రూ.3కు బ్రేక్‌ఫాస్ట్‌, రూ.5కు భోజ‌నం అందించేందుకు రెడీ అవుతున్న సీఎం యోగి ప్ర‌భుత్వం..!

మిట్ట మ‌ధ్యాహ్నం… ప‌ని కోసం తిరిగి తిరిగి అల‌సిన శ‌రీరానికి… ఆక‌ల‌వుతున్న వేళ‌… తిందామంటే జేబులో రూ.10 త‌ప్ప ఎక్కువ డ‌బ్బు ఉండ‌దు. మ‌రో వైపు భీభ‌త్స‌మైన ఆక‌లి. ఆ స‌మ‌యంలో ఎవ‌రైనా ఆద‌రించి అన్నం పెడితే అప్పుడు వారు దేవుడే అవుతారు. కేవ‌లం ప‌నికోసం వ‌చ్చిన వారే కాదు, ప‌ని చేసుకునే వారు, ప్ర‌యాణాల్లో ఉన్న వారు, పేద‌లు, పూట కూటి కోసం నోచుకోని వారు… ఇలా ఎంతో మందికి హైదరాబాద్ మ‌హాన‌గ‌రంలో జీహెచ్ఎంసీ రూ.5కే మ‌ధ్యాహ్న భోజ‌నం క‌డుపు నింపుతోంది. స‌రిగ్గా ఇలాంటి ప‌థ‌కమే త‌మిళ‌నాడులోనూ నిర్వ‌హిస్తున్నారు. అమ్మ క్యాంటీన్ పేరిట ఆ ప‌థ‌కం న‌డుస్తోంది. అయితే ఇప్పుడు అదే కోవ‌లోకి ఉత్త‌ర ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కూడా చేర‌నుంది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో త్వ‌ర‌లో చాలా త‌క్కువ ధ‌ర‌కే ఉద‌యం అల్పాహారంతోపాటు రెండు పూట‌లా భోజ‌నాన్ని అందించేందుకు అక్క‌డి సీఎం యోగి ఆధ్వ‌ర్యంలో ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. రూ.3కే బ్రేక్‌ఫాస్ట్‌, రూ.5కే భోజ‌నం అందించేలా ఓ కొత్త ప‌థ‌కాన్ని ఆయ‌న తీసుకురానున్నారు. అందుకు గాను అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను ఇప్పుడు వారు ర‌చిస్తున్నారు. అయితే ఆ ప‌థ‌కానికి సంబంధించిన గ్రౌండ్ వ‌ర్క్ అంతా ఇప్ప‌టికే పూర్తి కాగా, దానికి తుది మెరుగులు దిద్దే ప‌నిలో ప‌డ్డారు. ఆ బాధ్య‌త‌ల‌ను అక్క‌డి మంత్రులు స్వామి ప్ర‌సాద్ మౌర్య‌మ్, సురేష్ ఖ‌న్నాల‌కు సీఎం యోగి అప్ప‌గించారు.

కాగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌లో రానున్న ఈ ప‌థ‌కం మొద‌ట రాజ‌ధాని ల‌క్నోతోపాటు కాన్పూర్‌, ఘ‌జియాబాద్‌, గోర‌ఖ్‌పూర్‌ల‌లో ప్రారంభం కానుంది. ఆయా ప్రాంతాల్లో స‌బ్సిడీ క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేసి పైన చెప్పిన విధంగా బ్రేక్ ఫాస్ట్‌, భోజనంల‌ను అందించ‌నున్నారు. ఇప్ప‌టికే ఇలాంటి ప‌థ‌కం రాజస్థాన్‌లోనూ కొన‌సాగుతోంది. అక్క‌డ అధికారంలో ఉన్న‌ది కూడా బీజేపీ ప్ర‌భుత్వ‌మే. అయితే అక్క‌డ రూ.5కు బ్రేక్ ఫాస్ట్‌, రూ.8కి భోజ‌నం అందిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ప‌థ‌కాలు మ‌రిన్ని వచ్చి మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేస్తే అప్పుడు చాలా మంది బుక్కెడు బువ్వ దొరుకుతుంది. అలా చేయ‌డం ప్ర‌భుత్వాల‌కు పెద్ద క‌ష్ట‌మేమీ కాదు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top