మ‌నం తీసుకునే ప్ర‌తి రైల్వే టికెట్ మీద 43% డిస్కౌంట్ ఉంద‌ని మీకు తెలుసా?

వంట గ్యాస్ స‌బ్సిడీ తెలుసు… రైతుల‌కు ఇచ్చే స‌బ్సిడీ తెలుసు… ఇంకా ప‌లు ర‌కాల సబ్సిడీలు కూడా ఉన్నాయి. అయితే కొత్త‌గా మ‌రో స‌బ్సిడీ వ‌చ్చింది. నిజానికి ఇది కొత్త‌దేమీ కాదు, పాత‌దే. కానీ ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. అందుకే కొత్త‌ది అనాల్సి వ‌స్తోంది. ఇంత‌కీ ఆ సబ్సిడీ ఏంటో తెలుసా..? ట‌్రెయిన్ టిక్కెట్ స‌బ్సిడీ. అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. అదేంటీ… ట్రెయిన్ టిక్కెట్ స‌బ్సిడీ. కొత్త‌గా చెబుతున్నారు, కొంప‌దీసి ట్రెయిన్ టిక్కెట్ల‌ను స‌బ్సిడీ కింద త‌క్కువ చార్జీల‌కు ఇస్తారా..? అంటారా..? అయితే మీరు పొర‌పాటు ప‌డిన‌ట్టే. ఎందుకంటే.. చెప్ప‌డానికి అది స‌బ్సిడీయే. కానీ దాన్ని ఇప్ప‌టికే చాలా మంది వాడుకుంటున్నారు. చాలా మందేమిటి..? దాదాపుగా రైలు ఎక్కిన వారంద‌రూ దాన్ని ఉప‌యోగించుకున్నారు, కుంటున్నారు కూడా..! అవును… అస‌లింత‌కీ ఏంటీ గంద‌ర గోళం అంటారా..? అయితే మీరే చ‌దివి తెలుసుకోండి..!

ఏమీ లేదండీ… ఎన్నో సంవత్స‌రాల నుంచి.. అంటే రైళ్లు ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి వాటిల్లో ఏ రైలు అయినా, ఏ కోచ్ అయినా, ఏ త‌ర‌హా సీట్ అయినా ప్ర‌యాణికుల‌కు దాదాపుగా 43 శాతం వ‌ర‌కు స‌బ్సిడీ ల‌భిస్తోంది. అంటే టిక్కెట్ రేట్‌లో మ‌నం చెల్లిస్తూ వ‌స్తున్న‌ది కేవ‌లం 57 శాతం మాత్ర‌మే అన్న‌మాట‌. మిగిలిన మొత్తాన్ని మ‌న‌కు రైల్వే స‌బ్సిడీగా అందిస్తోంది. అయితే ఈ విష‌యం ఇప్ప‌టి వ‌ర‌కు చాలా మందికి తెలియ‌దు. ఇక స‌బ్అర్బ‌న్ మెట్రో రైళ్ల‌లో టిక్కెట్ల‌పై 63 శాతం వ‌ర‌కు మ‌న‌కు స‌బ్సిడీ వ‌స్తుంద‌ట‌. దీన్ని రైల్వే శాఖ తాజాగా తెలియ‌జేసింది.

ఇలా సబ్సిడీ ఇవ్వ‌డం వ‌ల్ల రైల్వే వారు ఏటా దాదాపుగా రూ.34వేల కోట్ల‌ను న‌ష్ట‌పోతున్నార‌ట‌. అయితే దీని గురించి తెలియ‌జేయ‌డానికి, టిక్కెట్ల రేట్ల‌పై ఇస్తున్న స‌బ్సిడీని ప్ర‌యాణికుల‌ను తెలిపేందుకు రైల్వే శాఖ వారు ఓ వినూత్న ప్ర‌యోగానికి శ్రీ‌కారం చుట్టారు. అదేమిటంటే… రైల్వే టిక్కెట్ల మీద ప్ర‌యాణికులు ఎంత స‌బ్సిడీ పొందుతున్నారో టిక్కెట్ ధ‌ర వ‌ద్ద తెలియజేస్తున్నారు. ఫ‌స్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థ‌ర్డ్ ఏసీ, స్లీప‌ర్‌, సెకండ్ సిట్టింగ్ (రిజ‌ర్వ్‌డ్‌, అన్ రిజ‌ర్వ్‌డ్) జ‌న‌ర‌ల్ ఇలా ఏ క్లాస్‌కు చెందిన టిక్కెట్‌ను తీసుకున్నా దానిపై రేటుతోపాటు ఆ టిక్కెట్ వ‌ల్ల స‌ద‌రు ప్ర‌యాణికుడు ఎంత స‌బ్సిడీ పొందుతున్నాడో ఆ మొత్తాన్ని సంఖ్య రూపంలో టిక్కెట్ పై ప్రింట్ చేస్తున్నారు. ఇది రైల్వేకు క‌లుగుతున్న న‌ష్టాన్ని ప్ర‌యాణికుల‌కు తెలియ‌జేయ‌డం కోస‌మే అని ఓ అధికారి వెల్ల‌డించారు..!

అయితే రైల్వే శాఖ ఇలా టిక్కెట్ల‌పై స‌బ్సిడీ మొత్తాన్ని ప్రింట్ చేయ‌డం ఏమో గానీ ఓ ప్ర‌యాణికుడు ఐఆర్‌సీటీసీకి రూ.950 చెక్కును పంపాడు. తాను తీసుకున్న ట్రెయిన్ టిక్కెట్‌పై ఉన్న స‌బ్సిడీ మొత్తం రూ.950 అని ఉంది. దీంతో వేల కోట్ల న‌ష్టాల్లో రైల్వే శాఖ ఉంద‌న్న విష‌యాన్ని అత‌ను తెలుసుకున్నాడు. త‌న‌కు స‌బ్సిడీగా అందిన రూ.950 మొత్తానికి చెక్కు రాసి ఆ మొత్తాన్ని మ‌ళ్లీ వెనక్కి ఇచ్చేయాల‌ని ఆ చెక్కును ఢిల్లీలోని ఐఆర్‌సీటీసీ కార్యాల‌యానికి పంపాడు. అయితే నిబంధ‌న‌ల ప్ర‌కారం ఇలాంటి చెక్క‌ల‌ను స్వీక‌రించ‌లేమ‌ని రైల్వే అధికారులు అత‌నికి చెప్పార‌ట‌. అవును మ‌రి, వారు అలా తీసుకోవాల‌న్నా అందుకు నిబంధ‌న‌లు పెట్టాలి క‌దా. అవునూ, వంట గ్యాస్ స‌బ్సిడీ ఉప‌సంహ‌రించుకున్న‌ట్టు ట్రెయిన్ టిక్కెట్ స‌బ్సిడీ కూడా ఉప‌సంహ‌రించుకునే వెసులు బాటు క‌ల్పిస్తే దాంతో రైల్వే శాఖ వారు ఎంతో కొంత న‌ష్టాన్ని పూడ్చుకోవ‌చ్చు క‌దా. ఈ విష‌యం వారికి తెలియ‌జేస్తే చాలు, వెంట‌నే అమ‌లు చేస్తారు. మ‌రి అందుకు కూడా ఆధార్ అడుగుతారేమో..! ఏమో అడ‌గ‌వ‌చ్చు క‌దా..!

Comments

comments

Share this post

scroll to top