త్వ‌ర‌లో రూ.1500 ధ‌ర‌కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్లు అమ్ముతార‌ట తెలుసా..?

స్మార్ట్‌ఫోన్లు ఇప్పుడు సామాన్యుల జీవితాలను ఎలా ప్ర‌భావితం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. అనేక ప‌నుల కోసం వాటిని వాడుతున్నారు. ఒక్క ట‌చ్‌తో ఎన్నో ప‌నుల‌ను చ‌క్కబెట్టుకుంటున్నారు. మ‌రో వైపు యూజ‌ర్ల‌కు త‌గినంత వినోదాన్ని కూడా ఫోన్లు పంచుతున్నాయి. ఈ క్ర‌మంలో ఒక‌ప్పుడు ఉన్న రేట్లు ఇప్పుడు స్మార్ట్ ఫోన్ల‌కు లేవు. రాను రాను వాటి రేట్లు త‌గ్గుతూనే వ‌స్తున్నాయి. అయితే భ‌విష్య‌త్‌లో ఇంకా చాలా త‌క్కువ ధ‌ర‌కే… అంటే.. రూ.1500 కే స్మార్ట్‌ఫోన్ ల‌భించే రోజులు రానున్నాయి. అది కూడా చాలా త్వ‌రలోనే..! అవును, మీరు విన్న‌ది నిజ‌మే..! అతి త్వ‌ర‌లో రూ.1500 కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్లు మార్కెట్‌లో సంద‌డి చేయ‌నున్నాయి.

చైనాకు చెందిన మొబైల్ చిప్ త‌యారీ సంస్థ అది. దాని పేరు స్ప్రెడ్‌ట్రమ్‌ కమ్యూనికేషన్‌. స్మార్ట్‌ఫోన్ల‌లో ప్రాసెస‌ర్ల‌ను ఈ సంస్థ త‌యారు చేస్తుంది. రిల‌య‌న్స్ కు చెందిన ప‌లు లైఫ్ ఫోన్ల‌లో ఈ సంస్థ త‌యారు చేసిన ప్రాసెస‌ర్లే ఉన్నాయి. ఆ ఫోన్ల‌లో అమ‌ర్చిన చిప్ సెట్ల‌ను కూడా ఈ సంస్థే త‌యారు చేసింది. అందుకే ఆ ఫోన్ల‌ను రిల‌య‌న్స్ చాలా త‌క్కువకే యూజ‌ర్ల‌కు అందించింది. అయితే ఇప్పుడీ సంస్థే మ‌న దేశంలోని ప‌లు స్మార్ట్ ఫోన్ త‌యారీ సంస్థ‌ల‌తో క‌లిసి రూ.1500 కే స్మార్ట్ ఫోన్‌ను తెచ్చే యోచ‌న‌లో ఉంది.

ప్ర‌స్తుతం అత్యంత త‌క్కువ ధ‌ర క‌లిగిన 4జీ ఫోన్లు రూ.2500 నుంచి రూ.3వేల మ‌ధ్య యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి. ఈ క్ర‌మంలో రూ.1500కే 4జీ ఆండ్రాయిడ్ ఫోన్ వ‌స్తే అప్పుడు స్మార్ట్‌ఫోన్ల రేట్లు ఇంకా త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. అయితే కేవ‌లం స్ప్రెడ్‌ట్రమ్‌ కమ్యూనికేషన్ మాత్ర‌మే కాదు, రిల‌య‌న్స్ జియో కూడా రూ.1500 కే స్మార్ట్‌ఫోన్‌ను తెస్తామ‌ని గ‌తంలో ప్ర‌క‌టించింది. మ‌రి ఈ రెండు సంస్థ‌ల్లో ఏది ముందుగా రూ.1500కే 4జీ ఫోన్‌ను తెస్తుందో చూడాలి. ప్ర‌స్తుతం ఉన్న పోటీ మార్కెట్‌లో ముందు ఏ సంస్థ ఆఫ‌ర్ ఇస్తే అదే లాభాల‌ను గ‌డించే అవ‌కాశం ఉన్నందున ఈ రెండు సంస్థ‌లు ఎలా పోటీ ప‌డి రూ.1500 కే 4జీ ఫోన్‌ను తెస్తాయో, ఎలాంటి ఆఫ‌ర్ల‌తో ముందుకు వ‌స్తాయో మ‌రి కొన్ని నెల‌లు ఆగితే తెలుస్తుంది. ఏది ఏమైనా భార‌త్‌లోని స్మార్ట్ ఫోన్ యూజ‌ర్ల‌కు మాత్రం రూ.1500 ఫోన్లు వ‌స్తే పండ‌గే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top