 కిలోమీట‌ర్‌, 2 కిలోమీట‌ర్ల సైక్లింగ్ ఈవెంట్ల‌లో పార్టిసిపేట్ చేశాడు. దీంతో అత‌నికి రెండు గోల్డ్ మెడ‌ల్స్ వ‌చ్చాయి. అయితే మెడ‌ల్స్ గెలిచిన సందర్భంగా అప్ప‌టి పంజాబ్ సీఎం ప్ర‌కాష్ సింగ్ బాద‌ల్ రాజ్‌బీర్‌కు రూ.16 ల‌క్ష‌ల ప్రైజ్ మ‌నీ ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ అందులో ఇప్ప‌టి వ‌ర‌కు రాజ్‌బీర్‌కు కేవ‌లం రూ.50వేలు మాత్ర‌మే అందాయ‌ని రాజ్‌బీర్ తండ్రి తెలిపాడు.

ఇక కేంద్ర ప్ర‌భుత్వం రూ.10 ల‌క్ష‌ల విలువ చేసే బాండ్ల‌ను రాజ్‌బీర్‌కు ఇచ్చింది. కానీ అవి ఇంకా మెచూర్ కాలేదు. అయితే రాజ్‌బీర్ ది చాలా పేద కుటుంబం కావ‌డంతో ఇప్పుడు అత‌ను బ‌త‌క‌డానికే చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. దీనికి తోడు కుటుంబానికి పెద్ద దిక్కు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అత‌ను ఇప్పుడు ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌లో ప‌నిచేస్తూ వీల్ చెయిర్ల‌ను తోస్తున్నాడు. వేరే ఇతర పనులు చేస్తూ నెల‌కు రూ.5వేలు మాత్ర‌మే సంపాదిస్తున్నాడు. ఓ స్వ‌చ్ఛంద సంస్థ ఇత‌నికి స‌హాయం చేయ‌డానికి ముందుకు వ‌చ్చింది, కానీ అది ఇత‌ని వైద్యానికే స‌రిపోయింది. ఈ క్ర‌మంలో ఇప్పుడు రాజ్‌బీర్ స్పందించే దాత‌ల కోసం ఎదురు చూస్తున్నాడు. మ‌రి నాయకులు ఎప్పుడు మేల్కొంటారో, ఇత‌నికి స‌హాయం ఎప్పుడు అందిస్తారో వేచి చూస్తే తెలుస్తుంది..!

 

Comments

comments

Share this post

scroll to top