పెట్రోల్‌, డీజిల్ ల‌ను జీఎస్టీ కింద‌కు తెస్తార‌ట‌.!? ప‌్ర‌ధాని మోడీ మ‌రో షాకింగ్ నిర్ణ‌యం ఇదేనా.!?

ఈ ఏడాది జూలై 1వ తేదీ నుంచి కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌క జీఎస్‌టీ బిల్లును అమ‌లులోకి తెచ్చిన విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలోనే మొత్తం 4 శ్లాబుల్లో జీఎస్‌టీ విధిస్తున్నారు. 5, 12, 18, 28 శ్లాబుల్లో వ‌స్తువులు, సేవ‌ల‌కు జీఎస్‌టీ వేస్తున్నారు. అయితే వీటిలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఆల్కహాల్ లు మాత్రం లేవు. వీటిని జీఎస్‌టీ ప‌రిధిలోకి తేలేదు. దీంతో పాత ప‌ద్ధ‌తి ప్ర‌కార‌మే ఈ వ‌స్తువుల‌కు రేట్లు కొన‌సాగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో వేర్వేరుగా వీటికి ధ‌ర‌లు ఉన్నాయి. కాగా ఎప్ప‌టిక‌ప్పుడు పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్ ధ‌ర‌ల‌ను దృష్టిలో ఉంచుకుని వీటిని జీఎస్‌టీ ప‌రిధిలోకి తేవాల‌ని దేశ వ్యాప్తంగా చాలా మంది కోరుతున్నారు. మరి ఆ కోరిక నెర‌వేరుతుందా..? అంటే.. అందుకు అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది..!

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. త్వ‌ర‌లో పెట్రోల్‌, డీజిల్ ల‌ను జీఎస్టీ ప‌రిధిలోకి తేనున్నార‌నే వార్త‌లు ఈ మ‌ధ్య బాగా ప్ర‌చార‌మ‌వుతున్నాయి. సోష‌ల్ మీడియాలో అయితే ఈ అంశంపై అనేక పుకారు వార్తలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఈ క్ర‌మంలోనే కేంద్ర ప్ర‌భుత్వం పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని కొంత త‌గ్గించింది. ఆ మేర‌కు రాష్ట్రాల‌ను కూడా కొంత వ్యాట్ త‌గ్గించాల‌ని కోరింది. దీంతోనైనా వినియోగ‌దారుల‌కు కొంత ఊర‌ట క‌లుగుతుంద‌ని కేంద్రం భావిస్తోంది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రాలు ఏవీ పెట్రోలియం ఉత్ప‌త్తుల‌పై సుంకాన్ని త‌గ్గించలేదు. ఇదిలా ఉండ‌గా తాజాగా ప్ర‌ధాని మోడీ ఆయిల్, గ్యాస్ పరిశ్రమల అధిపతులతో స‌మావేశం అయ్యారు. అందులో భాగంగా వారు పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్టీ కిందికి తీసుకురావాలని ప్రధానిని కోరారు.

పెట్రోలియం ఉత్ప‌త్తుల‌ను జీఎస్టీ కింద‌కు తీసుకువ‌స్తే అందులో ఉన్న టాప్ శ్లాబు 28 శాతం ప్ర‌కారం లెక్క వేసుకున్నా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఇప్పుడున్న ధ‌ర‌ల్లో స‌గానికి స‌గం త‌గ్గుతాయి. క‌నుక ఇలా చేయ‌డం వ‌ల్ల సామాన్యుల‌పై పెరుగుతున్న పెట్రో ఉత్ప‌త్తుల భారం త‌గ్గుతుంద‌ని వారు మోడీకి చెప్పారు. మ‌రోవైపు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చే అంశంపై జీఎస్టీ కౌన్సిల్ పరిశీలించాలని ఇప్పటికే కోరారు. అయితే దీనిపై మోడీ సానుకూలంగా స్పందించార‌ట‌. ఈ విష‌యంపై అన్ని రాష్ట్రాలతో మాట్లాడి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని చెప్పారు. కాగా చూచాయ‌గా తెలిసిందేమిటంటే.. సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుని షాక్‌లు ఇచ్చే ప్ర‌ధాని మోడీ పెట్రో ఉత్ప‌త్తుల‌ను కూడా జీఎస్టీ కింద‌కు తెచ్చి సామాన్యుడి భారం త‌గ్గించ‌వచ్చ‌ని తెలిసింది. మ‌రి ఇది నిజ‌మ‌వుతుందో, కాదో వేచి చూడాలి. ఒక వేళ నిజంగానే వాటిని అలా జీఎస్‌టీ కింద‌కు తెస్తే అప్పుడు త‌గ్గే పెట్రోల్‌, డీజిల్ రేట్ల‌ను బ‌ట్టి ఆ వార్త జ‌నాల‌కు షాకింగ్ న్యూసే అవుతుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top